Wednesday, 14 September 2022

//నీ కోసం 498 //

నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న ఆ చూపులు అలలు అలలుగా ఏ రాగంలో పలకరిస్తున్నవో మనసుకి ఓదార్పు దొరికినట్టుంది.. నీ పెదవులకి రెక్కలొచ్చి.. నా బుగ్గలపై వాలినట్టు ఆనందం అందమైన అనుభూతిగా మారింది.. దూరాలు దాటొచ్చే నీ నవ్వులు నిరంతర వసంతపు గలగల సందళ్ళనేమో చిగురాశల ఊయలూపి మోహిస్తుంది.. నీ నిశ్వాసలోని చిరుగాలికి.. నాలో వణుకు వెచ్చదనాన్ని కోరి గుప్పిళ్ళు మూసింది.. మత్తుగా మధువొలకబోసే నీ ఊసులు ఎన్ని సీతాకోకలై నన్ను చుట్టుముడతాయో ఏకాంతం సమస్తం పువ్వై పరిమళిస్తుంది పురాస్వప్నంలోంచీ నా క్షణాల ఆదమరుపు నీ తమకాన్ని బిడియంగా కావలించింది Yess.. I'm in love with love n u r the love whom I never part with

//నీ కోసం 497 //

మరోసారి చనువివ్వు గుండె నిండుగా నిన్ను మైమరచిన మనోరూపాన్ని నిమిరేందుకు సమ్మతమివ్వు తడిచిన కాగితమ్మీద అసంపూర్ణ వాక్యమల్లే వణుకుతానని నీకు ముందే తెలుసు.. నా కన్నులు బరువెక్కించి మౌనం పడవెక్కి నువ్వెందుకిలా మాయమయ్యావో కొంచెం చెప్పు

//నీ కోసం 496 //

కాలచక్రం వెనక్కి తిరిగి కాసేపు నిన్ను కనురెప్పల్లో నింపుకున్నా జ్ఞాపకాల్ని ఒరుసుకుంటూ వినబడుతున్న నీ పిలుపుతో కన్నీరై ఒలుకుతున్నా కదిలిపోయిన క్షణాలకు ఊపిరిపోసి కరిమబ్బు చాటు కిరణాన్ని చూడలేకున్నా మది నిండిన చీకటితో ఇల్లంతా అదే పనిగా తిరుగుతున్నా నువ్వక్కడ అడుగడుగునా అనుభవాల్ని అలరిస్తూ కదులుతున్నా పగిలిన కలల చప్పుళ్ళతో నేనేమో నిద్రలోనూ ఉలికులికిపడుతున్నా Every passing day carried another part of us off. Nothing stayed the same.. Missing your moves n scent raa pillaa

//నీ కోసం 495 //

నిలకడలేని వాన పున్నమని మర్చిపోయి ఆగి సాగే ఆలాపనలా కురుస్తుంది సమయం గడవని నిర్లిప్త క్షణాలకి ఒళ్ళు వెచ్చబడి అలసిపోయిన సంగతి కృత్రిమ నవ్వులో బయటపడిపోతుంది గుబులుగా మారిన అవ్యక్తపు బెంగ నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని ఎక్కడున్నావో నువ్వని తలచినప్పుడు గొంతుకి గంథం పూసుకున్నట్టు లోపల్నుంచే నీ పరిమళం గుప్పుమంటుంది

//నీ కోసం 494 //

అప్పుడప్పుడూ దారితప్పి నా ఊహలప్రపంచంలోకి నువ్వొచ్చేసావేమో అనిపిస్తుంది. మరి ఎప్పటికీ పరిమళం కోల్పోని విరజాజులు, నువ్వు నవ్వితే వెలిగే నా తనువు నూగారూ, విరహమన్నది తెలీనట్టు తీరాన్ని అదేపనిగా ముద్దాడే అలలు.. ఆకాశం మీంచీ రాలిపడి మనపై కురిసే నక్షత్రాలు, ఒకరిలో ఒకరమై మత్తిల్లిన ఉన్మత్తక్షణాలు.. ఏమో తెలీని తమకపు నెమరువేతలే ఇవన్నీ... కానీ వాస్తవంలో, కాలాలన్నీ కలగాపులగమైపోయి అదో రకంగా మారిన ప్రకృతిలాగే అస్తవ్యస్తమయ్యింది నా మది. ఎప్పుడో అరుదుగా వచ్చే ఎండావానా నిత్యకృత్యమై ఉదయాస్తమానాలను అల్లాడిస్తున్నట్టు అంతర్మధన అపస్వరాలు మనఃస్థితిని కలవరపెడుతున్నాయి. ఏమో.. నాకన్నా నువ్వు చాలా బాగా పాడతావని తెలీకముందు నేను పాడిన పాటే ఆఖరిది.

//నీ కోసం 493 //

మనసుతో అందుకునేంత దగ్గరలోనే ఉన్నానంటూ కూడా.. పగలంతా మొగలిపొదలా పరిమళిస్తూ పక్కనే ఉన్నట్టుండి, చీకటైతే చందమామలా అంత దూరమై ఆకాశంలో చుక్కలమధ్య వెతుక్కోమంటావ్.. కలవకుండానే కలిసినట్టు కనిపించే నింగీనేలలతో మనకేమైనా పోలికా..?! లేదా, ఋతురాగాలు దేనికదే ప్రత్యేకమైన తీరు మనమూ వేర్వేరు స్వరూపాలమంటావా.. ?! మరైతే.. ఎప్పుడు చూసినా ఆ నవ్వేంటో, ముద్దు పెట్టకుండా కదలొద్దని కవ్విస్తూ.. ఓహ్హ్.. దేంతో పోల్చాలో తెలీక వెయ్యిసార్లు తలవిదిలించి ఉంటా ఇప్పటివరకూ.. సాక్షాత్తు మదనుడు మారువేషంలో వచ్చి సుతారమైన కస్తూరిపూలు చల్లుతూ నన్నో మసక కన్నుల మైమరపులో ఉంచేస్తున్నట్టా.. ?! శమంతకమణి సత్యదర్శనంలా నీ నిత్యహసిత అరవిందం.. నా రసహృదయానికేనా..?! Heyy.. it's impossible to forget ur smile n it s in my head day n night.. ఎవ్వరెటుపోతున్నా కాస్తంత సిగ్గు పూయదా నీకని అడుగకు.. కనీసం పదబంధంగానైనా నిన్ను అల్లుకునే నా మోహార్తిని హర్షించు.

//నీ కోసం 492 //

నా నిశ్శబ్దపు అన్వేషణ గమనించి చిద్విలాసంగా నవ్వుకుంటావు కావచ్చు.. అదిగో మళ్ళీ ముసురేసింది పల్చటి వర్షానికి తోడు చుట్టూ చీకటిలో నా ఉక్రోషం నిషిద్ద గాయమై సలుపుతుంది.. Pch.. ఎంత తనిఖీ చేసినా పట్టుబడవు అంత అదృశ్యంగా ఏ సరిహద్దుల్లో నిలబడతావో నువ్వసలు ఎదుటపడొద్దని దాక్కున్నాక ఈ కళ్ళు ఎంత దూరం వెతికితేనేమి చెప్పూ... ఎప్పుడూ అనిశ్చిత అగరొత్తులు నాకుగా వెలిగించుకుంటానని అనుకుంటావు గానీ నా ఒంటరి ప్రస్ధానాన్ని శిశిరానికి సమంగా ఊహించలేవు అస్తిత్వాన్ని ఆవల పారేసుకున్నాక వాసనలేని పువ్వులో వైరాగ్యం ఊపిరాడని శ్వాసగా చెమరిస్తున్నా గానీ ఆవలింతల్లో సొమ్మసిల్లిపోవడమే సుఖం కాబోలు Ther s something between us n that is distance.. which u never tried to overcome ofcourse..

//నీ కోసం 491 //

అనుభూతుల ఆకుల సవ్వళ్ళకి మత్తుగా పరవశిస్తున్న సాయింత్రం వెన్నులో ప్రవహిస్తున్న ఆనందమిది కనువిందుగా నీ రూపమున్నందుకే ఎలా ఉన్నావో కనిపించమంటే నీలో నువ్వు నవ్వుకుంటూ మౌనంగా ఎలా ఉన్నావో చూపిస్తున్నావ్ పైగా బెంగని పోగొట్టుకునేలా ఆత్మాలింగనం చేసుకోమని ఎంచక్కా కళ్ళతో చెప్పేస్తున్నావ్ అవున్నీకసలు.. భయంతో పాటు వేళాపాళా ఉండదు.. నీ సాన్నిహిత్యాన్ని కోల్పోకూడదని క్షణమన్నా వదలకుండా మనసుపెట్టి నన్ను వింటూ కనురెప్పల వెనుక దోబూచులాడుతూ గుండెల్లో ఊయలూగుతూ.. ఇష్టమొచ్చినట్టున్నావ్ ఆకాశంలో పసుపూ ఎరుపురంగుల ప్రదోషం నేనేమో నిన్నిలా వాక్యంలా రాస్తూ మొదలవడం.. "All that is meant for one is meant to find one.. n that one is u n ur smile.."

//నీ కోసం 490 //

బయట పడకూడదని తెలిసీ ఎందుకో నీ ముందే అలా మనసు పరిచేస్తూ ఉంటా.. నిద్ర కరువైన రాత్రి కళ్ళు బరువెక్కి నీ కలల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిసి ప్రేమతత్వాన్ని ఊహిస్తూ చీకట్లోకి చూస్తున్నా. పలకరింపుగా నీ నవ్వు మెత్తగా కౌగిలించేవరకూ గుండె తడి చెక్కిళ్ళను చేరినట్టే తెలీలేదు. పదం పలకని నీ చేతిలో నేనే కవితనై ఒదుగుతున్నా.. వెచ్చగా ప్రవహించే నీకిష్టమైన అనుభవాల్ని అక్షరంలా చదివానని చెప్పవుగా, అయినా కానీ.. గుప్పిళ్ళు మూసుకుని దాచేసుకున్న నీ ఉనికి కాలమే గొంతెత్తి మరీ వినిపిస్తుంది. నా నువ్వేగా, ఫర్వాలేదులే, శాశ్వతమంటూ ఏదీ లేదు కనుక ఓ రోజు మనకిష్టమైన పాటలో నన్ను గుర్తిస్తావని నమ్ముతున్నా Hmm.. don't mind.. U r soo approachable with ur smile n I already received that

//నీ కోసం 489 //

హేయ్.. చూపులు విడిపోకుండా కలిసుండటం అంటే ఇదేనా.. ఎదురుగా కనిపిస్తున్నందుకు బదులుగా ఆ చిరునవ్వా.. ?! నాకైతే అలానే ఉంది, నా ముందర పాలపుంతలా నువ్వున్నట్టు భాద్రపదమైతేనేం.. నువ్వూ చిగురించొచ్చుగా అనడుగుతున్నట్టు.. అలుపెరుగని గుసగుసల పారవశ్యానికి నిశ్శబ్దం చిన్నబోయేలా మనసు కుదుటపడి నా ఎర్రని కన్నుల్లో మధురక్షణాల మెరుపు నీవల్లనేనని తెలిసిపోతుందా ?! నిండుపున్నమి కెరటాల్లా కవ్వించే ఆ నవ్వులడ్డుపెట్టి ఎన్ని మాయలు చేస్తావో పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని చూస్తున్నట్టు నిముషమైనా రెప్పవేయనివ్వక నిన్నే చూడమంటావు అందుకే.. మౌనంలో నిమగ్నమైన తదేక ధ్యానంతో వెచ్చని అలజడికి వివశమయ్యే ప్రాణంతో పేరు తెలియని భావాల తాపాగ్ని మోహంతో అణువణువూ ఆర్తినై నిన్నే చూస్తున్నా Don't smile soo beautiful naa.. else.. will give u my honest expression

//నీ కోసం 488 //

ఎదురుచూస్తున్నానని తెలిసీ ప్రాణాన్ని కెలికేసేలా ఎలా నవ్వుతున్నావ్ చూడు.. అసలే కలలు కరువైనందుకు కనుబొమ్మలు ముడేసుక్కూర్చుని కిటికీనే అంటిపెట్టుకుంటానని తెలుసుగా అలలు అలలుగా విరుస్తున్న ఆ పెదవులపై తేలిపోవాలనుందంటే చూపులతో బెదిరిస్తావా..?! కాలాల కనుమల్లో కరిగిపోతూ నిర్వికల్ప నిర్వచనానికి నాందిగా నే మౌనముద్రేసుకున్నది నిజమైనా.. ఆనందం శివతాండవం చేస్తున్నట్టు ఆ ముఖారవిందముందే.. అబ్బబ్బబ్బా.. Consider I kissed ur forehead n lost in ur sweet smiles

//నీ కోసం 487 //

Woah.. ఎందుకంతలా అరుస్తున్నాయో ఈ పక్షులు కొమ్మల్లోంచో, నే కట్టుకున్న చీరకొంగు నించో నీ నవ్వు చూస్తూ మురుస్తున్నానే అనుకో ఆ మత్తుని వదిలించేందుకా ఇన్ని విరుపులు అసలెవరికి తెలుసు నేనేం చేస్తున్నానో.. ఒకవైపు నీ కళ్ళు చెప్పే కబుర్లు వినాలో మరోవంక పెదవిప్పకుండా నువ్వాడే మాటల జడివానలో తడవాలో తెలీక సతమతమవుతున్నానంటే నువ్వయితే నమ్ముతావుగా నిర్లక్ష్యంగా అనిపించే నువ్వింత ఒద్దికగా ముద్దు చేయాలనిపించేంత గారంగా ఊపిరి తీసుకోడం మర్చిపోయేంత సమ్మోహనంగా.. పండుగంటే నువ్వేనా.. నా మనసు చెబుతుంది నిజమేనా Ohh.. అమ్మూ.. పదాలేవీ ఒలికిపోలేదిక్కడ నువ్వలా ఉన్నందుకు నిలువలేని నా స్వగతమిలా.. U smile like a blooming flower n I love ur moxie

//నీ కోసం 486 //

ఉదయం నుంచీ తిన్న పరమాన్నం తేనేసిన పంచామృతాన్ని మించి ఏంటా పిచ్చి తీపి నీ నవ్వులో తేరిపార ఎంత చూసినా తపన తీరదే నువ్వు పుట్టిన్నాడు శరత్కాల చంద్రోదయమయ్యి ఉంటదా నిన్ను కనే ముందు మీ అమ్మ ద్రాక్షపానకం తాగుంటదా నా బలహీనక్షణాలను దాటించేందుకు నువ్వొచ్చావా నీకోసం ఏ జన్మలోనూ తపస్సు చేసిన గుర్తు లేదే ?! ఈ చిన్మయానంద ప్రేమస్మితం నా చితికిన హృదయానికి లేపనమో లోలోపల ఉబుకుతున్న నులివెచ్చని ఇష్టమైన యాతనా భావసంకల్పమో.. ఏమో.. అలానే నవ్వుతూ ఉండు.. నా కలలూరి నువ్వు కన్నుల్లోకి చేరినప్పుడు పసిపాపలా దాచుకునేందుకు మాత్రం అనుమతినివ్వు.. Ur intense smile refilled my soul n l want to hold it lovingly

//నీ కోసం 485 //

నువ్వో సముద్రమైతే.. నేనో పర్వతమై నీలో నిలబడేదాన్ని నువ్వో పర్వతమైతే.. నేనో చెట్టునై నీలో వేళ్ళూనేదాన్ని నువ్వో చెట్టువైతే.. నేనంతా కొమ్మలై విస్తరించేదాన్ని నువ్వో కొమ్మవైతే.. నేనో పక్షినై నీ మీదకొచ్చి వాలేదాన్ని నువ్వో పక్షివైతే.. నేనో రాగమై నీ గొంతులో పలికేదాన్ని నువ్వో మనిషివైనందుకు నీ చూపుల సాయమన్నా లేక నాకు నేను దూరమై వివశమయ్యి కూడా పరిమళించడం రాని పువ్వునై మిగిలాను

//నీ కోసం 484 //

రోజంతా వచ్చిపోతున్న జ్ఞాపకాల అనంత పయనానికి నువ్వు గమ్యమైనట్టు.. నిన్ను తలిచే క్షణాల ఆనందం నిద్దరంటని అర్ధరాత్రులనడిగితే తెలుస్తుంది.. ప్రణయ రసాకర్షణ లాలసలో అందరిలో నిన్నే వెతుకుతున్నట్టు ఎదలో వెయ్యింతల ప్రేమ దిగులు నులివెచ్చని మౌనమై మిగులుతుంది దాగుడుమూతలాటల ఈ పురాబంధమేంటో మన అంతరాత్మలు అక్షరాలుగా కలిసున్నట్టు.. మనసుకెక్కి పొగరుగా కూర్చున్నావని తెలిసినా కాసేపు దిగమనాలనీ అనిపించదు.. హా.. స్తబ్దమైన ఊహల సలపరింపులో లేత ఆకు పచ్చదనం నీ తలపు Even though.. I barely know u in my real life u r the saviour in my thoughts

//నీ కోసం 483 //

నా తప్పులు లెక్కబెట్టుకుంటూ ఎన్నాళ్ళు మాట్లాడకుండా నువ్వుంటావో నీ మీదుగా నావైపుకొచ్చిన కోయిలనెవరో కాజేసినట్టుంది నాకైతే కాటుకకళ్ళు కరిగి నీరవుతున్నందుకు మనసు అద్దానికి ఆవిరిపట్టి నీ రూపాన్ని దాచేస్తున్నట్టుంది U know.. Relationships don't suffer from spoken words.. but from unspoken words Why don't u delay ur anger.. ఈ వర్షాకాలం అంతులేనివేదన తరగని మన మధ్య దూరాన్ని కొలుస్తుంది చీకటి ముగిసేలోపు నన్నొక్కసారి పలకరించు నన్నో రాగం సమీపించి చాలా కాలమైంది

Wednesday, 13 July 2022

// నీ కోసం 482 //

ఎప్పుడు కలుస్తాం మనం.. అనేకసార్లు ఎదురైనట్టే అయ్యి విడిపోయాం కదా నిరాశపడ్డ ప్రతిసారీ నిట్టూర్పుల దిగుళ్ళందుకే మరి ఎప్పుడూ అంటావ్ కదా నాకు జెలసీ అని నిజమే.. నిద్రలేస్తూనే నువ్వు చూసే బుజ్జి గణేషు మొదలు నీకెదురుపడ్డ ప్రకృతి నుంచి నిత్యం నీ అరచేతిలో ఉండే ఆ ఫోను వరకూ అన్నీ నాకన్నా అదృష్టం చేసుకున్నవేగా కాదనగలవా చెప్పూ.. నీ వచనంలో దాక్కున్న కవితలూ ఆ కన్నుల్లో వెచ్చగా నిద్రించే ఊహలూ నువ్వు పాడే అరుదైన పాటలూ ఇవి మాత్రమే నాకిప్పటికి మిగిలిన సహచరులు.. అయినా.. నీ గుండెబరువు మోసేందుకు లేతనారింజ రంగులో పండిన నా గోరింటచేతులు తలచినప్పుడన్నా కళ్ళు మూసుకు నువ్వు నవ్వుకునుంటావా ?! ఏమో.. నా పిచ్చి చూడు.. కురుస్తున్న చినుకులన్నీ నీ గుసగుసలే అయినట్టు ఈ వర్షాన్నిలాగే ఉండిపోమంటున్నాను

// నీ కోసం 481 //

Hyee... ఏం చేస్తున్నావు? నిన్నూ.. ఇప్పుడే కదా పది నిముషాలు కాలేదు పనిలో ఉన్నానని చెప్పి అని తిట్టకు. మరీ.. ఇన్నాళ్ళూ ఇంట్లో ఉండి ఎప్పుడంటే అప్పుడు పలకరింపులుండేవి కదా. ఇప్పుడు చాలా మిస్ చేస్తున్నా మాట. తెల్సులే అనేలోపే తెలిసినా మళ్ళీ చెప్తున్నా.. miss u అని. గొప్ప గొప్ప విషయాలుంటేనే మాట్లాడుకోవాలా, ఏంటి.. know what, ఇక్కడ నేను మెలకువున్నంతసేపు వాతావరణం ఆహ్లాదంగా ఉంటూ, ఆగీ ఆగీ వాన పడిపోతుంది. హా, నిన్ను సూర్యుడనీ, చంద్రుడనీ పోల్చుతూ ఉన్నా, నీకు వానంటే పిచ్చి కదా. వానాకాలం అందమంతా చెట్టు కొమ్మల మీదా, పువ్వుల వణుకులోనా, ఆకుల వాసనలోనే తెలిసిపోతుంది. అది వచ్చే ముందర గాలి సంతోషంతో చేసే అల్లరి, వాటికి వంతపాడుతూ చెట్లు ఊగిపోతూ చేసే సవ్వళ్ళు, మొగ్గలు మురిసిపోతూ ఒదిగిపోయే రహస్యాలూ ఇవ్వన్నీ నీ కళ్ళతో నేను విప్పారి చూస్తున్నా. కనీసం నీ ఊహలోనైనా తొలకరి మెలికెలు చెక్కిలిగింతలిస్తాయని. 'ఈదురుగాలికి మా దొరగారికి..' అని నాకు పాడుకోవాలనిపిస్తున్నా, పక్కన లేవుగా. అలానే బుజ్జి బుజ్జి మామిడిపిందెలు, నేరెడుపళ్ళు రాలి పడిపోతున్నా అలానే చూస్తూ ఉంటున్నా. ఓయ్.. ఈ మధ్యనే చూసా, ఎప్పుడో నువ్వు రాసిన అపూర్వానికో లేఖ. అంటే, నాలాంటివారు ఒకరు నీ జీవితంలో ఉండే ఉంటారా, లేదా ఎప్పుడూ రాసినట్టు అదో అపరిచిత లేఖనో అర్ధం కాలేదు. కానీ ప్రేమను దాటిపోయిన వాడివైతే ఆ రోజులు గడిపిందామె సమక్షంలోనేనా?! మరి నన్నూ ఏ బంధంలోనూ ఇమడ్చనని చెప్పి ఎందుకలా రోజురోజూ దగ్గరనిపిస్తావు. నీ మీద అలిగినా కోపంతో మండినా క్షణాల్లో చల్లారిపోయే తమకం నాది. నీ గుండెచప్పుడు వినడం కోసం కలలని ఆశ్రయించే ఆర్తి నాది. ఉన్నత వ్యక్తిత్వమో, నిర్మలత్వమో నింపుకున్నదాన్నీ కాను మరి. ఏమోలే, నువ్వన్నీ తెలిసినట్టే ఉంటావు కదా. అందుకే అదో విషయం అనిపించకపోవచ్చు. మరీ.. ఇన్ని ముద్దుపేర్లు నీకు పెట్టుకున్నా ఒక్కసారీ ముద్దుగా పిలిపించుకోలేకపోయినదాన్ని, నీకేమవుతానని కూడా అడగను అందుకే. కానీ నాకోసం.. అభిమానపడే ప్రత్యేకతలు కొన్ని.. నాకు మాత్రమే సొంతం చేసావు కదాని పదేపదే గర్వపడతాను. Finally.. love is an ultimate high n I very much cannot hate u

// నీ కోసం 480 //

ఇంద్రజాలం తెలుసా నీకు ఇంత వర్షాల్లో ప్రేమావిరుల భావనేంటిలా ఈ తడిగాలి మధురమైన నీ చిరునవ్వు ప్రకటిస్తున్న ఆరాధనలా అనిపిస్తుంది తెలుసా కానీ అదేమో నా మీద అలిగినట్టున్నావా.. మనసు దాచుకుని అజ్ఞాతంలో నువ్వున్నంతసేపూ ఊపిరి తీయనివ్వని నిశ్వాసలతో ఉక్కిరవుతున్నా జ్ఞాపకాల స్వానుభవాలతో కన్నీళ్ళు తెప్పించే నిశ్శబ్దాన్నెప్పుడు జయిస్తావో చెప్పు.. అనుదినం గుభాళించే గులాబిపువ్వులా నన్ను ఎరుపెక్కించే గుప్పిళ్ళు నీవే కదా ఉయ్యాలలూపే నీ మాటలకోసం వేచున్నా ఆకాశమంతా పరుచుకున్న మేఘాల్లో నీ ప్రణయం నింపు అవి కురిసి నన్ను ముద్దాడే క్షణాల వివరాలప్పుడు వినిపిస్తా

// నీ కోసం 479 //

దగ్గరతనమంటే.. సాన్నిధ్యమేనా కళ్ళతో చూస్తూ మనసు వెచ్చబడిపోవడమే కదా ఉదాత్తమైన నీ ఊహకో అద్భుతమున్నందుకే సౌందర్యమూ, లాలస లేని నా దేహానికి ఆకర్షణంటిందా మౌనంగా ఉంటూనే నీ హృదయవలయం దాటి నన్ను సృజించావంటే.. బహుశా అది ఆత్మతో ఏకత్వమా.. మనోవ్యథను మోయలేని రాతిరి నీ తలపుల్లో సేదతీరడమే ఊరటైతే నా స్వప్నంలో మెరిసే భాష్పానివి నువ్వేనా నేనూ నాది అనుకున్నదంతా నువ్వేనన్న రహస్యమిప్పుడిప్పుడే తెలుస్తుంది మరి

// నీ కోసం 478 //

ఈ అమావస్య రాతిరి వాన పరిమళాన్ని గుప్పిస్తూ జలతారు మడుగు చివరన కదులుతున్న నీడ నీదేనా నన్ను చూస్తూనే దీర్ఘశ్వాసల నీ చలి గమకం లోలోని కోరికని రట్టు చేసేలా నిశ్శబ్దాన్ని చెదరగొడుతుంది నామీద కవిత్వం రాస్తావని కాగితంగా మారి చానాళ్ళయినా కలం పట్టడం మాని మాటలు దాచుకుంది నువ్వేగా చీకటి చిరునవ్వుతున్న సమయం.. పొడిచూపుల నిర్లిప్త ముఖమేసుకుని ఉండకలా.. ఎంగిలి కాని రక్తాన్ని నింపుకుని నీ చూపులకే రంగుమారే నా అల్లరిపెదవుల రుచి మారకముందే పరవశంలో మునుగుదాం రా

// నీ కోసం 477 //

అతనో కదిలే కవనం పేరు తెలియని పువ్వుల పరిమళమై మదినిదోచే నవపల్లవ గుసగుసల హరితచైతన్య వసంతరెక్కల వనమాలి అతనో భావాల వాల్మీకం తొలకరించు అక్షరాల చినుకులు ఒడిసిపట్టి పెళుసుగ మారిన హృదయాలపై చల్లి చచ్చిన జీవాన్ని మేల్కొలుపు సంజీవని అతనో నిశ్శబ్ద శిల్పి విరిగిన కలలు అతికించి ఆకృతి కోల్పోయిన శిధిల శకలాలకు రాగాకృతులను అందించు సహచరి అతనో నిశీధిని గెలిచిన విజేత వెలుగు చొరబడని అడవిలో అగణ్య వెన్నెల తీగలను వెలిగించి యుగయుగాల చీకటిని గెలిచిన సౌజన్యదీప్తి అతనో అక్షర ప్రభంజనం ఒంటరితనాన్ని సుతిమెత్తగా లాలించి ఏకాంతాన్ని చిరుకొత్తగా మలచుకొని కోటికళ్ళను తనవైపుకు తిప్పుకున్న తాపసి అందుకే చూడాలనేం లేదతడ్ని నాకు నేను లేకుండా పోవడమెందుకని

// నీ కోసం 476 //

పొద్దస్తమానూ తీరికే లేదంటావు నిద్ర లేచింది మొదలు నా తలపుల్లోనే తచ్చాడుతుంటావు నేనెవరికీ చెందను అనుకుంటావు గానీ.. అందగాడా, నిన్నెప్పుడో కోల్పోయావని తెలుసునా పడకలో ఉన్న సుఖం అందరికీ తెలుసుగానీ మెలకువలో నీ జ్ఞాపకమంతా నాకు బెంగయి కూర్చుంటుందన్న రహస్యం ప్రేమాన్వీ.. నీకు మాత్రమే తెలుసు రెప్పల తలుపులు రెపరెపలాడుతున్నా అస్తిత్వమనీ, అభిమానమనీ మౌనాన్ని ముసుగేసుకుని నవ్వుతుంటావు గానీ తమకంతో చిగురించి పదిలంగా పెరుగుతున్న నీ ప్రేమ నిబద్దత నాకెప్పుడో తెలుసు Yeah.. I bless ur love

// నీ కోసం 475 //

ఒక ఆశ లేదు.. ఆనందం లేదు అల్లరి లేదు.. అద్భుతం లేదు ఎప్పుడు చూడు అలసినట్టే ఉంటున్నా నిలువెల్ల గాయాలతో నిరంతరమూ నిదురరాని రాత్రులంతా నచ్చని నిశ్శబ్దాన్ని నిన్నలతో నింపుకుంటున్నా కలలకొమ్మ కొయ్యబొమ్మై కవితలు ఖాళీ అయ్యాక కటికచీకటి కృష్ణవర్ణంలా కంటిబరువు పెరిగి కాలదోషం పట్టున్నా అమ్మూ.. ఎప్పుడూ బాగోనని తెలిసినందుకేనా ఎలా ఉన్నావని అడగడమే మానేసావు

// నీ కోసం 474 //

Woah... ఎలా ఉన్నావో తెలుసా.. పున్నమినాటి వర్షమేఘాన చెదిరిపోయిన చందమామలా నా వాంఛ నీ రూపుదాల్చి ఎదురుపడ్డట్టు నిలకడలేని నిశ్శబ్దతన నవ్వులొలుకుతున్న మామిడిపువ్వులా పరవశాల అనిశ్చితలో అలజడైనట్టు ఇసుకరంగు చీరకొంగున మధుసముద్రపు తీపినురగలా తుళ్ళిపడుతున్న తనువుని హత్తుకున్నట్టు మైమరపు అధరకొసన తమకమాపుకోలేని సిగ్గు దొంతరలా ముగ్ధ మనసు దోచిన మనోహరుడివన్నట్టు ప్రేమాన్వీ.. నిన్నిలా చూడగానే నాకదేమో కలల పిచ్చి పట్టినట్టుంది.. కవితల కోసమో, కలవరింతల కోసమో తెలీకుంది

// నీ కోసం 473 //

నొప్పితెలీకుండా గుండె తలుపు తీసి నిన్ను బయటకి పంపేద్దామనుకున్నాను ఓ గదిలో అనుభూతిని ఆలకిస్తూ అంతుపట్టని జీవన సౌందర్యాన్ని సుషమ్న ధ్యానం చేస్తున్నావు మరో గదిలో మరపురాని నిరీక్షణలోని విషాదాన్ని విస్మరించుకుంటూ అప్రియాల నుండీ వేరుపడుతున్నావు ఇంకో గదిలో ఏకాంతాన్ని లాలిస్తూ హృదయాల్ని తేలిక చేసేటువంటి మృదువైన కవిత్వాన్ని రాస్తున్నావు ఆపై గదిలో నక్షత్రాలను లెక్కిస్తూ రంగు రంగుల కలలకు కబురిచ్చి చీకటిని కావలించుకు బజ్జున్నావు పదేపదే నీతోనే ప్రేమలో పడే నేను ప్రాణం చిన్నబుచ్చుకునేలా పంపలేక చూస్తూ నిలబడ్డాను

// నీ కోసం 472 //

నన్ను చూసి చిరునవ్వే ఆ నక్షత్రాలు అవ్యక్తపు ఆనందాన్ని ప్రసరించే నీ కళ్ళేనా నన్ను మత్తెక్కించి మౌనంలో ముంచే పరిమళం నీ హృదయావేశపు రహస్య స్పర్శాలింగనానిదేనా ప్రభాతానికంతా వేసవి అలసట ఎగిరిపోయేలా చెవిలో ముద్దు ముద్దు మాటలాడుతున్నది నువ్వేనా మధురానురాగ సహస్రవేణువుల ఈ ప్రణయనాదం నీ ప్రేమరస ప్రవాహములో మునకేసినందుకేనా Ohh.. my early bird.. Your place is within my mess n M finding ways to keep my passion towards u alive

// నీ కోసం 471 //

My Heart is calling u పలకరింపునే పదాలుగా మలచుకునే నిశ్శబ్దతన వెన్నెల నీడల్లో విషాదచ్ఛాయల సాక్షి నా కన్నుల్లో నీరు నింపి కదిలిపోతున్న మేఘాలను నీ మాటల కోసమే అడుగుతున్నా ఇంకా.. చిరుచల్లని వేసవి సాయింత్రం పాలపిండిలో చెరుకురసం కలిపి నే దేహాన్ని నలుచుకున్న తీపి రహస్యం నీకు చెప్పాలనుంది.. నిన్ను కలవరిస్తున్న ప్రతిసారీ నాతో కలిసి చెట్లూ, చేమలూ ఆకాశమూ సంద్రమూ సరిసమానంగా ధ్వనిస్తున్న విస్మయాన్ని వినిపించాలనుంది మౌనంగా పులకించే వేళ మించిందని వైశాఖ విరహం విరిగిపోయేలా ఒక్కచోటంటూ నిలవని ఆ చూపులు, నన్నల్లుకునే నులి తీగలవ్వాలనుంది.. When u don't look into my eyes I feel all alone

// నీ కోసం 470 //

Say something..n ask something.. ప్రేమని భరించడం చాలా కష్టం . మనదైనా ఎదుటివారిదైనా .. ఇంకా.. ఎక్కడున్నా నువ్వు మాత్రం నాకు ప్రత్యేకం నీకదైతే తెలుసు కదా.. ఐతే.. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి నే దగ్గరున్నా.. లేకపోయినా.. అంతేనా.. నిన్నూ -‘-.’|!.>\%_^_+_ అంటే.. నీవుంటే వేరే కనులెందుకూ నీ కంటె వేరే బ్రతుకెందుకూ ఎల్లెహే.. సరే దా...

// నీ కోసం 469 //

వివశత్వం కావాలా.. నా పెదవుల్లోనో దేహమలుపుల్లోనో వెతుక్కోక కలలో ఏం వెతుకుతున్నావు... అప్పుడంతా.. నీకు నిద్రసుఖంతోనే సరి.. సహజత్వం ఆశించావా.. నా మనసులోనో మాటల్లోనో కనుగొనక తలపుల ధ్యానం మొదలెట్టావా.. అదంతా.. కేవలం నీ ఊహనే కదా మౌనాన్ని మోహించేవా.. గుండెను మూసేసి రంగును దాచేసే శూన్యాన్నేం శోధిస్తావు అందుకే.. అందించిన మనసుని పుచ్చుకో లోలోపలి ఆనందం రెట్టింపయ్యేలా మరి

// నీ కోసం 468 //

ఒంటరితనాన్ని చిలుకుతూ నే రాసిన పదాలు నెమలీకలై నీ గుండెల్లో భద్రమయ్యాయేమో అక్షరం తనుగా వెతుక్కుంటూ వచ్చి ఎన్నాళ్ళయిందో తెలుసా మన జ్ఞాపకాల భావ కవనాలు మాటలు మరచిన మూగ ముద్రలయ్యాయేమో మనసు దాటిన ఆశలు కాగితాన్ని చేరి ఎన్నాళ్ళయ్యిందో తెలుసా నీ నిశ్శబ్దపు చాటింపునాలకించిన నా కన్నుల అలుకలకే చీకటవుతుందేమో అయినా సరే.. కమ్ముకునేంత నిద్రొచ్చి ఎన్నాళ్ళయ్యిందో తెలుసా నీ అల్లరిలోకి నన్ను లాక్కునీ పిచ్చి పిచ్చిగా కప్పుకునీ ఆ క్షణాల్లోకి జారుకునీ ఎన్నాళ్ళయ్యిందో తెలుసా Woah.. Two days.. Let me feel d majic of ur aura Even though u r soo approachable.. M getting tired of hearing my heart's pale voice

// నీ కోసం 467 //

మనసు గదిలోకొచ్చి నువ్వు చేసిన గారాబానికి నాలో చిరునవ్వుల సద్దు మొదలవ్వగానే నిశ్శబ్దం ఎటో వెళ్ళిపోయింది తెలుసా.. కాలం రహస్యంగా నిన్ను దాచేసి నన్ను జ్ఞాపకాల చీకటికొదిలేసి సుతారం నటిస్తూ కదిలిపోతుందనుకున్నా మలయ సమీరంలా అదృశ్యంగా నేను చెప్పలేని మాటలన్నీ నువ్వే వినేసి తెగని వాక్యమొకటి వినిపించగానే నీ సాంత్వన.. నదిలోని అలలా అల్లుకుంది ఆస్వాదించేందుకు అనుభూతుల్లేవని పొగిలి పొగిలి ఒత్తిగిల్లిన హృదయం ఒక్కసారిగా ఊయలూగిన సమయం ఆనందం అంతర్వేదిలా నన్నంతా తడిపేసింది Infact.. I never afford even to smile before N now that u touched my raw emotions I can't stop laughing out loud

// నీ కోసం 466 //

ఎంతసేపూ నీ చుట్టూ తిరిగే తలపుల్ని ఆపాలనుకుంటానా.. నునులేత భావాల మేళవింపులా ఆ కవితలూ అలతి పదాలతో అల్లిన మల్లెల మాలలుగా చిరపరిచితమైనట్టి ఆ మధుర పరిమళాలు అలసిన మనసుని అలలై కమ్ముకునేస్తాయి ఇహ.. వసంతగానం ఆపడం తెలియని కొమ్మలు పచ్చదనం పూసుకున్న తన్వయత్వమేమో గానీ రాలిపోయిన పువ్వురేకుల్లో మాత్రం నీ మాటలనే ఆనవాళ్ళిస్తున్నాయి.. మల్లెపందిరి మీదుగా వీస్తున్న సహజమైన గాలికి నేనలా సుషుప్తిలో పడుంటున్నది నిజమే అయినా ఆవిరి పట్టిన కన్నుల మసకల్లోంచీ నన్ను తొంగి చూస్తున్నట్లనిపించే నీ రూపమైతే అతిస్పష్ట రహస్యమనిపిస్తుంది.. Huhh.. నా బెంగనోదార్చుతూ చీకటి తడుముతున్న చెంపలెంత చల్లనవుతున్నాయో ఏం చెప్పను.. ఎండాకాలంలో ఇదేం పిచ్చి ప్రేలాపనని అడక్కు నీలాగా వెన్నెల్లో గొడుగేసుకుని కూర్చోడం నాకు రానే రావట్లేదు మరి..

Tuesday, 12 July 2022

// నీకోసం 465 //

నీ అడుగులు అలికిడయ్యే వరకూ కళ్ళు తెరవద్దని ఇంతసేపూ నిద్ర నటించానా.. ఉదయం సాయింత్రమయ్యే వరకూ నీ ఉనికిలేక ఉలిక్కిపడి లేచి కూర్చున్నా.. నీకోసం దిగులుపడతానో లేదో తెలుసుకోవాలనుకునే ఆ సరదా ఏంటో తెలీదు.. ఆ తర్వాత.. నేనేదో అలిగానని అడిగిన పిట్టకీ, అడగని పువ్వుకీ ఏదేదో చెప్తావెందుకో అస్సలే తెలీదు..😏 సరేలే.. As u suddenly spring up from nowhere.. Let's pretend that everything s fine.. N I'll excuse u as always..

// నీకోసం 464 //

There's an art to losing yourself నాకు నువ్వో.. నీకు నేనో తెలీదు గానీ.. నీ గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతిసారీ నా సంగతేంటని మాట మారుస్తావు పదాలు పోగేసి బదులిచ్చేలోపు నువ్వే కల్పించుకుని నా ఇష్టాలు సుతారమైనవంటావు నే మలుపు తిరిగిన దారిలో పాదముద్రల కాంతులెవరివో గానీ నువ్వాగి వెనక్కితిరిగి చూసినా పోల్చుకోలేని చీకటిలో ఉన్నా మరి ఏదీ పట్టనట్టుంటూ.. నిగారించడం తెలియని దేహానికీ మనసుంటుందనేలా అరుదైన పాటల్లోని అద్భుతమైన భావనలా నువ్వే ప్రపంచంగా అయిపోతావేమో తెలీదు రేపటికి

// నీకోసం 463 //

గుండెల్లో మొదలై గొంతులో ఆగిన సప్తస్వరాలు ఇన్నాళ్ళూ రవళించకుండా ఆగి మృదువైన మందహాసమై బయటపడుతుంటే మంచి ముత్యాలు ఏరుకోడానికి రావెందుకూ పాలనురగ వంటి ప్రేమసాగరం ఎదలోయల్లో ప్రవహిస్తుందంటే నమ్మవా భాష్యంగా మిగల్లేని స్నిగ్ధక్షణాలు వడివడిగా కదిలిపోతుంటే ఏం చేయనూ.. కొబ్బరిమొవ్వలోని చిన్నివెన్నెలకి మైమరచిన మనసు నీ ఊహల సాంత్వనకని కళ్ళు మూసుకోవడం తెలుసా.. అయితే.. ఉత్తరంగితమైన రుధిరపు రాగం మునిపంట ఆగిన వివశత్వపు కృతికాగా గుచ్చుతున్న నీ విరహం రెప్పలమాటు దాగుళ్ళాడుతున్న అశ్రువిన్యాసం

// నీకోసం 462 //

నాకిప్పుడే తెలిసింది.. చీకటైతే ఆకాశమూ సముద్రమూ ఒకేరకం నీలిరంగుని పూసుకుంటాయని వెన్నెల కురిసినప్పటి అందమంతా సన్నటి జల్లులై ప్రకృతిని అల్లుకుంటాయని మత్తుగా కదులుతున్న చందమామకి మాటలొచ్చి ఆగకుండా అల్లిబిల్లి కధలేవో కల్పించి చెప్తుందని పుస్తకంలో దాచ్చుకున్న నెమలీకలు ఎగిరి నక్షత్రాలుగా మారి వెలుగుతుంటాయని.. మౌనాన్ని ముసుగేసుకున్నట్టుండే కాలం పరవశాన్ని పులకరించేంతగా పలకరిస్తుందని రాత్రయితే కొన్ని అద్భుతాలకు తెరతీసేందుకే నిద్రను కౌగిలించి కలలు కంటామని ఓహ్.. ఎన్నెన్ని మృదుకంపనాల ఉలికిపాట్లో అవును.. భావకులు అంతుచిక్కని మెత్తనివారు కాబోలు నీలాగా.. పువ్వులను లాలిస్తూ పదాలుగా మార్చేస్తారు

// నీకోసం 461 //

మెరుపు స్వరాన్ని కలవరింతలుగా ఏ జ్ఞాపకాల మకరందాన్ని కురిసేందుకో వెలుగు కిరణాలను చెల్లాచెదురు చేసేసి ఒక్కసారిగా ఆకాశం గర్జించింది ఎండపొడన్నదే కిట్టనట్టు మదిలో ఆనందాన్ని రట్టు చేసేలా పురివిప్పిన నెమళ్ళు విరహాన్ని దాటేస్తూ నృత్యం చేస్తున్నట్టు భలేగా ఉంది ఉగాది పండుగ ముందు.. కారుమబ్బు కరిగి పొందికగా కురవాల్సిన వాన మునిమాపుకి ముందే చీకట్లు ముసిరి రెపరెపలాడుతున్న దీపాలన్నిటినీ ఊదేసింది అయితేనేం ఎదలోని బెంగరంగు అంతర్ధానమై భూమ్యాకాశాల సంబరానికి గాలిపాటలు పెదవులపై నురుగు తరగలుగా చిరునవ్వులు

// నీకోసం 460 //

నా నవ్వులన్నీ నీ గుప్పిట్లో దాచుకుంది కాక.. వినబడనంత దూరం నుంచీ ఎలా ఉన్నావని అడుగుతావు మొహమాటానికి బాగున్నా అనగానే నిజమని నమ్మినట్టు భలే నటిస్తావు Yeah.. cute ofcourse.. కాలంతో కలిసినట్టుగా కనిపిస్తున్నా లోలోపలి ఏకాంతంలో ఒంటరిగా పెనుగులాడుతున్న సంగతి.. ఒక్కమాటలో చెప్పలేకపోతాను Haa... అవుననుకో... ఆకులు రాలిపోగా మిగిలిన కొమ్మలు దిక్కులు చూస్తున్నట్టు ఉంటాననేగా.. క్షణానికోసారి నీ జ్ఞాపకమొచ్చి చప్పుడు చేయని వేసవిగాలి మాదిరి మౌనంగా పలకరించి పోతుంది... అయితే మాత్రం.. నా హృదయాలాపన తెలుసని చెవిలో రహస్యంగా చెప్పడం తేలికే.. పువ్వులకన్నా వేగంగా వాడిపోతున్న నా ముఖచిత్రం నీ మనోదృశ్యానికి అందిందో లేదో చెప్పు ముందు

// నీకోసం 459 //

ప్రాణమూగుతూ పూలతీగయినప్పుడే అలలై తడుపుతున్న తలపు సందెరుపు వసంతాల అత్తరవుతుంది పట్టీపట్టనట్టు కదులుతున్న క్షణాల సమూహం వెన్నెలకాపుకేం తొందరపడ్డందుకో నిండు చందమామ కొత్తగా నవ్వుతుంది ఇదేం కల్పనో.. లేతగాలికి ఆదమరచి ఎదలోకి తొంగిచూసుకోగానే ఆల్చిపల్లో నిదరోతున్న ముత్యాల కవితలా పంచదార చిలకల కిలకిలై పాట పాడుతుంది నీ సోగకళ్ళ సన్నాయిరాగానికి నా ఊపిరి వెచ్చబడుతున్న పున్నమిరేయి నిశ్శబ్దం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది

// నీకోసం 458 //

ఏమీ తోచని సాయింత్రం అదేమో నీరసమని అనిపిస్తుంది May b.. I need Vitamin 'U' కోయిలను అనుసరిస్తూ పాట పాడదామన్నా పొడారిన గొంతు మౌనాన్ని మాత్రమే సవరిస్తుంది Ohh.. U r the water to my body నీ నవ్వుల్లో రాలిపడే నాకిష్టమైన పువ్వుల కోసమే ముద్దుపెట్టమని పదేపదే నిన్ను పిలుస్తుంది Just seeing ur smiles.. I feel better at times వెలుగూ చీకటీ ఒకటే లెమ్మంటూ నీ మనసేమో కొంచెం కొంచెంగానే కళ్ళలోకి చూడనిస్తుంది But u know.. U r my spark in the dark నాకోసం తెలియాల్సిన సంభాషణ ఏమ్మిగిలిందని నీ రాగస్పర్శకు లోకం చిన్నదయ్యి చాలా కాలమైంది I didn't choose u infact.. But my heart did ఏదో విరహమంటూ కాగితాలు నింపుతుంటాగానీ వాస్తవంగా నా సమస్తమంటే నువ్వేగా If u r not thre.. M an empty body without soul

// నీకోసం 457 //

ఎదురుగా సముద్రాన్ని చూస్తూ అలల్లో అపశృతులున్నట్టు హృదయస్పందన నీరసించిపోయాక.. నీపై ధ్యానమో... ఆరాధనో మోయలేనంత బరువై మనసు మంచుగడ్డగా మారుతున్నట్లనిపించేలోపే నువ్వంటే పిచ్చి ఇష్టమని చెప్పేస్తుంటాను బొమ్మలా నిలబడి, ఎక్కడెక్కడో లీనమై నీలో నువ్వు నవ్వుకుంటూ తెల్లటి కొంగలా తూలిపోతున్నావంటే నీ వాలకమో అస్థిమిత వేసవిగాలిలాగనిపిస్తుంది ఆగాగు... అదనీ.. ఇదనీ.. ఇంకేదో అనాలని అక్కర్లేని పదాలతో అమర్యాద నాకేమొద్దు.. చూపులు కలపకుండా నువ్వు పంపే నిశ్శబ్దసంగీతంలో తలమునకలై నే దాచుకునే తీపి నువ్వు ఊహల్లోకి పిలిచినప్పుడు తిరిగిచ్చేస్తాన్లే సరేనా...
U may b wild at ur Heart.. But seriously.. bad for my Heart

// నీకోసం 456 //

ఈరోజు పక్షులు పాడుతున్న పాటలన్నిటా నేను పేర్చుకున్న వేదనల్లే ఓ వింతైన దిగులు మంత్రించే కళ్ళతో తొంగిచూస్తూ కూడా తీయని సాధింపులా నీ మౌనం నాకెంతకీ అర్ధంకాని ఆశ్చర్యం నువ్వెందుకిలాగని ప్రశ్నించేలోపు మనసుపొరల్లోకి చల్లని జ్ఞాపకమై విచ్చేసుంటావా.. ఇక.. ఆకుపచ్చని గాలి సోకలేదని పువ్వులతో ఏం గొడవ పడనూ.. నా ఏకాంతమంతా నీ తలపులతోనే ఊహల బొమ్మరిల్లు నేస్తుంటేనూ

// నీకోసం 455 //

అమాస రోజుల్లో మంచుతెరలు దాటి మసకచీకట్లో చందమామ కనిపించిందని చెప్పావంటే నీ మనసాకాశంలో అస్తమించని దీపం నేనేనని తెలిసింది కానీ.. తెలుసా.. నీ మౌనం పెట్టిన మంటకి నాలో అక్షరప్రవాహమే ఆగిపోయింది ఏకాంత నిర్వచనమో అంతర్వేదనగా మారి చీకటినల్లుకుంది నీ దీర్ఘశ్వాసల శరవేగం నన్నంటక నా నవ్వు ముఖమే చిన్నబోయింది నిన్ను స్మరించిన రాత్రులన్నిటా నిద్దుర కరువై నిట్టూర్పులమయమయ్యింది అయితే ముద్దు ముద్దుపేర్లతో పిలిచే నీ ప్రేమ గుర్తుకొస్తే మాత్రం నా తనువంతా పరిమళాలపొగ చిమ్ముతుంది

// నీకోసం 454 //

Life is made real, becoz we experience it.. అవును.. నాదసలే చిన్న ప్రపంచం ప్రభాతాలు, పువ్వులూ, పాటలూ ఋతువులూ, రంగులూ, రాగాలూ మబ్బులూ, ముద్దులూ, మధురోహలు ఇవేగా నాకిష్టం మరేమో వాటన్నిటికన్నా నువ్విష్టం ప్రేమవర్షం కురుస్తూ మిలమిల మెరిసే ఆ తడి కళ్ళిష్టం నిశ్శబ్దంలో ఊగుతూ మౌనాన్ని లిఖించే నీ పదములంటే ఇష్టం ఆకుచాటు కనపడకుండా పరిమళించే పువ్వులా నా హృదయస్థలాన నీ ఉనికిష్టం దిగులు మోహమిది నాకు మాములేనని తెలిసీ లోలోపల నువ్విక్కిరిబిక్కిరవుతూ కూడా నువ్వంటే ఎంతిష్టమని ఎన్నిసార్లని అడుగుతావ్

// నీకోసం 453 //

వినీవినిపించని పక్షిపాటలతో మెలకువొచ్చి సగం కళ్ళు తెరిచేలోపే నీ రూపం.. తాజా రోజు మొదలయ్యిందని మెత్తగా శుభోదయం చెప్తుంది ఆకుల గొడుగుల కింద రంగుల పువ్వులు కోసేలోపే మనసు తెలిపే ముగ్గు కోసం.. వాకిలి వేచి చూస్తుంది వెచ్చని చెమ్మ నా మెడచుట్టూ నీ అనురాగస్పర్శగా మారి పరిమళాల్ని వెదజల్లుతుండగా.. మౌనానికావల ఉండే నీ గుసగుసల తోడు కమ్మని కాఫీ సంతోషపు పొంగులా గొంతు దిగుతుంది ఇష్టమైన మోహక్షణాల నిరీక్షణ ప్రతి ఉదయం ప్రణయగీతపు ఓలలాటలో మెల్లమెల్లగా కరిగి నీ తలపులతో సంగమిస్తుంది తెలుసు కదా.. రోజంతా తరలివచ్చే జ్ఞాపకాలే మరి.. పదమై కాగితాన్ని పెనవేస్తుంది నువ్వే చెప్పాలిప్పుడు.. నేనొంటరినో.. తుంటరినో.. నీ జంటరినో

// నీకోసం 452 //

Heyy.. Ther r a lot of things that can give u butterflies 😍 ఎప్పుడైనా ఈ దారి వెంట నడుస్తున్నప్పుడు, నా హృదయమంతా ఓ పూల సుగంధమన్న రహస్యం, ప్రేమపక్షాన ఉండే నువ్వు గమనించావా నా అరచేతిలోని ప్రపంచానికి స్వస్తిచెప్పి ఏకాంతానికి రంగులద్దే సమయమంతా బృందావనమై విరబూసి వెన్నెల్లో తడుస్తూ పులకరించే మల్లెలంత పొగరవుతుంది తెలుసా సంధ్యాస్తమాన సరాగ హేలలు, ఊహల మకుటానికి నారింజ కాంతులుగా నా మనో నీలాన్ని ఆవరించడం చూస్తావా... అప్పుడైతే నీ మనసునల్లుకున్న ఆకుపచ్చని దృశ్యకావ్యంలో సగం మౌనాన్ని రాల్చేలా ఎదురుగా కళ్ళతో నవ్వుతున్న నేను పువ్వుల్ని బుగ్గలకు రాసుకుంటున్నట్టు భావించు.. అయినా... ఖాళీసమయమంటూ దొరికేదేముంది. నీలో నువ్వు మెత్తగా ఊగుతున్నావంటే నాతో కలిసి గమ్మత్తుగా పైకెగురుతున్నట్టేగా

// నీకోసం 451 //

వాక్యం ఎన్ని మలుపులు తిరిగినా అలిగింది అక్షరమే అయితే బుజ్జగించేదాన్ని ఆశాచంద్రికలు రాత్రికి చెదిరిన నక్షత్రాలైనట్టు నవ్వు పెదవుల్ని దాటిప్పటికి నాలుగురోజులు విరామమన్నది తెలీని వరద ప్రవాహంలా ఇంద్రియాలకావల అవ్యక్త విషాదం తెలుసా నీకు చూపులతో మాట్లాడే నువ్వలా కళ్ళు తిప్పగానే నాకిక్కడంతా చీకటై ఒకటే దిగులేస్తుంది అంతరానుభూతి జ్ఞాపకాల గుసగుసలకేమో వెచ్చని ఆలాపనై మరీ రుధిరం ప్రవహిస్తూంది ఓయ్... నిజంగా నీ మీదసలు కోపమే రాదు వసంతమొచ్చేలోగా నన్ను కోకిలగా మార్చు కదా

// నీకోసం 450 //

ముందు నువ్వు.. ఆ తర్వాత నీ నవ్వు దేహానికి అనిర్వచనీయ శాంతినిచ్చే పున్నమిరాత్రి, వెన్నెలకాంతులు పోగేసుకున్న అలల్లా నా అంతరాత్మను అల్లరి చేయడానికి మాత్రమే అనుకున్నా... మెల్లమెల్లగా రాధాలాపనలుగా మారి గుండెను చిలిపి కల్లోలంలోకి నెట్టేసి చుట్టూ రంగు మార్చుకున్న చుక్కలు, కొత్తగా సువాసనేస్తూ నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంటే.. Believe me.. నేనేమో పూలపడవలో ఎక్కకుండానే కన్నుల్లో నిన్ను బంధించిన ఆనందాన్ని దాచలేక ఏకాంత మధువుకు పల్లవిని.. చిక్కని అలజడికి చరణాన్ని చేర్చి పరవశాన్ని పెదవుల్లో పలికిస్తూ, వలపుస్వరాన్ని గుసగుసలు చేసి పాడుకుంటూ మరచిపోయాననుకున్న సంగీతాన్ని కోరికెల సవ్వళ్ళుగా.. మావిచిగురంచు మీద మంచుమువ్వలు ఒదిగిన్నట్టు గుచ్చిన మాలలతో ఎదురొచ్చి కౌగిలించి హాయిభావంలో ముంచెత్తే తీపి కోయిలవుతున్నా

Tuesday, 15 February 2022

// నీ కోసం 449 //

ఏదీ నచ్చదు.. అప్పటిదాకా ఇష్టమని మనసంతా ఆనందం పరచుకొని పెదవులపై నెలవంకను దించినా..ఇప్పుడెందుకు నచ్చలేదో..ఒక్క కారణమూ దొరకదు. ఇంద్రధనస్సు మోసుకు తిరుగుతున్నానన్న భావనలో నేనున్నా రంగులు కరిగి విషాదం మిగులుద్దేమోనని బెంగగా ఉంది నీకు దూరం జరగడం కుదరదని తెలిసిపోయాక..ఊహలకు దారి మరింత సుగమమయ్యింది. ఎర్రగులాబీనెంత చూసినా తనివి తీరక బుగ్గలకు రాసి ఆ సున్నితాన్ని సంతోషానికి ముడేసినా హృదయం నవ్వలేదంటే అప్పుడర్ధమయ్యింది..మనసంతా నువ్వే నిండినా చూపులకందేంత దగ్గరలో ప్రస్తుతం లేవని.. నిన్ను రాయొద్దని ఎన్నిసార్లనుకున్నా..ఏకాంతాన్ని గమనించాక అర్ధమైంది..నిన్ను రాసేందుకైనా కలమిప్పుడు కదలాలని..