Tuesday, 18 May 2021

//నీ కోసం 374//

 నేను నిన్ను నా ఆత్మీయునిగా

అపార్ధం చేసుకున్నానా

నాలో అత్రుత
నాకన్నా ముందే నిద్రలేచి
వెలుతురు చీకటిని వెళ్ళమనకుండానే
ఎప్పుడూ నిన్నే కాచుకునుంటుంది

నా భావావేశం సంకీర్ణ గానమై
నీలో అద్వితీయాన్ని అమరం చేసి
హృదయపూర్వక వాత్సల్యాన్ని కురిపిస్తుంది

నా మది
నీ స్పర్శ తాలుకూ జ్ఞాపకాన్ని
మల్లెల్లో  మరువాన్ని కలిపి రంగరించి
ఇప్పటికీ పరిమళంగా దాచుకునుంది

నువ్వేమో అన్నీ తెలిసినా
ఏదీ తెలీనట్టు నిమిత్తమాత్రమైనట్టు
నిమీలితాలు టపటపలాడిస్తూ నవ్వుతుంటావు

ఓయ్ చెప్పూ..
ఎంతో దగ్గరై, ఇంకెంతో దూరమైనట్టు
నీకు దాగుడుమూతలు అంతిష్టమా

Saturday, 15 May 2021

//నీ కోసం 373//

 ఇంతకుముందు నేనో ఎలకోయిలను

పదేపదే పాటలు పాడుతూ
పాడిందే పదిసార్లు పాడుతూ
ఉల్లాస..కులాసాగా ఉండేదాన్ని
కష్టాలు..కవ్వింపులూ.. నిరాశలూ.. నిట్టూర్పులూ..
ఎన్నున్నా పట్టించుకోకపోయేదాన్ని..

నేనెవ్వరని నువ్వు అనుసరించింది మొదలు
ఓ ఏకాంతనైపోయా
ప్రేమ విత్తులోంచీ మొలకలొచ్చి అంటుకోరినట్టు ఆలంబన కోసమని ఆర్తిగా ఎదురుచూస్తున్నా
నాలో నేనే నిద్దుర మరచి
ప్రకృతిని విడిచి..స్వప్నం నుంచీ స్వప్నంలోకి
మెలకువలోనే నడిచిపోతున్నా
అణువణువూ అలమటిస్తూ
అర్ధంకాని యాతనలో నలిగిపోతున్నా

దారితప్పిన వసంతం నీలా నా చెంతకొచ్చిందో
అంతరంగంలోని పువ్వులు భావుకలై కిలకిలమంటున్నాయి
మెత్తని మురిపెం నీ ఎదని ఆకాశం చేసి రమ్మందో
రెక్కలు కట్టుకు నేనొచ్చా ప్రపంచానికి దూరంగా పోదామన్నావనే
ప్రేమాన్వితగా పేరునూ మార్చేసుకున్నా 
నీ సకలమూ సర్వమూ కమ్మంటూ నువ్వు పిలుపునిచ్చావనే

//నీ కోసం 372//

 


కన్నులు మూసి మనసు తెరిచిన ప్రతిసారీ నువ్వే. 
అసలు మూసి ఉన్న తలపుని తెరిచి లోనికెలా వచ్చావ్ ?!

చెక్కిలి మీద ఈ అత్తరు తడి వెన్నెల ఊహలా ఉందే, 
అసలు నాకు తెలీకుండా ముద్దెప్పుడు పెట్టావ్ ?!

కారుమేఘపు నీలి వాసనేస్తూ... పసిపాపను హత్తుకున్నట్టు, 
చల్లని ఈ అనురాగం నీ నేపధ్యమా ?!

సద్దు చేయని నీ స్వరం.. కనురెప్పలకు నేర్పిన రాగమాలిక, 
ప్రతి సంధ్యకో పాట పాడుతుంది తెలుసా ?!

దారి తప్పిన మలుపులో ఎలా కలిసావో, లయగా కుదిరిన పరిచయం,
 తీపి జ్ఞాపకమై మిగిలిపోలేదా ?!

ప్రేమాన్వీ...
అలౌకిక తీరాల మధ్య ఈ వేసవి సాయింత్రం, 
కన్నీటి అవధులు దాటి చిరునవ్వుగా వెలుగుతుంది చూడు


//నీ కోసం 371//

 కదులుతున్న క్షణాలకు

మంత్రముగ్ధమవడం నేర్పిందెవరో
ఈ నిశ్శబ్దంలో నీకు వశమైన
నా ఆలోచనను ఆరా తీయాలి

అంతులేని మధురిమను
మది పదేపదే కోరుతుందంటే 
మౌనప్రతిమకు మోహమొచ్చిన వేళ
పరవశాలు కూజితాలని తెలిసినట్టుంది

నవ్వుతూనే ఉండాలనుందిప్పుడు
నీతో అల్లరి నేర్చిన కనుపాపలు
రెప్పలు మూసినా రేయంతా వలపు కచేరీలో
తరతరాల విషాదాన్ని వెలివేసినప్పుడు..

//నీ కోసం 370//

 నవ్వే నీ కళ్ళు వేకువ చుక్కలు

నన్ను మేల్కొలిపే దీపాలు
నా అందమైన ఊహాలోకానికి వారథులు
ఏకాంతపు కలల ప్రాకారాలు

మేఘాలకొసకు పుట్టిన మెరుపులు
విరజాజి రేకుల్లో పాలదొంతరలు
నీ సమస్త భావాల ప్రకంపనలూ
నన్ను నీలో కలిపేసుకున్న భాష్యాలు

ప్రేమాన్వీ..
నీ చూపుల తాదాత్మ్యాలే
నే నిరంతరం పేర్చుకొను పదాలు
అవి ఎగిసిపడే అలల వెన్నెలపొరలైతే
మనసంతా అత్తరు ప్రవాహాలు
తొలివలపు లాలస మేలిముసుగులో
నన్ను రగిలించే చిలిపి మోహపుధారలు

//నీ కోసం 369//

 ప్రకృతి పరవశించేందుకో వసంతకాలం

సృష్టికి సమంగా ఉంది

చిరుగాలి వింజామరల ప్రయత్నం
పరిమళాలు పంచేందుకేనంది

మత్తెక్కిన భ్రమరనాదాల సంగీతం
పూలనాకర్షించేందుకే ఉంది

కొమ్మలమాటు కోయిల గానం
పులకించిన ప్రేమరాగమంది

గుండెగొంతులో ఆగిన కూజితం
నువ్వొస్తేనే స్వరమవుతానంది..

//నీ కోసం 368//

 విషాదపు గదిలో నేనున్నప్పుడు కదా నువ్వొచ్చావు

తలుపు తీసిన కొన్నిరోజులకేగా
నేనంటూ ఉన్నాననే స్పృహ కోల్పోయాను

 ఊపిరి సలపనివ్వని మాటలతో
నీ సమక్షంలో నిద్దురకు సెలవిచ్చిన రాత్రులవే
బంగారు క్షణాలంటే తెలుసుగా

పలుమార్లు పలవరించి లోకువయ్యానేమో
నీకుగా నువ్వు నిశ్శబ్దంగా వెనకొచ్చి.. ఇప్పుడెందుకో శూన్యాన్ని నాలో నింపి పోయావు

ఇచ్చేందుకే మనసుందని తెలిసిన నాకు..
మౌనపుగుట్టుని ఆరాతీస్తే చెలిమి అంతమవుతుందని తెలీదు..

పొంతనలేని పదాలను కూడా చేరదీసి కలపగలను గానీ
అపరిచితమై కయ్యానికి సిద్ధమైతే ఏం చేయనూ..

//నీ కోసం 367//

 పున్నమిచెర వీడని రాతిరి

నా ఊహల సౌధంలో నువ్వు

హృదయం ఒలికే సమయానికే
కెరటంలా ఉరకలేస్తూ కమ్ముకున్నావు
తేనెలో తీపివో..చినుకులో వర్షానివోనని
ఆలోచించేలోపే గలగలమని నవ్వించావు

మెత్తగా నేనాలపిస్తున్న పాట 
నీ మనసు రాసుకున్నదేనని కనిపెట్టేసావు..
వినీ వినిపించనట్టు నీ హృదయస్పందన
నాకిప్పుడో సుమధుర సావేరిరాగం చేసావు..

నిశ్శబ్దం ఎక్కడుందిప్పుడు 
కళ్ళతో కౌగిలించి నన్ను మచ్చిక చేసేసుకున్నప్పుడు 









Attachments area

//నీ కోసం 367//

 నీ మౌనం నన్నెంత దూరం నెట్టిందంటే

నా నవ్వును పూర్తిగా గుంజుకుపోయింది
ఏ మహిముందనుకున్నావో మరి మౌనంలో
నా మదిలో వెన్నెల మగతలో జారినట్టుంది

నిజంగా..
లోలోపల రంగులన్నీ అలుక్కుపోయినట్టు
క్షణానికో కలవరం కావలించినట్టు
నక్షత్రాలు వెలగలేమని రాలిపోయినట్టు
కన్నుల్లో ఉత్సవం ముగిసిపోయినట్టు
చుట్టూ చీకటి బొట్టు బొట్టుగా సాగినట్టు..
ఇప్పటిదాకా మూగినట్టే ఉన్న నీ నీడ అంతర్ధానమై
చలిగాలి ఎత్తిపొడుపుకి మనసు కుంగినట్టు
ఇంకా ఏం చెప్పను..

పలికే పెదవికి విరామమిచ్చినందుకేమో
స్వరాలు తెలిసిన గొంతు మాత్రం
ప్రేమగా నీ పేరునే పలవరిస్తుంది.

//నీ కోసం 366//

 నీ కళ్ళెంత పని చేశాయి చూడు..!


చూపుల దారిని తొలుచుకుని, 
గుండె కోట తుదకంటా దూరి, 
వలపుల ముట్టడి చేశాయి...

ఇష్టానికో విలువను అద్ది,
పరవశానికో పాటను జత కట్టి,
జంటరితనాన్ని తలపుల కొలువులో చేరమని 
కనుసైగల ఆజ్ఞలు జారీ చేశాయి...

ఎదురుగా నువ్వున్నందుకే 
ఇదంతా అనంటే నమ్మవుగానీ, 
నా కనుపాపల్లో ఎవరు కనబడుతున్నారో...
చూసి చెప్పు ఓ సారి..!


//నీ కోసం 365//

 నిన్ను పొందాలనుకున్న తపన

తీర్చాలనుకున్న కాలం
నీ స్పర్శలోనే నిద్రించమని
నన్ను కలలకు దగ్గర చేసింది

నీ కన్నుల్లో వెలిగించుకున్న ఆర్తి
నన్నో వినూత్న అనుభూతికి చేర్చి
మాటలకందని కొత్త ప్రపంచాన్ని
మదిలోనే సృష్టించింది

నిన్ను కలుసుకోవాలనే తలంపు
నాలో సంతోషమై విరబూసాక
బుగ్గల్లో రాజుకున్న నవ్వు
తనువంతా స్పందించేంత వెల్లువైంది

వెన్నెల మైదానమంతా
శూన్యంగా ఉందని ఆడిపోసుకోకు
శతకోటి కిరణాలకళ్ళతో చంద్రవంక
మన కౌగిలింతలోని తమకాన్ని
చూసేందుకు ఒరిగిందని ఊహించు

//నీ కోసం 364//

 సంపెంగి సువాసనలో నిన్ను పోల్చుకున్నానని అలిగినట్టుంది

అపరాత్రివేళ పారిజాతం మెత్తగా తన పరిమళాన్ని ప్రకటించింది

నీమీద దాచుకున్న బెంగ  ఏకాంతానికి నన్ను లోకువ చేసి..
ఆ క్షణమే నా విరహాన్ని ఆరా తీస్తున్నట్టనిపించింది

కొన్ని వేకువలు నిన్ను తడుముకొని
కౌగిలికందని కెరటమయ్యావని విచారించినట్టు తెలుసా..

కొన్ని సాయంత్రాలు కనుపాపలను ఓదార్చలేక
అనంతమైన అలౌకికాన్ని అరమోడ్పులుగా దాచుకున్నది తెలుసా..

కొన్ని నవ్వులు కన్నీటిలో కరిగి
కాలాన్ని మంత్రాక్షరంలా కలవరపెట్టింది తెలుసా

నీ స్మృతులు మనోతీగల్ని సవరించి
గుండెగదిలో ఆలపించిన కృతులు కాగా
రాతిరంతా మనసు గాలిలో తేలినట్టుంది 
అదైనా తెలిసా

//నీ కోసం 363//

 తెలుసా నీ నవ్వు ఎలా ఉంటుందో

అద్దంలో చూసుకున్నా గుర్తించలేవులే  


నాకోసం ఆరాటపడుతూ వెతికే

నీ కన్నుల్లోకి చూసుకోవు కదా మరి
చల్లని వెన్నెల కురిపిస్తూ అలసిపోతున్నా
నాకు పరవశానందించే దివ్వెలవే కదా..

నా భావాలన్నీ నీ తలపుల్లో దాచుకొని
నిశిరాత్రి ప్రేమగీతమై వినిపించే ప్రకంపనాలు
అనురాగపు ప్రవాహమై నన్ను ముంచెత్తేలా
ఆ చూపుల్లో ఏదో చిదంబర రహస్యమున్నట్టేగా..

నదీనదాల అంతస్సింధువులా
నాలో ఉబికిపోతున్న కన్నీటినడుగు
మబ్బులమాటున్న శరచ్చంద్రికలా నువ్వు గుర్తుకొస్తూ
మంజులవేదమైన మసకవెన్నెలేదో అస్పష్టమవుతుంటే..
విశ్వమంతా విస్తరించేలా నవ్వేది నీ కళ్ళేనని చెప్తాయి.  

//నీ కోసం 362//

 హృదయం గొణుకుతుంది

నా మాటల్లో తలపుల్లో
నీ ఊసులేమయ్యాయని

అసలు పిలుపు వినగానే
కన్నుల్లో వెలిగే కళ
ఇప్పుడో అర్ధరాత్రి ఆలాపనయ్యిందేమని

చల్లనివెన్నెల చేజారిపోలేదని
నక్షత్రాలు నవ్వులమాటు దాచుంచాయని
చిరుగాలి స్పర్శించి చెప్పింది

నా చుట్టూ అలుముకున్న
అనురాగం నువ్వని 
చెయ్యిచాచి కౌగిలించాక...మాటేమో మౌనమయ్యింది

//నీ కోసం 361//

 మురిపెంగా తడుముతున్న నీ చూపులు

తదేకమై పరుస్తున్నది వెన్నెలనే అయితే
నాకు మత్తెక్కుతున్న భావన నిజమై
నువ్వన్న ముద్దుమాటలకేమో
మబ్బుతునకలా తేలిపోతున్న దేహం
కురిసేందుకు సిద్ధపడ్డ మోహమయ్యింది

