Friday, 14 May 2021

//నీ కోసం 352//

 ఒక్క ఆకూ కదలని సాయింత్రం 

కనుపాపలకి మౌనసాహచర్యంలా 
చిగురాకంత చిన్నినవ్వుతో తలపుకొస్తావు

సంకల్పిత క్షణాలన్నీ మధురం చేస్తూ
ఆకాశవర్ణంలో చిక్కుకుపోయేలా
పంచమస్వరాన్ని చిద్విలాసంగా పంచుతావు

గతం ముంగిట్లో వాలే అవకాశమివ్వకుండా
కొత్త దారుల వెంట అలుపురాని అనురక్తి ఉన్నదని
ఆనందపు సరిహద్దులకు చేర్చి నిలబెడతావు

కాలమా..
మనసుని విహంగయానం చేయించమని ఎవరు చెప్పారే..
సుందర స్వప్నాలు రేయికి మాత్రమే సొంతం కావని
చిరకాలం అనుభవించదగ్గ కమ్మని కవితలని తెలుసుకున్నాలే
అందుకే..గంగలో మునిగినా..వెన్నెల్లో తడిచినా..
ఆరని ఆశలన్నీ అక్షరాలుగా అలంకరించేస్తున్నా
వెలుతురే ముగ్ధ సౌందర్యమని చాటి చెప్పేస్తున్నా 

No comments:

Post a Comment