Friday, 10 April 2020

// నీ కోసం 99 //

ఆద్యంతంలేని సంద్రంలా
ఇక్కడంతా పరుచుకున్న చీకటిలో
నా విరహం ప్రవహిస్తుంది

పదాలు కుదరని పల్లవి రాసే వేళ
నీ పెదవులు దాచుకున్న మౌనం
నా కనురెప్పల తడి కవితకు మూలమయ్యింది

నీ కలల తీరపు ఇసుక మెరుపుల్లో
అదుపు తప్పుతున్న నా ఊపిరి సెగలు
నువ్వూహించే సుమగంధపు విరిజాజులు కాగా
నన్ను సర్వనామముగా రాసుకొనే నువ్వు
రేయంతా ఆలకించేది నా పాటనేగా

ఎందుకంత దూరం నువ్వలా
మనసులు మాత్రం మాట్లాడుకొనేంత దగ్గరగా
ఇప్పుడేం చేయనూ...
కన్ను గీటుతూ కదులుతున్న కాలాన్ని
నువ్వొచ్చి చిత్తరువుగా మార్చేయి
మత్తుగా తూలుతున్న రాతిరిని రాజేయి 💕

No comments:

Post a Comment