Monday, 13 April 2020

// నీ కోసం 128 //

ఏకాంతంలో జ్ఞాపకాల పక్షులొచ్చి
ఆకాశం అంచుదాకా విహరిద్దాం రమ్మంటే
కాదని అనలేను

తరగని దూరాలు నింపే మధురాక్షరాలు
మెత్తని నిమలీకలై మృదుభావమవుతుంటే
అక్షరానికే నే వ్యసనమవుతూంటా

ఎదురయ్యే ప్రశ్నలకవి సమాధానాలో
అలిగే మౌనానికవో సంగీతాలో
అంతరంగాన్ని లాలించే ఆనందాల ఆదమరుపులవే

నిశ్శబ్దంలో మాయమయ్యే నాతో
ముచ్చటించేందుకు మనసుంటే సరిపోదు
ముట్టుకొనేవి మునివేళ్ళే అయినా
శూన్యాన్ని సరిహద్దుల్లో వీడి
ప్రేమద్వారం గుండా రావాలి
అతీతమైన స్మృతులొక్కటే ఆత్మీయమందుకే నాకు..💜

No comments:

Post a Comment