Thursday, 9 April 2020

// నీ కోసం 77 //

సంపెంగి సువాసనలో నిన్ను పోల్చుకున్నానని అలిగినట్టుంది
అపరాత్రివేళ పారిజాతం మెత్తగా తన పరిమళాన్ని ప్రకటించింది

నీమీద దాచుకున్న బెంగ ఏకాంతానికి నన్ను లోకువ చేసి..
ఆ క్షణమే నా విరహాన్ని ఆరా తీస్తున్నట్టనిపించింది

కొన్ని వేకువలు నిన్ను తడుముకొని
కౌగిలికందని కెరటమయ్యావని విచారించినట్టు తెలుసా..

కొన్ని సాయంత్రాలు కనుపాపలను ఓదార్చలేక
అనంతమైన అలౌకికాన్ని అరమోడ్పులుగా దాచుకున్నది తెలుసా..

కొన్ని నవ్వులు కన్నీటిలో కరిగి
కాలాన్ని మంత్రాక్షరంలా కలవరపెట్టింది తెలుసా

నీ స్మృతులు మనోతీగల్ని సవరించి
గుండెగదిలో ఆలపించిన కృతులు కాగా
రాతిరంతా మనసు గాలిలో తేలినట్టుంది 💜💕

No comments:

Post a Comment