Friday, 30 October 2020

// అమృతవాహిని 20 //

ఓ జాబిలీ.. ఎక్కడ మొదలెట్టాలో తెలీకున్నా, ఒకచోట మొదలవ్వాలి కదా. ఎప్పుడూ చలువద్దాలు మాటుండే నీ కళ్ళు తొలిసారి కలలో చూసానంటే నవ్వుతావు, అదీ మరెటో చూస్తూ. చూపులతో సేద తీర్చగలవని తెలిసిన క్షణాల భావోద్వేగం మాటలకు అందనిది. ఇంతకాలం రెప్పలమాటు దోబూచులాడిన కనుపాపలు, ఇంత ఆర్ద్రతను నాకోసమే దాచిపెట్టినట్టు దొరికిన ఓదార్పు.. నీతో చూపులు కలిసినప్పుడే తెలిసింది. పెదవిప్పకుండా పలకరించే ప్రజ్ఞ కలిగి.. ప్రశాంత సమయంలో వెలిగే వెన్నెల్లో మెరుపులు అంటే నమ్మవేమో గానీ, నాతో కవన ముత్యాలు కూర్చేలా చేసిన చిలిపి చిరునామాలవేగా. అడగని ముద్దులా, ఆత్మను సజీవం చేసే నీ కళ్ళు నాకైతే విశ్వకాంతి పుంజాలు. నీ క్రీగంటి పలకరింపుకి, మనోగతం మగత కమ్ముకునే వేళ విరహం ఎన్ని గుసగుసలు విత్తిందో, ప్రాణశక్తి నీలోకి పొదామని తొందర చేస్తుంది. తూగుతున్న తన్మయత్వపు చిరునామా నీ ఒడి కాక ఇంకేముంది నాకు. నువ్వలా తల నిమురుతున్నంత సేపూ .. ఆరుబయట చుక్కల్లో ప్రత్యేకంగా మెరిసే స్పటికాల్లా నగ్నంగా నవ్వుతూ ఉండే ఆ రెండు నక్షత్రాలు గమ్యం లేకుండా మనసు దారి తప్పించేస్తుంటాయి. హృదయంలో స్వరాలన్నీ వెల్లువలై అలల చప్పుడు మాదిరి కేళీ విలాసానికి రమ్మన్నట్టు ఉండుండీ ఉలిక్కిపడేలా చేస్తుంటాయి. ఆ నిండుసందడి స్వానుభవం కావాల్సిందే అని నీకూ తెలుసుగా, ఇన్నేసి ఊహలు అల్లుకొనేంత అనుబంధం ఏముందా అనే ఆలోచన నాకొస్తుంది ఒక్కోసారి. నువ్వే చెప్పాలి..నీ దీర్ఘకవితలోని వాక్యమని అనుకున్నావో..గడ్డిపువ్వు గుంపులో గులాబీనని కనిపెట్టావో, పావురాళ్ళలో కలిసిపోయిన కోయిలననుకున్నావో.. మౌనంలో నిన్ను స్పృశించిన ఆత్మబంధువునో..ఎప్పటికీ పాతబడని జ్ఞాపకంలా నీకేమవుతానో మరి. Do u really think that m craving for my twin heart ?! ఏమో..దేహానికతీతంగా ఏ పూల మీదనో నడుస్తూ ఉన్నట్టుంటుంది నిన్ను తలచి పరవశించినప్పుడంతా. అయినా...ఒకరిలో ఒకరం విశ్రమించని ఆకాశంలా విస్తరించాక, ఇన్ని భావసుమాల మాలలు మెడలోనే వేయించుకొని.. దగ్గర దూరపు కొలతలకు అందని అపురూపం నేనని తెలుసుకున్నాక.. ఇంకా ప్రశ్నలు అడిగి నిన్నేం తక్కువ చేయనూ. గతమూ, భవిష్యత్తూ అవసరంలేని వాస్తవాన్నిలానే ఆత్మీయంగా కొనసాగిద్దాం..💜💕

No comments:

Post a Comment