Saturday, 15 May 2021

//నీ కోసం 365//

 నిన్ను పొందాలనుకున్న తపన

తీర్చాలనుకున్న కాలం
నీ స్పర్శలోనే నిద్రించమని
నన్ను కలలకు దగ్గర చేసింది

నీ కన్నుల్లో వెలిగించుకున్న ఆర్తి
నన్నో వినూత్న అనుభూతికి చేర్చి
మాటలకందని కొత్త ప్రపంచాన్ని
మదిలోనే సృష్టించింది

నిన్ను కలుసుకోవాలనే తలంపు
నాలో సంతోషమై విరబూసాక
బుగ్గల్లో రాజుకున్న నవ్వు
తనువంతా స్పందించేంత వెల్లువైంది

వెన్నెల మైదానమంతా
శూన్యంగా ఉందని ఆడిపోసుకోకు
శతకోటి కిరణాలకళ్ళతో చంద్రవంక
మన కౌగిలింతలోని తమకాన్ని
చూసేందుకు ఒరిగిందని ఊహించు

No comments:

Post a Comment