రోజుకో పువ్వులా మారే కవితలన్నీ
నన్నుగా పొదుపుకున్న పులకింతలు కనుకనే
అంతులేని పదాలతో నే మమేకమై
నక్షత్రాలు కొమ్మలకు పూస్తాయని నమ్మి
మనోలోకపు తోటలోనే నే విహరిస్తున్నా
అందుకేనేమో..
ఇన్ని మడతలు తొలిసారి కనుగొన్న నడుములో
మెలికెలో..మైమరపులో..
పెదవులతో తొలిసారి రాయించుకుంటున్న ప్రణయ కువకువలో


Friday, 14 May 2021

//నీ కోసం 360//

 మబ్బు తునక మలుపులన్నీ తిరిగి

నా ముందు ఆగినప్పుడే
నీ మనసు మాటలన్నీ వినేస్తాను

ఆ చినుకులన్నీ  వలపును
కురిసేందుకు అనుమతి కోరినట్టు
నీ పదాల కోసమే దోసిళ్ళు పడతాను

నీ కళ్ళ నిండా నవ్వు చూసినప్పుడు 
తలకెక్కిన ఊహలు అల్లుకుంటూ
ఓ పచ్చని మోహాలాపన కూర్చుతాను

గంటల తరబడి హత్తుకున్న తలపు
ఎన్ని కాలాలు దాటుకొచ్చిన ఋతుపవనమోనని
మనోకేళి రసాస్వాదనలో తడిచిపోతాను

అవును..
ఉక్కబోసి దహిస్తున్న వేడి కాదది
నదిలా ప్రవహిస్తున్న వేదనా కాదది
విస్మయం చిగురించే ఏకాంత మదిలో
ఆకాశం అభినయించే అనురాగ వర్షమది

//నీ కోసం 359//

 కన్నుల్లోకి చూసి నిన్ను గుర్తుపట్టాగానే

కన్నీటిమసకలో కరిగిన వియోగం
అరచేతుల ఆసరా కోరింది

మాటలు చెరిపి నువ్వు ముద్దాడిన పెదవుల్లో
హద్దులు ముగిసి వెన్నెల విరిసింది
అపురూప క్షణాల అనురాగం 
కౌగిలిగా మారి ఎదలోని చైతన్యాన్ని
వివశంగా మార్చింది

మౌనంలోనూ మాయ ఉందని తెలుస్తుంది
ఈ రహస్య పరిమళాన్ని ఒంటిగా ఆస్వాదిస్తుంటే

//నీ కోసం 358//

 నాతో నేను మాట్లాడుకుంటూ

ఇంకెన్ని రోజులు గడపాలో
చీకటీ..వెలుతురూ..
సమానంగానే ఉన్న అపస్మారకమిది

సమూహంలో అస్తిమితాన్ని
ఏకాంతంలో ఆదమరచిన వైనాన్ని
ఆనవాలు పట్టే ఆత్మీయులెవరూ లేనప్పుడు
బతుకు బలహీనమైపోతుంది

స్వప్న సౌందర్యాల ఆరాటమో
చేదు నిజాల అంతర్ముఖం
సాకారమవ్వని ఆనందహేలలన్నీ
మనోవికార సమానమయ్యాక..

వెదుకులాట పూర్తవని
మసకచూపుల నైరాశ్యంలో 
ఎవరూ రారని తెలిసినా
మనసుగది తెరిచుంచడం
కేవలం ప్రాణాలు బయటకుపోయేందుకేనని 
నిలిచిపోయిన నిముషాల నిర్ధారణ 
No issues..
I have died to myself n live for u 

//నీ కోసం 357//

 నిద్రా మెలకువా కాని సందిగ్ధంలో

మనసు మూలుగుతున్నప్పుడు
దాన్ని సముదాయించేవారెవరు

శిధిలమైన ఆశలన్నీ
అసంకల్పిత కలలై 
రహస్యపోరాటం మొదలెడితే 
ఆప్యాయంగా చేరదీసేవారెవరు

విరుచుకుపడుతున్న అసహనం అశాశ్వతమని
చీకటి దాగిన వెలుతురున్నమ్మి
కాలపు గతిని మార్చేదెవరు

రెప్పలచీకటికీ రాత్రికీ సంబంధం లేదని
రంగుల కలలన్నీ కదిలే మేఘాల మాదిరని
దూరాన్ని దగ్గర చేసేదెవరూ

కన్నుల్లో కృష్ణవర్ణం
కాగితంపై జారిపోయాక
కాటుక మరకను గుర్తించిన హృదయాలు 
కొన్ని క్షణాలు నెమరేసుకుంటాయేమో 

//నీ కోసం 356//

 ఎలా..ఎప్పుడూ అని అడుగకు

నువ్వు నాకు ముందే తెలుసు
కేవల పరిచయముగా
మాత్రమే కాదు
ఇంతకు మునుపే..

పిలవకుండా మనసు గదిలోకి వచ్చావో
వలపు చందనం రహస్యంగా చల్లావో
కలలోకి వస్తున్నట్టే వస్తూ
నిదురని మాయ చేసి వెళ్ళావో

మాయామోహానికి చిక్కానని అంటారు గానీ
ఎవ్వరూ నమ్మరిది
నీలాకాశం చూస్తూ నిలబడిపోతున్నా
ఇష్టమైన పరిమళానికీ తడబడిపోతున్నా
ఇక్కడిక్కడే ఉండి ఉంటావని వెతుక్కుంటున్నా

కథనమో..కల్పనోనని అనుకోకు
కాలాతీత క్షణాల కౌగిళ్ళు అవన్నీ
నీ కన్నులే నులుముకుంటావో
నా నవ్వులే నెమరేసుకుంటావో
ఏకాంతాన్ని సవరించి చూడొకసారి
ఆకుచాటు పువ్వులా నా జ్ఞాపకమో..రూపమో గుర్తు రాకపోదు..

వర్షమొచ్చినప్పుడు అలల సంగీతం నీకెంత మక్కువో
లేత ఆకుల పసరు వాసనంటే నాకు ప్రేమ కదూ
నీ అరచేతి పొత్తిళ్ళలో ఎన్నిసార్లు ఒదిగి ఉంటానో
చూపుల అంచులతో ఎన్నిసార్లు తాకి ఉంటావో
ఈసారి రాయడమయ్యాక ఆరాతీసి చూడు
అప్పటికీ ప్రశ్నించావంటే సమాధానం నే చెప్తా

//నీ కోసం 355//

 కేవలం బ్రతికుండటం మాత్రమే

జీవిస్తున్నట్టు కాదని
నీకెలా చెప్పాలి..

బాధని ఆస్వాదిస్తూ 
మిగిలిపోయిన నేను
ఒక్క పలకరింపు కోసం ఎదురుచూపుల దారిలో అలసిపోయి
పువ్వులతోనూ.. పుస్తకాలతోనూ మాట్లాడుతూంటాను

ఒక్క స్పర్శకని వేసారిపోయి
కన్నీటిని చప్పరిస్తూ
పెదవుల తడిలో ముద్దుల్ని మరచిపోతాను
అనుభూతిని ఆపలేని ప్రతిసారీ
కదులుతున్న కాలంతో ఘర్షణ పడుతూ
ప్రేమ ఆనవాళ్ళ కోసమని వెతుక్కుంటాను

నిశ్శబ్దంలో జపం చేసిన పేరుని 
ఊహలకు సొంతం చేసి 
కాసేపలా విషాదానికి దూరమవుతాను 
ఏకాంతాన్ని దిగులొచ్చి పరిహసించినప్పుడల్లా
మరో లోకానికి పోయే మార్గమేదని అన్వేషిస్తాను

//నీ కోసం 354//

 శూన్య రహస్యంలో దొరికిన రసధుని నువ్వు

ఊహలోనైనా ఒక్కక్షణం దూరం కాని 
 నాలోని సాహిత్యానికి స్వాలంబనవి

హృదయానికి సంచలనమొస్తే 
మధురాతి మధురమైన సంగీతమైనట్టు
మూసిన కన్నుల మాటు మోహగీతానివి

అభిసారిక ప్రణయాంజలినందుకొని
అసురసంధ్యలో  స్వరజతులకు తాళమేసే
కిన్నెర వీణా తంత్రుల మంత్రానివి

పరోక్షంగా పదికాలాల నుండీ 
మధురోహల్లో నిలిచి
నా మనస్సవ్వడి ఆలకించిన మనోధరునివి

కనుకే...
మత్తు కమ్మిన రాతిరి
గోరువెచ్చని కలలు విత్తి 
ఉదయానికి పెదవుల్లో పూసే చిరునవ్వువి 

//నీ కోసం 353//

 కన్నులేమో కరుణరసం..

చూపులేమో చిలిపిరసం

మాటేమో మధురసం..
నవ్వులైతే నిమ్మరసం

పదములేమో ప్రణయరసం
మౌనమేమో మృదురసం

చిలకముక్కు చిన్నవాని
పలుకులే రసమో..

పరవశానికెదురుచూస్తున్న ప్రతిక్షణమూ
పరుగెత్తిపోయే పాదరసము

//నీ కోసం 352//

 ఒక్క ఆకూ కదలని సాయింత్రం 

కనుపాపలకి మౌనసాహచర్యంలా 
చిగురాకంత చిన్నినవ్వుతో తలపుకొస్తావు

సంకల్పిత క్షణాలన్నీ మధురం చేస్తూ
ఆకాశవర్ణంలో చిక్కుకుపోయేలా
పంచమస్వరాన్ని చిద్విలాసంగా పంచుతావు

గతం ముంగిట్లో వాలే అవకాశమివ్వకుండా
కొత్త దారుల వెంట అలుపురాని అనురక్తి ఉన్నదని
ఆనందపు సరిహద్దులకు చేర్చి నిలబెడతావు

కాలమా..
మనసుని విహంగయానం చేయించమని ఎవరు చెప్పారే..
సుందర స్వప్నాలు రేయికి మాత్రమే సొంతం కావని
చిరకాలం అనుభవించదగ్గ కమ్మని కవితలని తెలుసుకున్నాలే
అందుకే..గంగలో మునిగినా..వెన్నెల్లో తడిచినా..
ఆరని ఆశలన్నీ అక్షరాలుగా అలంకరించేస్తున్నా
వెలుతురే ముగ్ధ సౌందర్యమని చాటి చెప్పేస్తున్నా 

Wednesday, 12 May 2021

//నీ కోసం 351//

 కలలోంచీ జారిపడ్డ కవితను

రాసిందెవరోనని ఆరా తీసేలోపే
నులివెచ్చని తమకంలా ఈ కెరటం
నీ తలపులవాకిట్లో ఉప్పొంగే
రెప్పల మాటు సంద్రానిదేనని తెలిసి
పసిడిరంగుల మెరుపేదో నునుబుగ్గలకొచ్చి చేరింది

ప్రేమకి మాతృక ఏమయ్యుంటుందో
నేలను తాకే తొలకరి తపన అమృతంగమమో
వెన్నెలరేయి చలి పెరిగినట్టనిపించే చిలిపితనమో
అనుకోగానే...

మనసుపొరల్లో కదులుతున్న పరిమళాలతో
నిశ్శబ్దంగా నీ ఉనికి చాటుతున్న చీకటి
అలసిపోయిన పువ్వుల వాసనలా అనిపించింది

చెరిగిపోని భావాల చెలిమి ధ్వని
గంధర్వగానమని తెలుసుకున్న సమయం
మనోవ్రతం ఆసాంతం..
నీతోనే యుగళగీతాలు ఊహించాలనుంది 

//నీ కోసం 350//

 వస్తానని మాటిచ్చిన నువ్వేమో

పొలిమేరలు స్పృశించి వెనుదిరిగి వెళ్ళావు

కలనైనా కబురెట్టకుండానే
ఎప్పటికీ కలపదనుకున్న కాలం
రెక్కలు కట్టి మరీ సాగరతీరానే 
ఉదయించిన నెలవంకను చూపించేసింది

విధి చేయు వింతలన్నిట్లో
నీ చూపూ నా నవ్వూ కలవడమే విచిత్రమయ్యాక
నీ బుల్లిబుల్లి కనుపాపలెన్ని ఆటలాడాయో
ఇప్పుడిక..
రానంటే నువ్వూరుకున్నా
నిన్ను చూడాలనుకునే మనసూరుకోదుగా

మరో పున్నమి పండక్కి..
నేనొచ్చి నీ రూపాన్ని ముద్దాడేలోపు
ఊహల వెన్నెల్లో ప్రతిరోజూ తడిచిపో 

//నీ కోసం 349//

 నీ చూపుల్లోని నిర్వికార వెచ్చదనం

నన్నంతా కౌగిలించి
సుదీర్ఘ కలత నిద్దురను జోకొట్టేలోపు

లేలేత తమకం తొణికి
మధువొలికే రాతిరి అపురూపాల్ని
నీ తీపిమాటలుగా కొంగుముడేసుకుంటుంది

రాగదీపాలు కొలువైన దారిలో
పెదవి దాటని పాటలకర్ధం
వెన్నెల్లో తడిపొడి లాలసను దాచుకుందని

నీకూ నాకూ మధ్య వంతెనేసుకున్న 
నిశ్శబ్దం పరిమళించి 
మసక చీకటిలో మల్లెలు నవ్వినట్టవుతుంది

నీ గుండెలకున్న చెమ్మదనం
నా చెంపను తాకిన ఆర్ద్రతయితే
Your feelings r obviously cozy for me..


//నీ కోసం 348//

 


శతకోటి సన్నజాజులు పరిమళించినట్లు
నీ నవ్వు చూస్తుంటే మనసాగదు

అనుసరిస్తున్న అల్లరి తెలిసిపోయేలా
అల్లనల్లన నాలో పెరిగిన ఇష్టం
నీ ఇంద్రజాలమే ఐతే
ఎంత వలపుని తన్మయించావో

మనం కలిసిన క్షణాలప్పుడే
అమందానందం తెలిసిందని ఒప్పుకుంటున్నా
నా కన్నుల్లో నీవున్న కలలు
ఏ సంతోష ప్రవాహాలోనివని మరడుగకు

వేకువ నక్షత్రంలా నేనలగడం మొదలెడితే
నీ సమస్తంలో నా అనుభూతిని మెరవలేనిక 


//నీ కోసం 347//

 అరచేతుల్లో కలలు ముడుచుకుని

ప్రపంచమంతా తిరిగినా
ఎక్కడా పువ్వులు నవ్విన జాడ తెలియలేదు

కళ్ళు తెరిచే నిదురపోతున్నానని
ఎవరో చెప్తే, విషాదపు వీధిని వదిలి
కొన్ని మలుపులు తిరిగాను

చెట్టుచేమలు చిగురిస్తున్నా
వసంతాన్ని గుర్తించలేకపోయానని 
మరింత కుంగిపోయాను

కన్నుల్లో సముద్రాలు పొంగి
పెదవుల తీరాన్ని చేరగానే గుర్తించాను
ఇన్నాళ్ళుగా ఘనీభవించిన గుండె కరిగి
ప్రవాహం మొదలయ్యిందని

ఈలోపునే...
శ్వాసలోకి పరిమళమెప్పుడొచ్చి చేరిందో
నా నవ్వులకే మత్తెక్కిపోతున్నారు ఇప్పుడందరూ 
Attachments area

//నీ కోసం 346//

 చీకటిగా ఉన్న మదిలోకి 

కొంత వెలుగు ప్రసరించాలని 
నిన్ను చూడాలనుకున్నానా..

నీ కన్నుల్లోకి దూకడమెలాగో 
తెలియట్లేదనుకుంటూ ఉండగానే
నులివెచ్చని చూపుల తాకిడికి స్వప్నాలు మొదలు

లీలగా కదులుతుందనుకున్న రాతిరి నీలిమ
నన్నిలా మైకంలోనే పెట్టి ఉంచేసిందిప్పటికీ..

ఆకులు రాలుతున్న సంగీతకేళిలో
కోయిలలు కవిత్వం పాడుతున్నట్టు
ప్రేమాన్వీ.. ఇదేం మాయసలు 

Ur true nature is luminous
Keep shining no matter whoever tries
to dull ur sparkle 


//నీ కోసం 345//

 తను:  ఒక చిన్నమాట కూడా లేని ఏకాంతంలో

కిటికీలోంచి వెన్నెల
అది తప్ప మరే వెలుతురు లేని వింతకాంతిలో
శ్వాస వినపడే మౌనంలో.
లోపలి నిన్నూ నన్నూ 
ఒక్కటిగా కలపడానికి ప్రయాణం చేసిన 
దేహాలు పక్కపక్కనే
పసిపాపలై
లోపల చెలరేగిన అనంతాన్ని 
భాషకందక దాచుకున్న అద్వైతాన్ని 
బైటపెట్టలేక దేహాలు పడే అవస్థకి ముందరి 
లాలిత్యంలో నిన్ను నా గుండెలపైకి తీసుకుని 
ఆ మౌనంలో ఐతే బజ్జుంటా .. 

నేను :   సరే,  ప్రతి సంధ్యలో నాకోసం ఎదురుచూసి
నేను ఆనవాలు పట్టే ఇష్టాన్ని వెదజల్లేలా
మోహాన్ని రాస్తుంటావని నాకెప్పుడో తెలిసినా
కన్నుల కనుమల్లో కలత నవ్వులు
ప్రేమ రహస్యాన్ని విప్పిచెప్పని చీకటిరాత్రిపై 
అలగడం తెలియని అశ్రుకావ్యాలుగా
రెప్పల పెనవేతల నడుమ వెచ్చదనంలా
మృదువైన ఊపిరికి గంధంలా
నా జీవితానికి పండగంటే నువ్వు కనుకే..
మనసుతోటలోకి నువ్వొచ్చినప్పుడు
మొగ్గలు పువ్వులై విచ్చుకున్నట్టు
నేనూ నీలో..పరవశించి.. పరిమళించి విశ్రమిస్తాను

//నీ కోసం 344//

 రోజంతా కాలపథాన్ని అనుసరించి అలసిపోయే నువ్వు

రాత్రైతే  అరమగ్గిన సంకల్పాలను పక్కకు నెట్టి
నా కనురెప్పల ఊయల మీద బుజ్జి పాపవవుతావు

అర్ధప్రేరణివ్వని ఆలోచనలను సాగనంపి
అందమైన స్వర్గానికి దారి చెప్పమని
మనోహరమైన నవ్వులు విరజిమ్ముతావు

ఎప్పుడూ నిశ్శబ్దాన్నే ప్రేమించినట్టు కనిపిస్తూనే
వసంతపు కలలకు కొత్తరంగులద్దమని
గుండెనిండా రాగాలు నింపమంటూ గారాలొలుకుతావు

నీకూ తెలుసుగా..
మనస్సహిత అలౌకికానుభవములో
మల్లెపూలను మించి మత్తెక్కించే నీ దగ్గరతనమే
నన్ను నేను పోగొట్టుకునే అపురూప క్షణం 

//నీ కోసం 343//

 


లోలోపలే హత్తుకున్న మాయొకటి
తీవ్రమైన ఎడబాటును చెరిపేసి
నక్షత్రాల నడుమ ఆకాశంలో 
జాబిల్లి నువ్వేనని చెప్పేలోగానే..

చలిఊపిరిగా పెనవేసుకుపోతున్న భావాలు
మొన్నటి పొగమంచు తాలూకూ
ప్రేమను పీల్చుకున్నప్పటి చిరునవ్వులుగా..

