అనుభూతిరాహిత్యపు జీవనవిషాదంలో
నన్నుగా మిగలనివ్వని కృత్రిమత్వం
గాఢమైన సంవేదపు సహానుభూతిలో
అఘోరాత్రులూ తడికన్నుల చెదిరిన స్వప్నం కాగా
పెదవుల మీద పరచుకున్న పున్నమి
నిశ్శబ్దపు నీలిజాడలు తప్ప
నవ్వుల వాసనేదీ తగలని సుదీర్ఘశ్వాసలో నలిగి
సర్దిపుచ్చుకోలేని నిస్సహాయతలో పెనుగులాడుతుంది
నేనేమో..
కదలికలేని అల్పమైన క్షణాలు
నిట్టూర్పుల ముభావానికి ప్రాణం పోసి
హృదయపు ఆనవాళ్ళను చెరిపేస్తాయేమోనని
గట్టిగా ఊపిరి పీల్చేందుకూ ఆలోచిస్తున్నా
అవును.. జంటను వెతికి అలసిపోయిన చకోరం
వెన్నెలను తాగి స్పృహ తప్పినట్టు
నిన్ను పలవరించి.. ఊపిరి సలపనివ్వని
అనిశ్చిత సుషుమ్నావస్థలో ఉన్నా మరి
No comments:
Post a Comment