Monday, 10 May 2021

//నీ కోసం 327//

 సగం రాసి ఆపిన కవితని పూర్తి చేస్తావని

నీ కౌగిట మౌనమై ఒదిగున్న వేళ
నువ్వో విరహమై నిశ్శబ్దాన్ని ఆవిరిగా మారుస్తావని ఆశించా

నాకు నేనుగా విపంచినై శృతి చేసుకున్నాక
నీ స్పర్శలో నూరు వసంతాల పారవశ్యాన్ని పొందాలనే
తపించిన తీరమై నువ్వు ముంచెత్తాలని ఎదురుచూపుని పరిచా

రాలుగాయి రాగాల నేపధ్యపు రహస్యంలో
నీ అల్లరి నాలో రేపుతున్న అలజడి
చెక్కిలిపై తియ్యని నీటిబొట్టుగా నవ్వడం గుర్తించా

ఇదో కలయని..
బరువుగా కదులుతున్న రెప్పలతాకిడికి తెలుసుకున్నా

అదేమో మరి
చూపులతో వెన్నెల కుమ్మరిస్తూ నీ కళ్ళు..
బుగ్గలపై  నులివెచ్చని తడి.. 
సందిగ్ధంలోకి నెడుతుంటే
గుండెలపై నిన్ను తడుముకొని
రేపు అడగొచ్చు లెమ్మని మరోసారి నిమీలితనై సోలిపోయా 

No comments:

Post a Comment