పూలగాలి తాగిన మత్తులో నన్నుంచి
అలలుగా అల్లుకున్న రసస్పర్శ 
హృదయాన్ని తడిపేంత అవ్యక్తపు అశ్రువైంది 

ఇంతకీ..
శిలగా అనిమిషమై నిద్రించిన స్వరాన్ని
మోహపు క్షణాలరెక్కలపై లాలించి
కన్నులు తెరిచేలా చేసిందెవరో

దొంగతనంగా మేల్కొన్న పున్నమిరాత్రి
ఆవిరవుతున్న వెన్నెల్లోకి 
చేయిపట్టి లాక్కుపోయిన బాంధవ్యమేదో 

//నీ కోసం 342//

 అనంతవిశ్వం సద్దుమణిగిన వేళ

నా కుశలాన్ని ఆరాతీసేందుకు
సుదూరాలు దాటుకుని నావైపుకొస్తావ్

ఆ చిన్నినవ్వుతో
చీకటిలో నన్ను నిమిరి 
ప్రత్యేకమైన పలకరింపువవుతావ్

నా పరధ్యానాన్ని పసిగట్టి
మనసు నింపేందుకు
తీయని మిఠాయి తినిపిస్తావ్

వెదురువనాల నీడల్లో
వేలుకొసల వివశత్వాన్నందించి
వెన్నెలనే వేడుకగా కొంగుముడేస్తావ్

వచ్చేది కొన్ని క్షణాలే అయినా
గుండె తేలికయ్యేలా 
కళ్ళల్లో పాపలా ఆడుకుని వెళ్తావ్ 

//నీ కోసం 341//

 ఎందుకిలా


జీవం కోల్పోయిన శిలలా నే నిశ్చలమైతే ఉలి పట్టుకునొచ్చేస్తావ్
ఏదో నిశ్శబ్దంగా నేనుంటే సీతాకోకలా ఎగిరమంటావ్ 
నాకు నేనో తీరంలా  పడి ఉంటే  కెరటంలా అనునయిస్తావ్

అయినా సరే..
నడిరాతిరి నీకోసం తలపులు తెరిచి ఎదురుచూస్తూ నిల్చుంటే
ఏమీ తోచక పలకరించాననుకుంటావ్

దీర్ఘశ్వాస తీసుకున్నప్పుడు ఊపిరిని గమనించుకోవేమో
నా ఆవేదనా నిట్టూర్పు బరువే కాదనుకుంటావ్

మంచుబిందువుల్ని చూసినప్పుడు నా తడికళ్ళు గుర్తురాకనే
కలుస్తూ విడిపోయే రెప్పల్లో క్షణానికోలా కలవరమవుతావ్

శీతాకాలం పగిలిన గాలికి వణుకుతున్న 
పువ్వుల హృదయాన్ని ప్రశ్నించి చూడమాకేం..
అలుపెరుగక సమయమంతా నిన్నే కల్పించుకున్నానని
నీ పిలుపందక విచ్చుకోని పెదవుల గురించి చెప్పి బాధపెడతాయ్..

నాకన్నీ తెలుసనుకుంటున్న నీ మౌనానికి 
తలుపులు వేసేస్తాలే ఇక..
Becoz I couldn't help but notice u 



//నీ కోసం 340//

 సూర్యోదయం లేని ఉదయంలో

మబ్బులు ఆకర్షించుకొని ముసురేసినందుకే
నిశ్శబ్దం మరిచిన కంటికొలనులో
అలలు నవ్వుతున్న తీరం

ఆకాశం అంచులు దాటేలా
మనసాలపించిన అమృతవర్షిణికే
పాటల పడవలో నన్నుంచి 
ప్రకృతినే కడిగేసింది వర్షం

చీకటి చెదిరిన వేకువకెన్ని చినుకు ముత్యాలో
నా మెడలో తలపుల తడి హారాలు అన్నిప్పుడు..

//నీ కోసం 339//

 అంతర్మధనం ఒకటే తెలుసనుకున్న మనసుకి

ఆనందించడమెలాగో నేర్పింది నువ్వే కదూ

జీవనగతిలో దార్శినికతను వెతిక్కునే
వియద్గంగలా
తామరాకు మీది నీటిబొట్టులా
నీ సా(న్ని)హిత్యమే నా సౌందర్యమై
మదిలో నవ్వులు పూసింది నిజమైతే

మనస్వీ..
మౌనంలో నీ స్పర్శ కొంచెం కొంచెం తెలుస్తుంది
ఈ అనుభూతి యోగాన్నిలానే ఉండనీ 




//నీ కోసం 338//

 నా కలల్ని చిలుకుతూ నువ్వు

వెన్నెల కాసే రాత్రులు రప్పిస్తూ
పున్నమి కోసం ప్రేమలేఖలు రాయమంటూ మారం చేస్తావు

మనోలోకమో విస్తరించిన పూలబావిగా మారాక
ఏకాంతం పొదరిల్లుగా ఊసులాడేందుకు రమ్మంటే
హాయి బరువు మోస్తున్న పెదవికి వణుకయ్యింది

క్షణాలు కదిలి నిముషాలుగా కరిగి
మనసు అలసిపోయిన ఉద్వేగం
అలల తాకిడితో ఉప్పొంగే సముద్రపు ఉత్తేజానికి సమానమయ్యి
ముద్దుకే ముద్దొచ్చే ముచ్చట కోరింది

కాలమాగి చూసే వేళయ్యింది
వలపు సితారను శృతిచేసి
తనువుకంటిన రాగమధూళిని పరిమళిద్దాం రా