ప్రాణమూగుతూ పూలతీగయినప్పుడే
అలలై తడుపుతున్న తలపు
సందెరుపు వసంతాల అత్తరవుతుంది
పట్టీపట్టనట్టు కదులుతున్న క్షణాల సమూహం
వెన్నెలకాపుకేం తొందరపడ్డందుకో
నిండు చందమామ కొత్తగా నవ్వుతుంది
ఇదేం కల్పనో..
లేతగాలికి ఆదమరచి ఎదలోకి తొంగిచూసుకోగానే
ఆల్చిపల్లో నిదరోతున్న ముత్యాల కవితలా
పంచదార చిలకల కిలకిలై పాట పాడుతుంది
నీ సోగకళ్ళ సన్నాయిరాగానికి
నా ఊపిరి వెచ్చబడుతున్న పున్నమిరేయి
నిశ్శబ్దం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది
No comments:
Post a Comment