Saturday, 31 October 2020

// నీ కోసం 207 //

ఎప్పుడూ ఏం చూస్తుంటాయో కూడా తెలియని నీ కళ్ళు నన్ను నిద్రలోంచీ మేల్కొలుపుతాయి. ఎన్నో పాటలు పాడే నేను, ఒక్కసారిగా మూగబోతాను. నన్ను పలకరించేందుకు వచ్చావేమో అనుకొని ఊపిరినాపుకొని ఉక్కిరవుతాను..అప్పటికో లేతవనాల పసరు వాసన పరివ్యాప్తమై శ్వాసలోకొచ్చి చేరుతుంది. ఉదయమంతా హృదయాన్ని దాచుకొని రాత్రయితే రెప్పల వెంటపడతావు. చీకటిలో మెరిసే చంద్రవంకలా ఏవో కథలు చెప్తుంటావు. నీ అరచేతుల్లో దాచుకున్న వెచ్చదనమంతా నా చెంపలకు పూసి సన్నగా నవ్వుతావు. కాలాన్ని మాయచేసి ముద్దపసుపు పొద్దులు కల్పించి.. రెల్లుపూల గమ్మతు మల్లే ఆరాధనగా నిమురుతావు. ఆత్మ సంబరాలేవో మొదలైన సూచనగా వెన్నులో మెత్తని పులకరింపు కదిలి..దారితప్పినట్టు తనువంతా ప్రణయమవుతుంది. రాదంటూనే కవిత్వమేదో చెప్తూ తమకపు తీయందనాల రుచి పెంచుతావు. వెన్నెలరాత్రి దప్పికనంతా ఒక్క గుక్కకే తీర్చేసే వర్షమవుతావు. ప్రేమాన్వీ..నిజం చెప్పు.. మనసంతా ఊదారంగు మరకలు చల్లేది నువ్వే కదూ 🤗💜

No comments:

Post a Comment