Thursday, 24 September 2020
// అమృతవాహిని 17 //
తెల్లచీకటిలో జాబిల్లిలా నీ మోము పచ్చగా మెరవడం నిజమే అనిపించేలా..చందమామ చెక్కిలిగింత పెట్టినట్టు ఒక్కసారిగా నిద్రలో పొలమారి మెలకువొచ్చిందంటే, అదో గమ్మత్తయిన ఉదయం. గులాబీలగుత్తుల్లో మొహం దాచుకున్న పులకరింత..ఒక తీపిబాధను కలవరించిన మైకం అలా మొదలైనట్టుంది. వేకువజాములో ఇలా సిరివెన్నెల నవ్వులు, రెక్కల్లేని తూనీగలా నువ్వు గ్రోలినందుకే మరి. మూగగా పరిమళిస్తున్న ఓ ఆనందం నాకు మాత్రమే సొంతమని ఉడికిపోవు కదా. ఇంతకన్నా వింత ఊహలు నీకున్నవని నాకూ తెలుసులే.
అనురాగసరాగాలన్నీ ప్రకృతి అనుభవానికిచ్చే సంతోషాలని నీవల్లే తెలిసింది. అందుకే నా పెదవులు తడబడ్డ పాటలన్నీ శోకాలనుకోకు. కన్ను మూస్తేనే కమ్ముకుపోగల ఆహ్లాదం నువ్వుండగా నాకదో అవ్యక్తపు హేల. నీ అదృశ్యస్పర్శ నన్ను ఊగిసలాటకు గురిచేసే లేతగాలి సరసమంత. సుతిమెత్తని నిశ్శబ్దంలో కొన్ని తడిపొడి మాటలు, అంతర్వేదంలా వినిపిస్తుంటే, ఈ ఇష్టమైన అలికిడి నీది కాక మరెవ్వరిదీ. సప్తస్వరాలు సీతాకోకలై నాచుట్టూ పరిభ్రమిస్తున్న చైతన్యమిది. కన్నులకందని స్వప్నాల్లోనూ తోడుంటావనే మనోమురిపెం చెప్పాలనుంది. ఆరారగా ఇన్నేసి కబుర్లు నివేదించి నన్ను వెచ్చబెడుతుంటావు. ఏకాంతానికి కన్నుకుట్టేన్ని ఊసులు నీకెక్కడివోనని ఆలకిస్తూ ముచ్చటపడుతున్నా..
ఏమో ఈ కొత్తరకం వేదన. నీకు తెలీకుండానే ప్రేమను పంచుతున్నావని .. నా మనసు వెతుక్కుంటూ చొరబడింది కాక దాగుడుమూతలాడుతున్న సంగతి ఒప్పుకోవు కదా. నీ సాన్నిహిత్యపు విలువ తెలుస్తున్నకొద్దీ ఇంకా మాయ కావాలనిపిస్తుంది. వలపు వేడుక తెచ్చే ఉల్లాసం, లాలించబడ్డ విషాదానికి మాత్రమే తెలుసనుకుంటే, కారుమేఘమెత్తినా నీ సందేశమని మురిసిపోయే నాకు ఎప్పటికీ ఈ ముత్యాలవాన కురుస్తూనే ఉండాలి..💜💕
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment