Saturday, 31 October 2020
// నీ కోసం 211 //
విరిసిన ఊహల రెక్కల సాయం
వలపు అంటుకట్టుకున్న గగన కుసుమాలతో
పురివిప్పిన కోరిక కొత్తచిగురు లేతపచ్చ
అరమూసిన కన్నులమాటు ముసురులో
హాయి స్వరాల లయల హొయలు
మాటలకందని పరవశాల రచ్చ
అమృతంతో నిండిన ఆత్మల
ముప్పొద్దుల ముద్దులొలుకు ముచ్చట్లలో
మధురాతి మధురపు మనస్సాక్ష్యం మెచ్చ
మలిసందె మోహపు సాంబ్రాణి ధూపం
రాతిరిని కలవరపెట్టేందుకు మొదలయ్యే
సుదీర్ఘ అనుభూతుల రససిద్ధి వెచ్చ 💕💜
// నీ కోసం 210 //
ఒకటో రెండో పక్షులు మేలుకొనే సమయమే ఇంకా
అయినా మెలకువొచ్చేస్తుంది ఎందుకో రోజూ
ఆనందమో విషాదమో తేల్చుకొనేలోపే
జలజలమంటూ కళ్ళు ఒలుకుతుంటాయి
గుండె వాకిట్లోనే సముద్రమున్నట్టు
సున్నితమైన అలల్లాంటి ఓ నవ్వు
చెక్కిలి తడి తుడుస్తూ నీ చెయ్యీ
ఎలా వస్తావలా ఓదార్పు తెమ్మెరలా
రాత్రయితే చీకటిలో చుక్కలా
గాలొస్తే విరజాజుల తావిలా
తలవగానే అవ్యక్త కవనంలా
ఎప్పుడూ నా మనసు కొమ్మకే ఊగుతుంటావా
ప్రేమాన్వీ..
కాగితపుపడవ జ్ఞాపకంలాంటి నువ్వు
ఇప్పుడిప్పుడు మరీ మువ్వలా మారిపోయావు
కల కాని ఈ అలౌకిక వెలితి
ఈ జన్మకి అంతమవుతుందంటావా..!?😒💕
// నీ కోసం 209 //
కనుచూపు మేరంతా చీకటైనా
రెప్పలు మాత్రం మూతబడవు
నిశ్శబ్దపు తెరల మాటు.. రాగాలలో
అంతరాత్మ వదులుకోలేని మురిపాలివి
ఎంతకీ ఆవిరవని నిర్విరామ సౌరభంతో
కలో నిజమో తెలీని కదలికల్లో కాలప్రవాహమిది
అవధుల్లేని అలజడిలో
నేపధ్యం నీ మౌనస్వరమే అయినా
నేనాలకిస్తున్న గుసగుసలు నువ్వంటున్నవేనేమో
అనుభూతులు దశలవారీగా వెంటబడుతున్న
ఈ కవ్వింతల మేళవింపుకి
సహగమిస్తున్నా నీతో ఊహలపల్లకీలో..
గుండెల్లో ప్రతిధ్వనిస్తున్న ఆనందపు చప్పట్లకేమో..
గుప్పిళ్ళు తెరిచే దాచేసుకున్నానీ పరిమళపు ఆనవాళ్ళని 💕💜
// నీ కోసం 208 //
కాలం కలవరించినప్పుడు
దిక్కులు దాటి నువ్వొస్తావని నమ్ముతున్నాను
జీవితం శబ్దించనప్పుడు
నీకేమవుతానో ఆలోచించేందుకు
నాకు నేనుగా విశ్రాంతినొందుతాను
ఖాళీ అయిన గుండెలోకి చేస్తున్న ఒంటరిపయనంలో
తోడొకరుంటారని నువ్వనుసరించినప్ప్పుడే కనుగొన్నాను
మనసు దప్పిక తీర్చేందుకు
చీకటిని నీడచేసి..మెత్తగా ఎదలోకి
సర్దుకుంటావనే చేయి చాచాను
ఆత్మానుగతమైన ప్రేమొక్కటే శాశ్వతమని
క్షణానికొకలా సాగే ఊపిరి విన్యాసాన్ని
గాలి పీల్చినప్పుడంతా గమనించాను
నిన్నాలపించని రాత్రిని
ప్రేమించవెందుకంటే ఏం చెప్పను
కొన్ని పాటలు దూరాన్ని దగ్గర చేసే
మంత్రాలవుతాయని నీకూ తెలిసినప్పుడు 💜💕
// నీ కోసం 207 //
ఎప్పుడూ ఏం చూస్తుంటాయో కూడా తెలియని నీ కళ్ళు నన్ను నిద్రలోంచీ మేల్కొలుపుతాయి. ఎన్నో పాటలు పాడే నేను, ఒక్కసారిగా మూగబోతాను. నన్ను పలకరించేందుకు వచ్చావేమో అనుకొని ఊపిరినాపుకొని ఉక్కిరవుతాను..అప్పటికో లేతవనాల పసరు వాసన పరివ్యాప్తమై శ్వాసలోకొచ్చి చేరుతుంది.
ఉదయమంతా హృదయాన్ని దాచుకొని రాత్రయితే రెప్పల వెంటపడతావు. చీకటిలో మెరిసే చంద్రవంకలా ఏవో కథలు చెప్తుంటావు. నీ అరచేతుల్లో దాచుకున్న వెచ్చదనమంతా నా చెంపలకు పూసి సన్నగా నవ్వుతావు. కాలాన్ని మాయచేసి ముద్దపసుపు పొద్దులు కల్పించి.. రెల్లుపూల గమ్మతు మల్లే ఆరాధనగా నిమురుతావు.
ఆత్మ సంబరాలేవో మొదలైన సూచనగా వెన్నులో మెత్తని పులకరింపు కదిలి..దారితప్పినట్టు తనువంతా ప్రణయమవుతుంది. రాదంటూనే కవిత్వమేదో చెప్తూ తమకపు తీయందనాల రుచి పెంచుతావు. వెన్నెలరాత్రి దప్పికనంతా ఒక్క గుక్కకే తీర్చేసే వర్షమవుతావు.
ప్రేమాన్వీ..నిజం చెప్పు..
మనసంతా ఊదారంగు మరకలు చల్లేది నువ్వే కదూ 🤗💜
// నీ కోసం 206 //
నీ కోసం రాయాలనుకున్న ప్రతిసారీ విషాదం
తరుముకొస్తుంది..😣
...అయినా సరే..అదే రాస్తాను
ఒక్కో రాత్రి..
మౌనమూ, మనసూ గొడవ పడుతుంటాయి
ఏదైనా పాడాలనుకున్నా పెగలని గొంతు
నిశ్శబ్దాన్ని మోహిస్తున్నట్టు నటిస్తుంది
ఏదైనా రాసేందుకు కలం పట్టగానే
పలుకే బంగారమైనట్టు అనిపిస్తావు
అవును..
గాలితో..నువ్వేం చెప్పి ఉంటావానని
అదేపనిగా ఊహిస్తాను
నన్ను ప్రేమించానని
నమ్మించలేక ఓడిపోతావని గ్రహిస్తాను
నన్ను నేను ప్రేమించుకుంటానన్న మాట
ఉత్తి డాంబికమన్నట్టే విసుగుతావు
ఊపిరాడనివ్వని పువ్వులా పరిమళిస్తున్నానంటావ్
ఆకాశంలో చందమామ నవ్వులో నన్నే చూసానంటావ్
నిద్రపట్టనప్పుడంతా బెంగపడ్డానంటావ్
అయినా సరే..నన్ను చూడాలని ఉందని చెప్పవ్
కలలో..కలతలో
కల్పనలో..కావ్యంలో
నువ్వే తోడని తెలిసి మురిసిపోతావ్
నిజమే..
కాలానికి గాలం వేసి
నీ జతలో మనోవీధులన్నీ తిరిగేస్తూ
సంతోషంతో పులకిస్తాను
అంతరంగమంతా సందడి చేసే నీ చిలిపి అల్లరి
కొలతకందని అమూల్యం నాకు
వెన్నెల్లో, వానల్లో నిన్నే తపించాను
ఎండల్లో, ఎముకలు కొరికే చలిలో నిన్నే కోరాను
చిగురులేస్తూ పైకిలేచే లేతపచ్చని పైరులానూ
పులకరించాను
మధురానుభూతుల అనురాగ రసం తాగితాగి
మత్తెక్కినప్పుడంతా నిన్నే నెమరేస్తాను
వాస్తవమో..వ్యామోహమో
వలపు సాంబ్రాణి ధూపం నీతో కలిసి ఆఘ్రాణించాను
వసంత, శిశిరాల్లో నిన్నే హత్తుకున్నాను
జీవితం లుప్తమయ్యేవరకూ నిన్నే ఆరాధిస్తాను
నీ రాధనవుతాను..💜💕
// నీ కోసం 205 //
మనసు చెదిరిన చిత్రకారుని కుంచె
ఏది గీసినా చిత్రానికి ఆకృతి వచ్చినట్టు
పున్నమి అవుతుందంటేనే మనసు
అపురూపాన్ని కౌగిలించడం మొదలెడుతుంది
వాలుపొద్దు విశ్రాంతికి వేళవగానే
హృదయపేటికను తెరిచేందుకు
కాలాన్ని తొందరపెడుతూ
నల్లమబ్బుల్ని జాబిలికి చోటిమ్మంటుంది
అవధుల్లేని ఆలోచనల భావరాహిత్యం
విలువైన వజ్రపుతునకై
కావల్సిన స్వరమొక్కటీ ప్రతిధ్వనిస్తుంది
అవును
చిదిమిన నిశ్శబ్దంలోంచీ వెలువడే
కొన్ని క్షణాల మధురసంభాషణలు
మరో మాసం వరకూ పదిలమవుతాయి 💜
// నీ కోసం 204 //
నోటితో మాట్లాడకున్నా
మనసుతో మాట్లాడుకున్న
సంభాషణకో అనుబంధం
ఉండే ఉంటుంది
కాలాలలా కదులుతున్నా
కరగని స్వాభిమానం
స్నేహానికుంటుంది
ప్రేమించడానికి కారణమేం కావాలని
అంతరంగం ప్రశ్నించినప్పుడు
కలువలు వికసించని వెన్నెల రాత్రిని చూపమంటాను
పాట కాలేని పదాల వివరం చెప్పమంటాను
ఇంకా వీలైతే
అలలు లేని సముద్రాన్ని చూపమని అడుగుతాను ❤️
// నీ కోసం 203 //
గాలి గంధాలు పూస్తున్నా
గోలచేస్తుందని గోస పెడతావు
పెదవులపై నిలిచిన ముద్దులు
మరకలేనని తుడిచేసావు
నిజం కాని మధురస్వప్నం
ఊహనే కదాని
కాలాన్ని కరగనిచ్చావు
ఆకుపచ్చని సంతకం
అడవికి మాత్రమే సొంతమని
ఎడారికి నన్నిచ్చేసావు
వెలుగు పంచని తారను నేనని
చీకటికే విడిచిపెట్టావు 😔
// నీ కోసం 202 //
నిర్నిద్రతో కరుగుతున్న రేయి
కోరుకున్న కలను మరచి
ఊహల సముద్రయానం మొదలుపెట్టింది
ఆవలితీరంలో ఉంటావనుకున్న నిన్ను
ఆదమరుపులో అక్కున చేర్చినట్టుంది
ఏకాంతం తోడవ్వగానే
నిశ్శబ్దం దుప్పటి తీసింది..
కురిసేందుకు చోటే ఇవ్వవుగా కన్నీటికి
రెప్పల నిండుగా నువ్వే ఆక్రమిస్తూ..💜
// నీ కోసం 201 //
వానకారు కోయిల ప్రమోదపుగీతం
శ్రావణ మాసాంతరపు సుధావృష్టి సంకేతం
నడిరేయి చినుకుసవ్వడి సంగీతం
నవరాగపు సమ్మోహన మధుపగానం
రంగు రంగు కలల్లో విహరిస్తున్న మనోరథం
పాలసంద్రమై పొంగుతున్న అంతరంగం
చల్లారని కౌగిలిలో నులివెచ్చదనం
మల్లెపందిరి చాటు మోహనరాగం
యుగాలుగా తపిస్తున్న పూల కలవరం
అయ్యేదెన్నడో బృందావనం
ఏకాంతం పల్లవించు మౌనవిషాదం
నిట్టూర్పులు పరిమళిస్తున్న నీరాజనం 💜💕
Friday, 30 October 2020
// నీ కోసం 200 //
నీ కన్నుల్లో ఆదమరచిన స్వప్నం
నీ నవ్వుల్లో విప్పపూల మైకం
నీ ఊహంటేనే వివశించిపోయే దేహం
అందుకే..
నీ నిరీక్షణలో క్షణమో యుగమైనా
నా హృదయంలో నువ్వుంటే చాలనుకున్నా
నన్ను తడిపేందుకు నువ్వు మేఘమవ్వడం
నీ కదలికల్లో నేనీదులాడటం
నా మనసంతా నువ్వే భావమై
నీ ఊహాలోకానికి నేనో కాంతినై
రోజుకో కొత్త ఆరంభం
ఓయ్ వసంతుడా..
ఓసారలా నిజమవ్వవా
చిగురులు తొడుగుతున్న తీగలన్నీ ఒణికేలా
మొగ్గలు పువ్వులై విరిసేలా
ప్రకృతికి కొత్త పండుగను పరిచయం చేస్తాను
పరిమళిస్తున్న తడి గంధం మన ప్రేమేనని చెప్తాను 💜💕
// నీ కోసం 199 //
నీలోకి నువ్వు నడుస్తూ
నన్నూ చేయిపట్టి తీసుకుపోవడం తెలుస్తుందా
వేకువైతే కొమ్మకో కోయిల
నువ్వు పిలిచినట్టే..పాడుతుంది
Hmm.. మదిని తడుముకుంటే
నీ చిరునవ్వులే..ప్రతిధ్వనిస్తున్నది
ఊపిరి పోసుకున్న రాగాల వెల్లువ
శ్రావణ మాసపు తరంగమై
నిన్నూ నన్నూ కలుపుతూ
సమాంతర దారిలో సాగుతుంది
నిన్నటి కలలో కురిసిన మధువేమో
సాయింత్రానికి వరదై పొంగిపొర్లుతుంది..
