Wednesday, 15 April 2020

// నీ కోసం 141 //

పెదవుల్లో పుట్టి..
కన్నుల్లో కావ్యమైన కల
నిద్దట్లో పూలగాజులు సవరించాక
మనసెటో అల్లరిపరుగు తీసినట్టనిపించింది

ఎప్పుడొచ్చావో నా లోపలికి
ఓ కొత్త పేజీ మొదలెట్టా
జీవితం పరిచయించిన ఈ వాసన
ఎంత పాతదో..
ఎప్పుడూ పాడుకొనే సాహిత్యం కనిపెట్టేసింది

ఇన్నాళ్ళూ నాది కాని దిగుల్ని 
మోసుకు తిరిగిన దేహం
దాగుడుమూతలాపి
విషాదాన్ని చెరిపేలా తిరగరాయమంటుంది

ఉన్న వ్యసనంలో వెతుక్కొనే సంతోషమే 
పరధ్యానంలోనూ నేనిష్టపడే ఆవరణం
ఏమో..జీవనదిగా మారి ప్రవహించాలిప్పుడు
సముద్రమంత విశాలత్వం సరిపడుతుందో లేదో తెలియాలంటే..💜💕  

// నీ కోసం 140 //

నన్ను నేను మరచిపోయేంత నిరీక్షణ
నువ్వు మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిన ప్రతిసారీ

నడుస్తున్న నిట్టూర్పు మన మధ్య దూరాన్నే కాక
నా గుండెను పొడిబార్చుతుంది

విచ్చిన పువ్వులన్నీ పరిమళించడం మరిచినట్టు
కలతబారిన దీపాలు దిక్కులు చూస్తున్నట్టు
సంద్రం మీదలిగిన అలలు ఒడ్డును పరితపించినట్టు
ఉచ్ఛ్వాసనిశ్వాసలు లెక్కతప్పుతున్న  ఊపిరులు

కొన్ని జన్మల ఎడబాటుని మోసుకు తిరుగుతున్న
 విరాగిని నేను
కనుకనే నీ పలకరింపు ఎదురుతెన్నుల
ప్రణయ కలలు కంటూ బ్రతికున్నా..💜 

// నీ కోసం 139 //

రాత్రయితే గుండెగదిలో వెలిగే దివ్వెలు
చీకటితో పాటూ నా విరహాన్నీ తరిమేస్తాయి

పగలంతా జారిపడేందుకు సిద్ధపడే కన్నీరు
పన్నీరై చెక్కిలిని ముద్దాడే క్షణాలకే తెలుసు
నిన్ను తలచే హృదయపు ఆర్తి

ఉక్కిరిబిక్కిరయ్యే మనసుకి ఆలంబన
నీ మమతేనేమో
నన్నిలా పలకరిస్తూ ప్రాణం పోస్తుంది

నీ ఒడి నా విశ్రాంతి మందిరం కనుకనే
మల్లెగాలినీ..మందహాసాన్నీ
వెంటేసుకొస్తాను

అలసిపోయిన నిన్ను సృజించే అవసరమేముందని
నీ రెప్పలమాటెలానూ  కలనై నే తెల్లారిపోతాను కదాని 💜  

// నీ కోసం 138 //

ఆ పువ్వులు..
తొలిసారి నా చేతికందిన నీ మనసు భావాలు
కాలాన్ని ఆపి పరిమళించిన ఆ రహస్యక్షణాలు 

నీకొక్కసారిగా అపురూపమైనట్టు
నాలో నేను అనంతమై..
నవ్వులతో ఆక్రమించిన ఆకాశానికి తెలుసో లేదో
కొన్ని దూరాల్ని కలిపిన వంతెన కింద
హృదయాల నడుమ ప్రవహిస్తున్న రంగులందులో ఉన్నాయని

ప్రతి వెన్నెలరాత్రీ కన్నుల్లో తురుముకొనే కల
నీలా మారిన ఋజువై
బంగారు కిరణాల వేకువై
నేనప్పుడు నీ గుండెలపై పసిపాపని

