ఎలా..ఎప్పుడూ అని అడుగకు
నువ్వు నాకు ముందే తెలుసు
కేవల పరిచయముగా
మాత్రమే కాదు
ఇంతకు మునుపే..
పిలవకుండా మనసు గదిలోకి వచ్చావో
వలపు చందనం రహస్యంగా చల్లావో
కలలోకి వస్తున్నట్టే వస్తూ
నిదురని మాయ చేసి వెళ్ళావో
మాయామోహానికి చిక్కానని అంటారు గానీ
ఎవ్వరూ నమ్మరిది
నీలాకాశం చూస్తూ నిలబడిపోతున్నా
ఇష్టమైన పరిమళానికీ తడబడిపోతున్నా
ఇక్కడిక్కడే ఉండి ఉంటావని వెతుక్కుంటున్నా
కథనమో..కల్పనోనని అనుకోకు
కాలాతీత క్షణాల కౌగిళ్ళు అవన్నీ
నీ కన్నులే నులుముకుంటావో
నా నవ్వులే నెమరేసుకుంటావో
ఏకాంతాన్ని సవరించి చూడొకసారి
ఆకుచాటు పువ్వులా నా జ్ఞాపకమో..రూపమో గుర్తు రాకపోదు..
No comments:
Post a Comment