Tuesday, 12 July 2022
// నీకోసం 453 //
వినీవినిపించని పక్షిపాటలతో మెలకువొచ్చి
సగం కళ్ళు తెరిచేలోపే
నీ రూపం.. తాజా రోజు మొదలయ్యిందని
మెత్తగా శుభోదయం చెప్తుంది
ఆకుల గొడుగుల కింద
రంగుల పువ్వులు కోసేలోపే
మనసు తెలిపే ముగ్గు కోసం.. వాకిలి వేచి చూస్తుంది
వెచ్చని చెమ్మ నా మెడచుట్టూ
నీ అనురాగస్పర్శగా మారి పరిమళాల్ని వెదజల్లుతుండగా..
మౌనానికావల ఉండే నీ గుసగుసల తోడు కమ్మని కాఫీ
సంతోషపు పొంగులా గొంతు దిగుతుంది
ఇష్టమైన మోహక్షణాల నిరీక్షణ
ప్రతి ఉదయం ప్రణయగీతపు ఓలలాటలో
మెల్లమెల్లగా కరిగి నీ తలపులతో సంగమిస్తుంది
తెలుసు కదా.. రోజంతా తరలివచ్చే జ్ఞాపకాలే మరి..
పదమై కాగితాన్ని పెనవేస్తుంది
నువ్వే చెప్పాలిప్పుడు..
నేనొంటరినో.. తుంటరినో.. నీ జంటరినో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment