Monday, 5 October 2020

// అమృతవాహిని 18 //

స్వప్నంలో ఉన్న నేను వాస్తవాన్ని గుర్తించలేకపోయాను. ఎప్పుడూ కన్నీటితో నిండే కన్నులను ఆరా తీయకున్నా, నీటివాసన మాత్రం పసిగట్టాను. ఎన్ని యుగాల వరకూ అందరాని కాలాలకి నెట్టివేయబడ్డానో, నిన్ను చేరే దారిలేని అలమటింపుదీ విషాదం. ఒక ఛాయలా నావెంట నువ్వున్నావనుకున్న భ్రమలో ఉన్నంతసేపూ, మల్లెపువ్వులా నవ్వుతూంటాను. నువ్వు లేవనే స్ఫురణకొచ్చింది మొదలు, వెతకడం మొదలెడతాను. ముద్దుగా నన్ను తాకే పున్నాగుపూల పరిమళం నువ్విక్కడే ఉన్నావనే మాయ చేసినంతసేపూ ప్రాణం హాయిగా అనిపిస్తుంది. అసలింత ఆదమరపులో నన్నుంచి నువ్వెటు వెళ్ళావో, అలసిపోయిన నన్ను చూసి చెప్పగలవా. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చిరుగాలికి కొబ్బరాకులు పాడుతున్న పాటలు వింటుంటే, నాలో గుబులు అధికమవుతుంది. నాకు నేను పరాయిగా మారి హృదయాన్ని కోల్పోతున్నానని తెలుస్తుంటే, ఈ నిర్లిప్తతనేం చెప్పను. సర్వప్రపంచమూ జటిలసమయలో ఉన్నప్పుడు సైతం, నేను మాత్రం విహంగంలా అద్యంతాల్లో నిన్నే అన్వేషిస్తున్నాను. పైకో మూగ శిల్పంగా అగుపించినా మనోవీధిలో తపోవనం సృష్టించుకున్నాను. అన్యులకు ప్రవేశం లేని నా ఊహలందుకే నోరెత్తవు. ఎదలో ఉప్పెన ఎగిసి వెలసిన ప్రతిసారీ సముద్రమవుతానని విసుక్కోకు. ఆటుపోట్లు సమసిపోయే దిశగానే అలనవుతున్నానని గ్రహించు. ఏమో నా గమ్యం, ఇంకెన్ని అనుభవాలకని సమాయత్తమవాలో, ఇంకెంత నిస్సహాయతను మోయాలో, ఇంకెన్ని యాంత్రిక స్థితులను దాటాలో. ఏదేమైనా కొన్ని క్షణాలు శాశ్వతం, మది ఆస్వాదించి సాధించుకున్న స్వార్జితం. ప్రేమాన్వీ, నా ఆర్తనాదాన్ని ప్రశ్నించకు. ఏకాంతంలోంచీ చీకటిలోకి పయనమవుతున్న నన్ను వారించకు. నా భావం, గీతం, ధ్యానం అన్నీ నీతోనే పూర్తవనీ. మరో పదమంటూ పుడితే అది నీకోసమే కావాలి.

No comments:

Post a Comment