Monday, 13 April 2020

// నీ కోసం 124 //

ఎదురుచూస్తున్న కళ్ళని వెలిగించి
మనసు నింపగలిగే హృదయ సంబంధం
అలలా ఉక్కిరిబిక్కిరి చేసే ఇష్టమైన వ్యాపకం
మల్లెపందిరి కింద నిన్ను పాడుకొనే ఆనందం

తెలుసుగా నా గొంతు
సీతాకోక నవ్వినట్టు
సింగిడీ విరిసినట్టు
సిరివెన్నెల జారినట్టు
పూలగాలి విరహాన్ని మోస్తున్నంత తీయగా
నిన్ను తలచినట్టు

ఆవిరి కాని ఆర్ద్రతలో అక్కున చేరి
అలవిమాలిన అన్వేషణ అనవసరమై
నీ తడిచూపు చివరికొసన నే మెరుపయ్యాక
దాచుకోవాల్సిన కలలేవీ లేవిప్పుడు

నా రెప్పలచప్పుడు నీకు సంగీతమయ్యిందంటే
గుండె గమకాన్ని నువ్వు పూర్తి చేయొచ్చనే అర్ధమిప్పుడు..💜💕

No comments:

Post a Comment