మంచుపూల వానలా మనోహరం నువ్వు..
తడిపొడి మాటలన్నీ మౌనంలో కలబోసి నిశ్శబ్దానికే తత్వం నేర్పిస్తావు. అన్వయించుకున్న అనుభూతులు స్వప్నంలో పొదిగేసి పగలూరేయీ బజ్జోమంటావు. కాలాన్ని కవిత్వం చేసి ఆకాశాన్ని కాగితంగా ఒక్కో నక్షత్రాన్ని అక్షరం కమ్మంటావు.
హృదయం లయించిన అద్భుతమంతా ఆ పెదవుల తీపిగా నాకందిస్తావు. నిర్వచనానికందని రాగాలు ప్రవాహాలై ఉప్పొంగేలా తనివితీరని పాటలు వినిపిస్తూ.. పురివిప్పినట్టయ్యే కురుల కెరటాల్లో అరచేతుల ఆటలాడి వివశాన్ని పెంచేస్తావు. అల్లిబిల్లి తపనల అంతర్వాహిని అనంతమై తడిపేదాకా గిలిగింతలు పెడుతూ నులివెచ్చని చూపులతో అల్లుకుంటావు.
ఓయ్.. కొనగోటి కవ్వింతలతో క్షణాలను ఆపింది చాలుగానీ నిద్రొస్తున్న రెప్పల కలయికలో వచ్చి చేరమంటున్నాగా. ఉదయానికంతా నీ అల్లరి చిరునవ్వుల పల్లవిగా నీకు వినిపిస్తా.. ఇప్పటికిలా కాసేపు మనసు దాచుకోనీ, మధురమైన స్వగతం కానీ..
No comments:
Post a Comment