Saturday, 15 May 2021

//నీ కోసం 373//

 ఇంతకుముందు నేనో ఎలకోయిలను

పదేపదే పాటలు పాడుతూ
పాడిందే పదిసార్లు పాడుతూ
ఉల్లాస..కులాసాగా ఉండేదాన్ని
కష్టాలు..కవ్వింపులూ.. నిరాశలూ.. నిట్టూర్పులూ..
ఎన్నున్నా పట్టించుకోకపోయేదాన్ని..

నేనెవ్వరని నువ్వు అనుసరించింది మొదలు
ఓ ఏకాంతనైపోయా
ప్రేమ విత్తులోంచీ మొలకలొచ్చి అంటుకోరినట్టు ఆలంబన కోసమని ఆర్తిగా ఎదురుచూస్తున్నా
నాలో నేనే నిద్దుర మరచి
ప్రకృతిని విడిచి..స్వప్నం నుంచీ స్వప్నంలోకి
మెలకువలోనే నడిచిపోతున్నా
అణువణువూ అలమటిస్తూ
అర్ధంకాని యాతనలో నలిగిపోతున్నా

దారితప్పిన వసంతం నీలా నా చెంతకొచ్చిందో
అంతరంగంలోని పువ్వులు భావుకలై కిలకిలమంటున్నాయి
మెత్తని మురిపెం నీ ఎదని ఆకాశం చేసి రమ్మందో
రెక్కలు కట్టుకు నేనొచ్చా ప్రపంచానికి దూరంగా పోదామన్నావనే
ప్రేమాన్వితగా పేరునూ మార్చేసుకున్నా 
నీ సకలమూ సర్వమూ కమ్మంటూ నువ్వు పిలుపునిచ్చావనే

No comments:

Post a Comment