Tuesday, 13 October 2020

// అమృతవాహిని 19 //

ప్రియతమా.. తోడూ అనే ప్రశ్న ఉత్పన్నమవుతూనే నీడలా ఉన్న ఆనందం ఎటో మాయమవుతుంది. కనిపిస్తున్న ఆకాశంలో సౌందర్యం..నీ నీలి దస్తూరి కోసమే తొంగి చూస్తున్నట్లు ఉంటుంది. రాత్రవుతూనే తపస్సమాధిలో చేరి గుచ్చుకుంటున్న జ్ఞాపకాల దండలోంచీ పరిమళాలు గెంతులేస్తుంటాయి. దారితప్పి కలలోకి జారిపోయాననుకొనేలోపు మెలకువొచ్చి అడుగులో అడుగేస్తూ కాలమలుపులో ఆగిపోతాను. ఒక ఒంటరి ఒత్తిడి రెండుపొద్దుల్ని మోసి అలసిపోయినట్టు నిర్వికారాన్ని చూస్తాను. అయినా కదిలిపోతున్న కాలం కలిసొచ్చేదెప్పుడోలే అనిపిస్తుంది. ప్రస్తుతం కదులుతున్న సమయావేశ.. పరవశపు సుధలు చాలేమో కదూ. రోజూ సూర్యోదయం ఒకేలా ఉందని నిట్టూర్చితే వేకువకు విలువేముంది. మనసుకందే సౌందర్యానికి చలించక కళ్ళు మూసుకుంటే చీకటే కదా మిగిలేది. ఏమో..ఈ నిర్లిప్తత..ఆరోజు బాలూ గారు పరమపదించక మునుపు మొదలెట్టా మీకేదో చెప్పాలని. ఈరోజు రాజన్ గారు మనల్ని వదిలిపోయేవరకూ మరేం రాయలేదు. అందరికీ మరణం అనివార్యమే. కనీసం కలలోనైనా కలవనివారితో అనుబంధం సాధ్యమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇలాంటప్పుడే . అవును, వారు చక్కని సంగీతసాహిత్య రసఝరులలో మనల్ని ఓలలాడించారు. విషాదంలో, ఆనందంలో..ఆఖరికి విస్మయంలో, మైనరపులోనూ మనతో ఉన్నారు. మనల్ని సంతోషపరచడమే లక్ష్యంగా బ్రతికి జీవితానికున్న అర్ధాన్ని పూరించారు. తెలుసు, నీకూ వారంటే మక్కువని.. అందుకే ఇంత స్తబ్దంగా మారిపోయారని. వారిపట్ల మన ప్రేమను ఇంతకన్నా చూపేదేముందిలే. అయితే ప్రతి విషయాన్నీ మరో విధంగా చిత్రించాలనే కుతూహలం పెరిగినవారు మాత్రం ఎడతెగని విపరీతపు ధోరణి కనపరచి అదనపు భారాన్ని మోపారు. వారి సంస్కారాన్ని అందుకే అక్కడే విడిచేసాను. ఋతువులు నిరంతరంగా మారిపోతున్నా తిరిగిరాని నిన్ననే తలపోస్తుంటే.. అనాలోచితంగా వదిలేదిన క్షణాల అస్తిమితం వాస్తవాన్ని నిశ్శబ్దానికి నెడుతుంది. మోహించిన వాక్యాలన్నీ మసకైపోయాక పదాలన్నీ ఎదను ఖాళీ చేసేస్తాయేమో.. ఇక మౌనాన్ని తప్ప దేన్నీ నువ్వు ప్రేమించలేవనిపిస్తుంది. అందుకే..క్రమంగా ప్రపంచం మీద ఇష్టం కోల్పోయిన నేను ఆత్మసంబంధాన్ని కొనసాగిస్తున్నాను..😒

No comments:

Post a Comment