మధురోహల పరవశం కాసేపైతేనేమి
నేనున్న స్వర్గంలో మనిద్దరం కలిసున్నప్పుడు 💜  

// నీ కోసం 137 //

నిన్నూ నన్నూ చూసి నవ్వే 
పువ్వుల అమాయకత్వం
ఈరోజైనా తెలిసిందా నీకు

గాలితరంగాలలో ఊయలూగే పక్షులు
పాట మరచి మౌనవించాయెందుకో
వసంతంలోని చింతనిప్పుడైనా చూసావా

చీకటి చిమ్ముతున్న రాతిరి
రేపటికి నిజం చేసుకొనే కలనిచ్చేందుకే
నిదురోమంటుందని నిజంగా తెలీదా

శూన్యాన్ని భరించలేని కాలం
నీ మనస్సంద్రంలో ముత్యాలు వెలికితీసేందుకే
జ్ఞాపకాలనిచ్చింది చూడు

యుగాల సుషుప్తిలోంచీ 
మేల్కొల్పేందుకే జీవితం
విలువైన అనుభూతులిచ్చిందనుకుంటా

ఎదురుగా పాలకడలి పొంగుతున్నా
తీరని ప్రేమదాహం
మౌనాన్ని లాలించగలిగే మోహానికి
మాత్రమే తెలిసిన తీయని సంతోషమనుకుంటే పోలా

నీ గమనంలో నేను
నా అతిథిలా నువ్వు
ప్రతిబింబిస్తున్న అద్దాలమంటే సరిపొతుందిగా..😁

 
 

// నీ కోసం 136 //

చూపుల భూపాలానికి వెలిగే సూర్యునివో
చీకటిని గోరువెచ్చగ తరిమే దీపానివో

స్వప్న రహదారుల్లో తడిమిన బాటసారివో
యుగాల నిరీక్షణకి దొరికిన బంధానివో

నిలువెల్లా ఆర్తిని నింపుకున్న వివశానివో
నా మనోగీతి పల్లవించిన భావానివో

వేసవిలో పులకింతగా వర్షించే మేఘానివో
భాషకందని కన్నీటి తీపి భాష్పానివో

ప్రేమాన్వీ..నువ్వెవరో
మధుకావ్యపు మురిపానివో..💜

// నీ కోసం 135 //

చైత్రరథం కదిలొస్తున్న దారి ఇది
చిగురేస్తున్న ఆశలకు మేలుకొలుపు ఋతువు

మధుమాసపు కలవరాలు నిండు మది
విరహిస్తున్న దేహాలకు కలల ఋతువు

ఆపుకోని అలజడి వెల్లువైన నది
మూసిన కన్నులు నవ్వు మోహ ఋతువు

ఎండలు మండే కాలపు గారడీ విధి
నిశ్శబ్దం స్వరమైన వసంత ఋతువు

పూల ఋతువూ ..ప్రణయ ఋతువూ..
నువ్వు నాకు వరమైన శీతంగి ఋతువు 💕💜  

// నీ కోసం 134 //

పనిలేక పరుగులెత్తే గాలి
ఆవిరై ఎటు దాగిపోయిందో..

నోరెండి తాగిన చెరుకు తీపులన్నీ
మిట్టమగ్గిన వేళకే వేదనలాయే

ఊహలేసిన ఉయ్యాల ఊగుదామంటే
నేలేమో నిలబడమని నిందలాయే

నిప్పుకోడి నవ్వులాంటి నిదురంతా
నివురేసిన రాతిరల్లే రగిలిపోయే..

