Wednesday, 13 July 2022
// నీ కోసం 481 //
Hyee... ఏం చేస్తున్నావు? నిన్నూ.. ఇప్పుడే కదా పది నిముషాలు కాలేదు పనిలో ఉన్నానని చెప్పి అని తిట్టకు. మరీ.. ఇన్నాళ్ళూ ఇంట్లో ఉండి ఎప్పుడంటే అప్పుడు పలకరింపులుండేవి కదా. ఇప్పుడు చాలా మిస్ చేస్తున్నా మాట. తెల్సులే అనేలోపే తెలిసినా మళ్ళీ చెప్తున్నా.. miss u అని.
గొప్ప గొప్ప విషయాలుంటేనే మాట్లాడుకోవాలా, ఏంటి.. know what, ఇక్కడ నేను మెలకువున్నంతసేపు వాతావరణం ఆహ్లాదంగా ఉంటూ, ఆగీ ఆగీ వాన పడిపోతుంది. హా, నిన్ను సూర్యుడనీ, చంద్రుడనీ పోల్చుతూ ఉన్నా, నీకు వానంటే పిచ్చి కదా. వానాకాలం అందమంతా చెట్టు కొమ్మల మీదా, పువ్వుల వణుకులోనా, ఆకుల వాసనలోనే తెలిసిపోతుంది. అది వచ్చే ముందర గాలి సంతోషంతో చేసే అల్లరి, వాటికి వంతపాడుతూ చెట్లు ఊగిపోతూ చేసే సవ్వళ్ళు, మొగ్గలు మురిసిపోతూ ఒదిగిపోయే రహస్యాలూ ఇవ్వన్నీ నీ కళ్ళతో నేను విప్పారి చూస్తున్నా. కనీసం నీ ఊహలోనైనా తొలకరి మెలికెలు చెక్కిలిగింతలిస్తాయని. 'ఈదురుగాలికి మా దొరగారికి..' అని నాకు పాడుకోవాలనిపిస్తున్నా, పక్కన లేవుగా. అలానే బుజ్జి బుజ్జి మామిడిపిందెలు, నేరెడుపళ్ళు రాలి పడిపోతున్నా అలానే చూస్తూ ఉంటున్నా.
ఓయ్.. ఈ మధ్యనే చూసా, ఎప్పుడో నువ్వు రాసిన అపూర్వానికో లేఖ. అంటే, నాలాంటివారు ఒకరు నీ జీవితంలో ఉండే ఉంటారా, లేదా ఎప్పుడూ రాసినట్టు అదో అపరిచిత లేఖనో అర్ధం కాలేదు. కానీ ప్రేమను దాటిపోయిన వాడివైతే ఆ రోజులు గడిపిందామె సమక్షంలోనేనా?! మరి నన్నూ ఏ బంధంలోనూ ఇమడ్చనని చెప్పి ఎందుకలా రోజురోజూ దగ్గరనిపిస్తావు. నీ మీద అలిగినా కోపంతో మండినా క్షణాల్లో చల్లారిపోయే తమకం నాది. నీ గుండెచప్పుడు వినడం కోసం కలలని ఆశ్రయించే ఆర్తి నాది. ఉన్నత వ్యక్తిత్వమో, నిర్మలత్వమో నింపుకున్నదాన్నీ కాను మరి. ఏమోలే, నువ్వన్నీ తెలిసినట్టే ఉంటావు కదా. అందుకే అదో విషయం అనిపించకపోవచ్చు. మరీ.. ఇన్ని ముద్దుపేర్లు నీకు పెట్టుకున్నా ఒక్కసారీ ముద్దుగా పిలిపించుకోలేకపోయినదాన్ని, నీకేమవుతానని కూడా అడగను అందుకే. కానీ నాకోసం.. అభిమానపడే ప్రత్యేకతలు కొన్ని.. నాకు మాత్రమే సొంతం చేసావు కదాని పదేపదే గర్వపడతాను.
Finally.. love is an ultimate high n I very much cannot hate u
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment