Wednesday, 15 April 2020

// నీ కోసం 137 //

నిన్నూ నన్నూ చూసి నవ్వే 
పువ్వుల అమాయకత్వం
ఈరోజైనా తెలిసిందా నీకు

గాలితరంగాలలో ఊయలూగే పక్షులు
పాట మరచి మౌనవించాయెందుకో
వసంతంలోని చింతనిప్పుడైనా చూసావా

చీకటి చిమ్ముతున్న రాతిరి
రేపటికి నిజం చేసుకొనే కలనిచ్చేందుకే
నిదురోమంటుందని నిజంగా తెలీదా

శూన్యాన్ని భరించలేని కాలం
నీ మనస్సంద్రంలో ముత్యాలు వెలికితీసేందుకే
జ్ఞాపకాలనిచ్చింది చూడు

యుగాల సుషుప్తిలోంచీ 
మేల్కొల్పేందుకే జీవితం
విలువైన అనుభూతులిచ్చిందనుకుంటా

ఎదురుగా పాలకడలి పొంగుతున్నా
తీరని ప్రేమదాహం
మౌనాన్ని లాలించగలిగే మోహానికి
మాత్రమే తెలిసిన తీయని సంతోషమనుకుంటే పోలా

నీ గమనంలో నేను
నా అతిథిలా నువ్వు
ప్రతిబింబిస్తున్న అద్దాలమంటే సరిపొతుందిగా..😁

 
 

No comments:

Post a Comment