ప్రాణమందుకే ఒంటరయ్యింది
కల్పించుకొని ఒక్క పాటా నువ్వు పాడలేదనే..😒💜

// నీ కోసం 133 //

ఏ చుంబనపు తడి ..
రహస్యమై కలలో సువాసనగా  ఎగిసిందో
కన్నుల్లో వానాకాలపు మెరుపై వెలుగుతుంది

నీతో పంచుకున్న మురిపాలు
మౌనంతోనే ముగిసిపోగా
చీకటైతే మిగిలిన సగపాలై
మనసుని కొరుకుతుంది 

నిద్దురపట్టని ప్రతిరాత్రీ ఓ ఆర్తనాదమై
నిశ్శబ్దాన్ని చెరిచి 
జ్ఞాపకాల మంటై దహిస్తున్న సంగతి 
లోలోన ఒంటరితనపు వేదనై వినబడుతుంది

నాతో తెరమరుగైన నీలో ఆశ మిగిలున్నా
నిన్ను దాచిన బెంగ నాకో గాయమవుతుంది
నగ్నమైన కాగితం నాకందుకే లేపనమవుతుంది..!!

// నీ కోసం 132 //

ఆమె..
కాటుకలద్దిన కన్నుల చాటుగా
పెదవుల లత్తుక మనసుకి పూయగా
నా స్వప్నాన్ని నిజం చేసేందుకని
ఆకాశపు నిచ్చెన దిగి
నన్నో దేహానికి రాజుని చేసింది

నిద్రలేస్తూనే సూర్యోదయాన్ని ఎదకనుమల్లో చూపేది
అరమోడ్చిన కనుసైగతో సముద్రాన్ని కలంలో నింపి
కాగితంపైనే అలలూగించేది
నా చెలి 
పూలచీరను నెలవంకన నడుమొంపులో దోపేది

కాలాల ఒరిపిడి మెత్తని కదలికల్లో
దట్టమైన నిశ్శబ్దానికి కూజితాలు నేర్పి
నా మోహావేశపు ఉద్విగ్నతను తీర్చి
గుండె బరువు దింపిన దేవేరి
నా హృదయమకుటపు జాబిల్లి

ఎలా ఉన్నా ఆమె నా అద్దం
నా ప్రతిబింబాన్ని నాకు చూపిన సర్వస్వం 💕
అవును..ఆమంటే..నేనేనని తెలిసిందిలే..

// నీ కోసం 131 //

లేత ఆకుపచ్చ వనాల వెంట తిరుగుతున్న తుమ్మెద
పువ్వులను అనుసరిస్తూ గమ్యం చేరిందో
రమ్యమైన తేనె చినుకులు తాగి మత్తిల్లిందో 
ప్రకృతికి కనువిందైన ఆ దృశ్యం
ఊయల పాటంత బంధాన్ని వర్ణిస్తుంది

ఇక్కడేమో..
సన్నని నూగారు మీద సరిగమలు మీటినట్టు
నును బుగ్గలపై నీ స్పర్శ రాణిస్తుంది
నిద్దురలో ముద్దులాడే ఆ పెదవులరుచి
మనసుని తాకి మంత్రిస్తుందేమో మరి
ఏదో తీపి తనువంతా ప్రవహిస్తూ ఉండి
ఉదయానికల్లా ఓ ప్రణయరాగం వినిపిస్తుంది

మనోసీమలో కురిసిన మంచువానకి తడిచానంటే
ఇదెండాకాలమని నవ్వుతావెందుకు
రాతిరి వనమాలిగా మారిన విషయం ఒప్పుకోనట్టు 

// నీ కోసం 130 //

నీ మనసుకి నచ్చిన నేను
మధుమాసపు మల్లెలా నవ్వుకుంటూ
ముద్దమందారపురేకుల్లా ముగ్ధమవుతూ
ఆమని బృందావనగీతం పాడుకుంటూ
పూలతావినంతా మాటలుగా నీపైనే చల్లుతున్నా
ఎన్నో ఉదయాల సుప్రభాతాలు
మరెన్నో క్షణాల సంతోషాలు
పదాల పరవళ్ళుగా మార్చి 
నా ప్రాణాన్ని జతచేసి మరీ
నువ్వు చదివేందుకని అక్షరం చేస్తున్నా
నీ హృదయంలో చోటుచేసుకుని
కన్నుల్లో కలగా కమ్ముకున్నాక
నేనెక్కడున్నా ఏముందిలే
జీవితకాలపు కానుకనై ఇలా మిగిలాలనుకున్నాక 😊


// నీ కోసం 129 //

నీ ఊహలో నేనో జాబిలికూనలా
ఆచ్ఛాదనలేని చిరుగాలిలా
ఊయలూగుతున్న తెలిమబ్బులా
నీకిష్టమైన ప్రేమాన్వితని కదా

నాకూ అంతే..
నువ్వు నాకు గుర్తొచ్చినప్పుడల్లా
మనసు హద్దులు చెరిపేసుకుంటుంది
ఎక్కడినుంచో వినిపిస్తున్న నీ పిలుపు
రసప్లావితం కమ్మని గొంతెత్తుతుంది

గుటకలుగా మింగిన విషాదం నేనైతే
దాహాన్ని కలవరించే సముద్రం కదా నువ్వు
మౌనాన్ని హత్తుకొనే రాతిరి నువ్వైతే
నిశ్శబ్దాన్ని నెట్టేసే పగలేగా నేను

రెండుచెట్ల క్రింద అల్లుకుపోయిన వేళ్ళు మనమేమో
ఎన్నోజన్మల బంధం మనమైనట్లు
ఒకరికొకరం ఎలా పలకరించుకున్నామో
ఇరువురి కలలూ ఒకేలా కలబోసుకున్నట్లు 💜

Monday, 13 April 2020

// నీ కోసం 128 //

ఏకాంతంలో జ్ఞాపకాల పక్షులొచ్చి
ఆకాశం అంచుదాకా విహరిద్దాం రమ్మంటే
కాదని అనలేను

తరగని దూరాలు నింపే మధురాక్షరాలు
మెత్తని నిమలీకలై మృదుభావమవుతుంటే
అక్షరానికే నే వ్యసనమవుతూంటా

ఎదురయ్యే ప్రశ్నలకవి సమాధానాలో
అలిగే మౌనానికవో సంగీతాలో
అంతరంగాన్ని లాలించే ఆనందాల ఆదమరుపులవే

నిశ్శబ్దంలో మాయమయ్యే నాతో
ముచ్చటించేందుకు మనసుంటే సరిపోదు
ముట్టుకొనేవి మునివేళ్ళే అయినా
శూన్యాన్ని సరిహద్దుల్లో వీడి
ప్రేమద్వారం గుండా రావాలి
అతీతమైన స్మృతులొక్కటే ఆత్మీయమందుకే నాకు..💜

// నీ కోసం 127 //

అలిగిన రాధ మనసుకేమో
అంతుబట్టని సువాసన
మోహనవంశీ ఊపిరే చలిగాలై ఇటొచ్చినట్టు

కుండపోతగా కురుస్తున్న వెన్నెల్లో
నీ జ్ఞాపకాలు తడిపేస్తుంటే
ఆ పొన్నచెట్టు నీడనే నేనూ కూర్చున్నా

ఆ పచ్చి చూపులు గుర్తొచ్చినప్పుడల్లా
అటు బదులిచ్చేలా నవ్వనూ లేక
గుండె నిండా శ్వాసించలేక వెచ్చబడుతున్నా

మనమేమైనా దివ్యాంశులమా
పొద్దు ఎర్రబడితే.. దూరాన్ని చెరిపి
కౌగిలింతగా కలిసేందుకు..

ఏమో..ఇదేదో పరివేదనలా ఉంది
కొన్ని యుగాల విరహం నిజమేనని
నా కాటుక కరుగుతుంటే గమనిస్తున్నా 💕💜

// నీ కోసం 126 //

నీ నీలి నవ్వుల లాలింతకేమో
మనసుపడ్డ వెచ్చని స్పర్శ చినుకై
అణువణువూ తొలకరిజల్లులో తడిచిన పరిమళింత

సారంగ రాగాల స్వరజతుల వేళ
స్పందించు క్షణాల సువాసనేమో
సంధ్యా దీపపు సన్నజాజుల ధూపమంత

వెన్నెల తోరణం అల్లనల్లన కదులుతూ
నన్ను కవితలల్లమన్న మాట
రాబోయే పున్నమికని కలవరింత

విషాదపు అంచుల్లో ఆగిన ఆనందం
అవధుల్లేని గుండెసవ్వడి నేపథ్యమే
రీతిగౌళ రాగంలో సున్నితత్వమంత 💜💕

// నీ కోసం 125 //

వాలుచూపుల విరహ ప్రవాహంలో నేనున్నప్పుడు
భావవీచికవై నువ్విటు సంచరించేవాడివి

గుండెలపై ఆనందమాల మోసుకు తిరిగినాప్పుడంతా
కాలం కళకళలాడుతూ కదిలేది

నాలో విలీనమైన నీ వాత్సల్యమేదో
చమేలీపూల చెండై పరిమళించేది

పొద్దుతిరుగుడు పచ్చని నవ్వులా
నా పెదవి నెలవంకై విరిసేది

వదిలేసుకున్నవన్నీ జ్ఞాపకాలుగా మారాక
ప్రాణస్పందన ఆదమరుపయ్యింది

కళ్ళ ముందుకి రాలేని కల
రాతిరొచ్చి ముద్దులు పంచినట్టు
ఇప్పుడంతా గతితప్పిన పాటే పదమయ్యింది 😣😞

// నీ కోసం 124 //

ఎదురుచూస్తున్న కళ్ళని వెలిగించి
మనసు నింపగలిగే హృదయ సంబంధం
అలలా ఉక్కిరిబిక్కిరి చేసే ఇష్టమైన వ్యాపకం
మల్లెపందిరి కింద నిన్ను పాడుకొనే ఆనందం

తెలుసుగా నా గొంతు
సీతాకోక నవ్వినట్టు
సింగిడీ విరిసినట్టు
సిరివెన్నెల జారినట్టు
పూలగాలి విరహాన్ని మోస్తున్నంత తీయగా
నిన్ను తలచినట్టు

ఆవిరి కాని ఆర్ద్రతలో అక్కున చేరి
అలవిమాలిన అన్వేషణ అనవసరమై
నీ తడిచూపు చివరికొసన నే మెరుపయ్యాక
దాచుకోవాల్సిన కలలేవీ లేవిప్పుడు

నా రెప్పలచప్పుడు నీకు సంగీతమయ్యిందంటే
గుండె గమకాన్ని నువ్వు పూర్తి చేయొచ్చనే అర్ధమిప్పుడు..💜💕

// నీ కోసం 123 //

తెల్లవారుతూనే మొదలయ్యే తీపి ఆకలి
నువ్వు పంచే రసోదయానికని తెలుసా..

మనసు నాతో గొడవపడుతున్న ప్రతిసారీ
ఊహల గగనపు వీధుల్లో తిప్పుతున్నా నమ్మవా..

భ్రమరనాదాల మేలుకొలుపుతో
మనసుకింపైన కచేరీ మామూలే..

ఆకుచాటు కోయిల గొంతులో చిలిపిదనం
అనుకరిస్తున్న మన స్వరమూ నిజమే

వసంతగాలి వీస్తున్న సమయమంతా
నాకిప్పుడు కాలమాగిపోయిన విషాదం
కనుకే..
తడి కన్నులు పరచిన దారిలో పువ్వులు పలకరిస్తే
అది నీకై నిర్వచించిన నా కవితనుకో..😣💜

// నీ కోసం 122 //

మలిసంధ్య మసకచీకటి పోగేస్తున్న వేళ
దేవదారు పరిమళమేదో మనసుని కమ్ముతుంది

ఈ నిశ్శబ్దంలో నీ మాట
కాలపరిమితిని దాటిన ముఖాముఖి మురిపెమయ్యింది

సుదూరవనిలో నువ్వుంటూ
పంచేంద్రియాలకు పంచేంత పరవశమిచ్చావనేమో
నాకందే ఊపిరిలో లౌల్యమొచ్చి చేరింది

నేను మాత్రమే చాలన్న నీ మధురిమ
నా మౌనాన్నెటో తరిమేసింది

అస్తవ్యస్తంగా పరుచుకున్న నక్షత్రాలు పాడుతున్న పాటకి
అలుకలు తీరిన కన్నులు నవ్వుతుంటే
ప్రాణమొచ్చిన బొమ్మనై మెరుస్తున్నా..💕💜

// నీ కోసం 121 //

హృదయ విపంచిక మీటి రాస్తున్న
వలపు గీతిక...
మంచిగంధపు చిరుకానుకగా నీకందించువేళ
నీలిగంటల అంగరాగాలతో ఈ దేహం నాదైనా
మనోరూపం నీదని తెలిసీ
ఎన్నిసార్లని చూపులదారాలతో బంధిస్తావో చెప్పూ..

చందనచర్చిత చక్కిళ్ళలో చంద్రోదయాలూ
కన్నుల్లో కస్తూరిపువ్వుల కలనేతలూ
నువ్వెదురైతే పెదవులపై ఊపిరి సువాసనలూ
నీ స్పర్శనూహించినంతనే రాగరంజితాలు..

అధరమూ..మాధుర్యమూ ఒక్కటిగా కలిసిన
మంచుతెరల మాటు పొద్దు
ప్రణయరాగం నింపిన ఉల్లాసం
నీ వేణునాదానిదేగా కన్నయ్యా..

కాలమిప్పుడు కౌగిలికొచ్చిన తపఃఫలం
భావలోకంలో ఎదురుచూపులు అంతమైన ఇంద్రజాలం 💜💕

// నీ కోసం 120 //

ఎన్ని ఉదయాల బంగారుకాంతులు
పువ్వుల పెదవులపై జారి మేల్కొన్నాయో
నిదురలేని రేయి చివరిస్మృతిని అడగాలి

నిన్నే నింపుకొనే నా ఏకాంతం
ఊహల నిశ్శబ్దానికి తలపులు మూసుకున్నా
ఆకాశమే నీడలా నన్ననుసరిస్తున్న భావన

నిన్నావహించిన సంతోషంలో
నా ఉనికి సరిహద్దులేని అనుభూతి అయితే
మరోసారి నీ అరచేతిలో అక్షరమవుతాను

ఎప్పుడు రాసేవో చెప్పు ప్రేమాన్వీ
నీ మౌనంలో పడి నలుగుతున్న నేను
ఆ రాతల్లో మధురసుధా గానమవ్వాలి
ఇన్నినాళ్ళు కరువైన కాలాన్ని కావ్యం చేయాలి 💜💕

// నీ కోసం 119 //

నువ్వూ నేనూ ఒకటే..
కల్పించుకున్న చెలిమిలో
చినుకంత ఆనందం అరచేతిలో పడ్డప్పుడు

నా మాటలు గానీ..నీ మౌనం గానీ
నన్ను ఒంటరినని వెక్కిరించలేదు
లోలోనే నువ్వుండి నీడలానైనా జతపడ్డప్పుడు

నా నవ్వులోని మీగడంతా తినేసి..
కొన్ని జ్ఞాపకాలు నెమరేసుకొనేందుకు మిగిల్చావ్
ప్రియమైన గతమా
మనసింత అలుసా

నువ్వంటూ అబద్దమైతే
గుండె చేరిన గలగల కల్పితమా..
నేనో శిధిల శిల్పమన్నదే నిజమా..😣

// నీ కోసం 118 //

భలే మంచి రోజు
కలలో నిశ్శబ్దం ఇలలో శబ్దించిన సమయం
పెదవులపై తేనెతుంపర పాటై పలికిన క్షణం..

ఏకాంతపు ఆరాధన
అలలు అలలుగా నిన్ను తాకి తరించిన సత్యం
జీవాత్మ పరిమళంతో గుండె నిండిన వెచ్చదనం

చప్పుడు చేస్తూ కురిసిన జడివానకి
అల్లరిచేస్తున్న అక్షరాలు తడిచాయంటే
నీ సమక్షానికవి చేరింది నిజమే

సగం తెరిచిన మదిలోంచీ
నువ్వు బదులిచ్చిన సాయింత్రం
కన్నుల్లో నీటిచెమ్మల సాంత్వనలు ఋజువే

కొత్తగా కాలాన్ని కనికట్టు చేసేదేం లేదు
నీ వచనం నాకు పరిచయమున్న విషాదమే కనుక
నా పరధ్యానమూ ఎప్పటిలా నాకతిశమే..💜

Saturday, 11 April 2020

// నీ కోసం 117 //

అర్ధరాత్రి నీ గుండెచప్పుడు
కొంగున బంగారం ముడేసుకున్నట్టు
స్వరార్చన చేసి మరీ నాలో వెలుగు నింపింది

శీతకన్నేసిన నువ్వు చలిమంటేసినట్టు
నులివెచ్చగా కమ్ముకోగానే
మంచిగంధంలా నేను పరిమళించాను

దూరాన్ని చెరిపేందుకేమో
మధుమాసపు కోయిల తొలిపాటగా
నువ్వంపిన రాయబారమూ వినిపించింది

ఓయ్ ప్రేమాన్వీ..
సుదూరం నుంచి నావైపు నువ్వొచ్చింది నిజమేనా
నన్ను కౌగిలించిన ఆకాశం నీ దేహమేనా

అణువణువూ చిరునవ్వితే ఎలా ఉన్నానో చూడు
పాలల్లో గులాబీలు కలిసినట్టున్న నన్ను
నీ ఉగాది కవిత్వంలో నాయికను చేద్దువు 💜🤩

// నీ కోసం 116 //

శిశిరాన్ని ప్రేమించే సీతాకోకచిలుక
ఋతువుకి లొంగనిదానిలా
పూలవనమంతా పాట పాడుతూ తిరిగిం

చలి ఎండ కాసే ఉదయమిది
ఎప్పుడో పరిచయమున్నట్టు
ఘడియ ఘడియకూ నన్ను ఎటో తీసుకుపోతుంది

గుండె తేలికవుతున్న తరుణం
అణువంత తలపు
ఏకాంతాన్ని నీలా వచ్చి చెరిపేసింది

చద్దివేడి వలపంతా హృదయాన్ని ఆక్రమించి
చూపులు వికసిస్తుంటే
పెదవుల మధుపాత్ర సంతోషపు అంచులపైన ఆగింది 💕💜

// నీ కోసం 115 //

తొలిచూపు గుచ్చుకొని తీయని బాధయినప్పుడు
తెలీనేలేదు
మధురానుభూతికీ నొప్పి పుడుతుందని
పెదవులపై పూసిన నవ్వులు..
పరిమళాన్ని పీల్చేలోపే అవి నక్షత్రాలై మెరుస్తాయని

ప్రేమైక హృదయపు ఆనవాళ్ళ కోసం
వెతికింది లేకున్నా
నా కన్ను చూపిన నీ స్వప్నం
నిద్దురని దూరం చేసి
రేపటి మౌనాన్ని నేడే విరచిస్తుందని తెలిసాక
మాటలూ మరుగునపడతాయని

అపురూపమైన ఊహలన్నీ
కవితలుగా కలవరించే నేర్పు
అలలు అలలుగా ఎగిసి మరీ
సముద్రతీరమంత నిన్ను చేరడం
నాకిదే అసలైన జీవితసత్యం

విరామమన్నది లేదిప్పుడు
ఏకాంతాలు వాక్యాలుగా మారి
శూన్యం శూన్యమయ్యాక.. 💕💜

// నీ కోసం 114 //

అప్పుడే మెడ వెనుక మీదుగా
మెత్తగా వినబడ్డ పిలుపుకి బదులిచ్చేలోగా
అదేదో నిజం కాని కలలో నువ్వు కలిసినట్టు
నిశ్శబ్దంలో నిమజ్జనమవుతున్న భావన

హృదయమంతా ఖాళీ అయినట్టు
ఓ ఎడారిని తలపిస్తున్న శూన్యం
నువ్వున్నప్పటి సహజపరిమళాన్ని దూరంచేసి
జ్వరమొచ్చినప్పటి వేడి తెలుస్తున్న యాతన..

కొన్నిక్షణాల మధురోహలు చీకటిని పిలిచి
కునుకు తీసినప్పటి నిశ్చలం
గుండె ఊయల మీద నిన్ను ఊపలేని ఏకాంతమే
కోరి ప్రాణాన్ని ఒదులుకుంటున్న ఊపిరి ఉదంతం 😞😒

// నీ కోసం 113 //

శ్వాస మీద ధ్యాసపెట్టినప్పటి ధ్యానంలో నువ్వలా
కొండెక్కి గోగుపువ్వులు తెచ్చిన చందమామలా
సరసిజ సౌందర్య మునిమాపు వెన్నెల తొలకరివా

మనసులోని మాటలన్నీ కవిత్వంగా సరిజేసి
ఇన్నిరాసుల నీ ఊహలన్నీ మల్లెలుగా మూటగట్టి
మాఘమాసపు మనోముత్యాల మాలలల్లావా

రంగులచీరను ఇష్టపడి కట్టుకున్న వేళలా
నిశ్శబ్దరాగాన్ని తనలో దాచుకున్న రహస్యపుపోగులా
ఒక్కసారైనా నా దేహాన్ని తొడుక్కున్నావా

కనుచివరల రాలేందుకు సిద్ధపడ్డ కలనైనా
అనుభవం కోసమని జీవం పోసుకున్న ఒక్కక్షణమైనా
మౌనంగా అనుసరిస్తున్న నాకు నువ్వుగా కానుకవలేవా 💕💜

// నీ కోసం 112 //

నీ మనసుకి నచ్చిన నేను
మధుమాసపు మల్లెలా నవ్వుకుంటూ
ముద్దమందారపురేకుల్లా ముగ్ధమవుతూ
ఆమని బృందావనగీతం పాడుకుంటూ
పూలతావినంతా మాటలుగా నీపైనే చల్లుతున్నా

ఎన్నో ఉదయాల సుప్రభాతాలు
మరెన్నో క్షణాల సంతోషాలు
పదాల పరవళ్ళుగా మార్చి
నా ప్రాణాన్ని జతచేసి మరీ
నువ్వు చదివేందుకని అక్షరం చేస్తున్నా

నీ హృదయంలో చోటుచేసుకుని
కన్నుల్లో కలగా కమ్ముకున్నాక
నేనెక్కడున్నా ఏముందిలే
జీవితకాలపు కానుకనై ఇలా మిగిలాలనుకున్నాక 😊💜

// నీ కోసం 111 //

మనసుకి వెచ్చగా తగిలిన కన్నీటిబొమ్మ
నీ దీర్ఘకాల వేదనకు లేపనమై
లేలేత కవితగా మారిన సంగతి తెలిసినందుకేమో..

మౌనంలో నన్నంతా లీనం చేసి
మహత్తరమైన సంప్రదింపులన్నీ మదిలో కానిచ్చేసి
కొన్ని యుగాల సావాసాన్ని ఉపమానం చేసావు..

నోటి నిండా మకరందపు తీయదనమేమో
మనసులోనికి చొచ్చుకుపోతున్న పిలుపుకి
అనుభూతి తప్ప అవథి లేదంటూ..

ఎప్పుడో దాచుకున్న పులకరింతను నిద్దురలేపి
సముద్రమంత విరహాన్ని ప్రకటిస్తూ
గంపెడు పొగడపువ్వుల జల్లు కురిపించావు

ధీర సమీరలా కిలకిలరావాల కలను కదా నేను
నీ జీవితానికి మజిలీగా మారేంత మాయ
ఏ అడవి పూల దారిలో కనుగొన్నావో మరి 😉💜