Wednesday, 13 July 2022

// నీ కోసం 466 //

ఎంతసేపూ నీ చుట్టూ తిరిగే తలపుల్ని ఆపాలనుకుంటానా.. నునులేత భావాల మేళవింపులా ఆ కవితలూ అలతి పదాలతో అల్లిన మల్లెల మాలలుగా చిరపరిచితమైనట్టి ఆ మధుర పరిమళాలు అలసిన మనసుని అలలై కమ్ముకునేస్తాయి ఇహ.. వసంతగానం ఆపడం తెలియని కొమ్మలు పచ్చదనం పూసుకున్న తన్వయత్వమేమో గానీ రాలిపోయిన పువ్వురేకుల్లో మాత్రం నీ మాటలనే ఆనవాళ్ళిస్తున్నాయి.. మల్లెపందిరి మీదుగా వీస్తున్న సహజమైన గాలికి నేనలా సుషుప్తిలో పడుంటున్నది నిజమే అయినా ఆవిరి పట్టిన కన్నుల మసకల్లోంచీ నన్ను తొంగి చూస్తున్నట్లనిపించే నీ రూపమైతే అతిస్పష్ట రహస్యమనిపిస్తుంది.. Huhh.. నా బెంగనోదార్చుతూ చీకటి తడుముతున్న చెంపలెంత చల్లనవుతున్నాయో ఏం చెప్పను.. ఎండాకాలంలో ఇదేం పిచ్చి ప్రేలాపనని అడక్కు నీలాగా వెన్నెల్లో గొడుగేసుకుని కూర్చోడం నాకు రానే రావట్లేదు మరి..

No comments:

Post a Comment