Friday, 30 October 2020

// అమృతవాహిని 21 //

ఓయ్..నిన్నేనోయ్..ఏం చేస్తున్నావ్ నువ్వు తాకితేగానీ నేనో మెత్తని శిల్పన్నని గుర్తు రాలేదు. నీ ఊహలో నాకు ప్రాణం పోసి నాకో జన్మనిచ్చావు. ఇప్పుడు నేనో అపరంజి అద్భుతాన్ని కదా..క్షణాలకు సైతం విలువుంటుందని తెలీని నేను ఎన్ని జన్మలు వృధాగా గడిపేసానో తలుచుకుంటుంటే ఎక్కడో బాధవుతుంది. నాలో పరవశాన్ని వెలికి తీసిందెవరంటే నువ్వనే చెప్తాగా. మనసుపొరల మధురానుభూతులు తోడి.. పువ్వులే పూయవనుకున్న చోట వనాన్ని పెంచిన వనమాలీ..వెన్నెల్లో మనసుకంటిన ఈ పూలపుప్పొడి రేయిని ఆపేస్తుందో ఏమో..మునుపులేని సువాసన నా శ్వాసలో ఊగిసలాడి నీ పెదవిని పంచుకోమంటుంది. మునివేళ్ళతో మెత్తగా అల్లుకుంటూ నీలోకి పొదుపుకొనే క్షణాలు ఆగిపోతే చాలనిపిస్తుంది. నిరంతరమూ నీ కౌగిలి మధుమాసంలో పరిమళిస్తూనే నేనుండాలనిపిస్తుంది. అలసిపోయాననుకున్నప్పుడల్లా చేరదీసే నీకే తెలియాలి నన్నో మత్తులో ముంచి ప్రేమించుకుందాం రమ్మని పిలిచే అల్లరి.. రాగరంజితమైన ముద్దుల్లోని వెచ్చని అనుభవాలు నవ్వులుగా పోగేసినప్పుడు తేనెలూరు మృదుభావాన్ని ఓ పదముగా రాయాలనుంది. ఒక తాజా వసంతం మదిలోని ఊహను నిజం చేసిన వైనం నువ్వాలకించావంటే అంతర్లోకంలో సంగీతమై వినబడుతుంది. అక్కడ వెన్నెల మెత్తగా జారుతున్న సవ్వడి నువ్వందించే మధువుకి సమానమవుతూంటుంది. గత పున్నమి కురిసిన తుంపర ఇంకా తడిగానే నన్నుంచుతుంది.. ఈలోగా అదేమో హఠాత్తుగా ఈ వాన. మల్లెలవానేం కాదు, ఋతుపవనాలు గతితప్పి కురుస్తున్న వాన. ఏం చెప్పను, వానంటే మనిద్దరికీ ఇష్టమే కదా.. చిన్నప్పుడు వానంతా ఒక మృదుజ్ఞాపకం కదా. అప్పటికప్పుడు ఎక్కడివారక్కడ తడవకూడదని చూర్లు వెతుక్కొని నిలబడితే, సైకిల్ మీద అలా అలా మనమిద్దరరమే.. అందరూ చూస్తూండగా కదిలిపోతుంటే, ఓహో..ఇప్పటి స్లోమోషన్లో తీస్తున్న సినిమాలు మనల్ని చూసే తీసుంటారనిపిస్తుంది. ఎటు చూసినా ఆహ్లాదం తప్ప జీవితమన్నాక ఒడిదుడుకులుంటాయని తెలిసేదే కాదు. వర్షంలో ఆటలైతే చెప్పనే అక్కర్లేదు. ఆ ముసురు గుర్తుకొస్తూనే మదిలో అవ్యక్త రాగమవుతుంది. కానీ అకాలంలో కురిస్తే ఆనందం కన్నా విషాదం ఎక్కువవుతుంది. క్షణక్షణం సుడిగుండాల్లో పడిపోతున్నట్టు తుఫాను భీభత్సం. ఎడతెరిపి లేకుండా నాలుగురోజులు జోరువానంటే, పాపం ఎన్నిరకాల కష్టాలు కదా. పాలకులూ ప్రజలూ ఒకరినొకరు నిందించుకోడం తప్ప ఆ ఉధృతి తగ్గేదాకా వేరే ఉపాయమే ఉండదు. అసలే రోజులు బాగాలేవు. అయినా ఎవరికీ పట్టింపు లేదు. అలా సాగిపోతుందది అంతే. ఇంకా చెప్పు..ఇప్పటికీ వల్లప్ప పాటలన్నీ నేనే పాడినట్టు అంతర్వీక్షణ చేసేసి ఉంటావుగా. మెత్తని ఊహానందాన్ని ఇద్దామని వెన్నెలతో మొదలుపెడితే అనుకోని వానొచ్చి కలిసింది మరి. ఇప్పుడీ మలిసంధ్య చిరువెలుగులో నీ ధ్యాసలో మూగకోయిలనై కాదనలేక కాలాన్ని అనుసరిస్తున్నా. నువ్వాశించినంత దగ్గర లేనని విచారించకు. కన్నుల్లో నువ్వుంచుకున్నంత సేపూ కలనైతే, కనుకొసల విడిచావంటే మాత్రం జారిపోతా. మనం కలిసేంతవరకూ ఎంత తొంగిచూసినా, మల్లెలను సైతం తురుముకోను..సరేనా 🥰💜

No comments:

Post a Comment