Friday, 14 May 2021

//నీ కోసం 355//

 కేవలం బ్రతికుండటం మాత్రమే

జీవిస్తున్నట్టు కాదని
నీకెలా చెప్పాలి..

బాధని ఆస్వాదిస్తూ 
మిగిలిపోయిన నేను
ఒక్క పలకరింపు కోసం ఎదురుచూపుల దారిలో అలసిపోయి
పువ్వులతోనూ.. పుస్తకాలతోనూ మాట్లాడుతూంటాను

ఒక్క స్పర్శకని వేసారిపోయి
కన్నీటిని చప్పరిస్తూ
పెదవుల తడిలో ముద్దుల్ని మరచిపోతాను
అనుభూతిని ఆపలేని ప్రతిసారీ
కదులుతున్న కాలంతో ఘర్షణ పడుతూ
ప్రేమ ఆనవాళ్ళ కోసమని వెతుక్కుంటాను

నిశ్శబ్దంలో జపం చేసిన పేరుని 
ఊహలకు సొంతం చేసి 
కాసేపలా విషాదానికి దూరమవుతాను 
ఏకాంతాన్ని దిగులొచ్చి పరిహసించినప్పుడల్లా
మరో లోకానికి పోయే మార్గమేదని అన్వేషిస్తాను

No comments:

Post a Comment