Wednesday, 12 May 2021

//నీ కోసం 345//

 తను:  ఒక చిన్నమాట కూడా లేని ఏకాంతంలో

కిటికీలోంచి వెన్నెల
అది తప్ప మరే వెలుతురు లేని వింతకాంతిలో
శ్వాస వినపడే మౌనంలో.
లోపలి నిన్నూ నన్నూ 
ఒక్కటిగా కలపడానికి ప్రయాణం చేసిన 
దేహాలు పక్కపక్కనే
పసిపాపలై
లోపల చెలరేగిన అనంతాన్ని 
భాషకందక దాచుకున్న అద్వైతాన్ని 
బైటపెట్టలేక దేహాలు పడే అవస్థకి ముందరి 
లాలిత్యంలో నిన్ను నా గుండెలపైకి తీసుకుని 
ఆ మౌనంలో ఐతే బజ్జుంటా .. 

నేను :   సరే,  ప్రతి సంధ్యలో నాకోసం ఎదురుచూసి
నేను ఆనవాలు పట్టే ఇష్టాన్ని వెదజల్లేలా
మోహాన్ని రాస్తుంటావని నాకెప్పుడో తెలిసినా
కన్నుల కనుమల్లో కలత నవ్వులు
ప్రేమ రహస్యాన్ని విప్పిచెప్పని చీకటిరాత్రిపై 
అలగడం తెలియని అశ్రుకావ్యాలుగా
రెప్పల పెనవేతల నడుమ వెచ్చదనంలా
మృదువైన ఊపిరికి గంధంలా
నా జీవితానికి పండగంటే నువ్వు కనుకే..
మనసుతోటలోకి నువ్వొచ్చినప్పుడు
మొగ్గలు పువ్వులై విచ్చుకున్నట్టు
నేనూ నీలో..పరవశించి.. పరిమళించి విశ్రమిస్తాను

No comments:

Post a Comment