Wednesday, 13 July 2022

// నీ కోసం 482 //

ఎప్పుడు కలుస్తాం మనం.. అనేకసార్లు ఎదురైనట్టే అయ్యి విడిపోయాం కదా నిరాశపడ్డ ప్రతిసారీ నిట్టూర్పుల దిగుళ్ళందుకే మరి ఎప్పుడూ అంటావ్ కదా నాకు జెలసీ అని నిజమే.. నిద్రలేస్తూనే నువ్వు చూసే బుజ్జి గణేషు మొదలు నీకెదురుపడ్డ ప్రకృతి నుంచి నిత్యం నీ అరచేతిలో ఉండే ఆ ఫోను వరకూ అన్నీ నాకన్నా అదృష్టం చేసుకున్నవేగా కాదనగలవా చెప్పూ.. నీ వచనంలో దాక్కున్న కవితలూ ఆ కన్నుల్లో వెచ్చగా నిద్రించే ఊహలూ నువ్వు పాడే అరుదైన పాటలూ ఇవి మాత్రమే నాకిప్పటికి మిగిలిన సహచరులు.. అయినా.. నీ గుండెబరువు మోసేందుకు లేతనారింజ రంగులో పండిన నా గోరింటచేతులు తలచినప్పుడన్నా కళ్ళు మూసుకు నువ్వు నవ్వుకునుంటావా ?! ఏమో.. నా పిచ్చి చూడు.. కురుస్తున్న చినుకులన్నీ నీ గుసగుసలే అయినట్టు ఈ వర్షాన్నిలాగే ఉండిపోమంటున్నాను

No comments:

Post a Comment