అప్పటికే నిద్దురతో బరువెక్కిన కళ్ళు
గాఢమైన మత్తులో సహానుభూతిగానిన్ను వెతికాయేమో..
అసలే తమకంగా ఉండే నన్ను
నీ మనోంతర్గక మృదుత్వమేదో తడుముతుంది
వసంతం కొన్ని పరిమళాల్ని
నా పెదవి చివర ఆపిందేమో
చిరునవ్వుల తీపేదో.. నీకు తెలిసినట్టు
ఆ తదేకమైన చూపుకి
సుషుప్తిలోంచే నే బిడియపడుతున్నా
వెచ్చగా నువ్వాడే ఊసులదే భాష
కావ్యార్ధాలనారాతీసే సమయం లేదు
ఆరోహణావరోహణలు స్వరాలకి మాత్రమే అయితే ఉచ్ఛ్వాస నిశ్వాస మూర్ఛనలకే
నేనిక్కడెందుకో మందారంగా మారిపోతున్నా
మసక చీకట్లో కురుస్తున్న తపనల వానకి
గుండె చెమరింపు కొత్త అలవాటేం కాదు
హృదయపు తలుపులు వాటంతటవే తెరుచుకోవడం
మానసిక ధ్యానమంతా ఉద్వేగమవ్వడం
నా ప్రాణంలో నువ్వొచ్చి చేరినప్పటి సంగతిలే
No comments:
Post a Comment