Monday, 10 May 2021

// నీ కోసం 325//

 హద్దుమరచి ప్రవహిస్తున్న అనురాగం పరవళ్ళు తొక్కితే నయాగరాను మించిందన్న ఊహలో నేనున్నప్పుడు.. తన్మయంతో తడిమిన చినుకులు కురిసాయంటే నమ్మాల్సిందే నువ్విప్పుడు..


ఒక్కసారిగా మొదలైన వివశత్వం కల్పించుకున్నదే అయినా నీ జతలో నన్నుంచి హాయిరాగపు సమ్మోహనాన్ని చుట్టబెట్టింది నిజం..ఆనందపు చలువపందిరి వేసిన నీ తలపులు లోలోన దోబూచులాడుతూ నాకో కొత్త ఆటను పరిచయించినట్టు..సమయానికి వేరే ధ్యాస పట్టనట్టుంది తెలుసా..

చూస్తూ చూస్తూ ఇన్నిరాగాల పలకరింపులు ఏ యుగళాన్ని ఆలపించేందుకు సిద్ధమవుతున్నవో..నాలో సుతిమెత్తని నీ మాటల సందడి మొదలైంది..మధురోహలన్నీ మోహమై కురిసేకాలం ముందున్నందుకే ఈ కాస్త మౌనానికి మాటలు నేర్పుతున్నా..నీ చూపుల అల్లరికి సైతం కలిపి బదులివ్వాలని..

కలలంచునే నిలబడి ఉండు అందాకా..నేనొచ్చి పులకింతనై నిన్ను పిలిచేదాకా..  



No comments:

Post a Comment