Hshh...చెప్పొద్దులే ఎవరికీ..
ఈ వాన...
నింగి అంచుల మీదుగా నేలను తాకుతూ
నీలా చుంబించేందుకు ప్రయత్నిస్తుందని 😉💜
// నీ కోసం 198 //
నిశిరాత్రి వెన్నెలదీపం వెలుగుతుందని
ఎదురుచూస్తున్న నన్ను వర్షమొచ్చి వెక్కిరించింది
ఈ రాత్రైనా నిద్రపడుతుందనుకున్న ఆశలపై
నిర్దయగా నీళ్ళు చల్లింది
నెలరాజు రాడని ముడుచుకున్న కోనేట్లో కలువలు
నా విషాదాన్ని చూసి తోడు దొరికానని ఉపశమనం పొందాయి
పసిపాప మోమొక్కటే
లాలింపు దొరికిన సంతృప్తిన మెరుస్తుంది
నువ్వేమో..
శూన్యంలో తేలేందుకని..మౌనాన్ని పెనవేసుకొని
ఏకాంతపు ఉద్యానవనమంతా తిరిగి
కొత్త ఊపిరి తొడుక్కుని మురిసిపోతుంటావు
నేనేమో
ప్రేమించమంటూ తొంగిచూసే నీ తలపుని
మురిపెంగా మెడ చుట్టూ ఒత్తుకుంటాను
మెత్తని నవ్వుని నెమరేస్తున్న దృశ్యం కనువిందయ్యాక
అదేమో..
వనమాలివై నువ్వు పంపిన ఆర్తి సందేశాన్నూహించి పులకించేస్తాను 💜💕
// నీ కోసం 197 //
మనసు తోటలో నే చేసిన స్వరార్చనకి నువ్వు తాళమేయలేదూ
నీ పొడారిన గొంతులో తడి సుగంధం నేను కాలేదూ
దీపాలు నీటిలో తొంగిచూసే వేళ..
నవ్వుతున్న నీ అరకన్నుల్లో
మమేకమై.. సగమైపోలేదూ
అయినా ప్రతీక్షణలో క్షణక్షణం జ్వలిస్తూ
తొలిపరిచయంలా అనిపిస్తావెందుకు..
ఒంటరితనం ఒక్క దేహానిది కాదని
నీ రెప్పల క్రీనీడలో రూపం నాదైనప్పుడు..
నువ్వూ నేనూ ప్రేమా వేరుకాదని నీకెవ్వరు చెప్పాలిప్పుడు..💜💕
// నీ కోసం 196 //
జాజిపువ్వుల గాలికి తోడు
వెన్నెల వీస్తూ చేస్తున్న కనికట్టు
ఆనందానికి సోపానం
May b d vibration of Love
పరిమళ కెరటాలు ముంచెత్తుతున్న రాతిరి
నా తలపెప్పుడూ దూరతీరాలవైపే కనుక
మనసు రెక్కలకి కిటికీ
అడ్డు కాలేకపోయాక
నీ పెదవులపై ప్రేమగీతినవ్వాలని
చీకటి మలుపులను దాటుకొస్తున్నా
ఈ క్షణాల కోసమే ఎదురుచూస్తున్నట్లు
ఇప్పటిదాకా ఎక్కడున్నాయో..
ఇన్ని నక్షత్రాలు మంత్రమేసినట్టు
విరిసిన కమలాలై వెలుగుతున్నాయి
నువ్వన్న మాటలే మూటకట్టుకొస్తున్నా
నా గుండెల్లో గమకంతో కలిపి
నీ కలలో కిలకిలనై కౌగిలించాలని 😊💜
// నీ కోసం 195 //
మగతని వరిస్తూ
కమనీయాన్ని రచిస్తూ
ప్రేమాంతరంగమంటే నీదే
అనుభూతులను పెనవేసుకొనే కాలాతీత కలలుంటాయి
విషాదాన్ని విరిచేందుకు తలచే ప్రతి వాంఛలో
ఆనందపు పన్నీరు కురిసేందుకు సిద్ధంగా ఉంటుంది
గుర్తులేని గతజన్మని ఆరాతీసే బదులు
నిదురించిన మధురిమని కదిపి చూడొకసారి
శ్రావణపౌర్ణిమ పగలు వగలై కురిసే వర్షం
రేయంతా వెన్నెల మరకలను స్రవిస్తుంది నిజం
ప్రేమాన్వీ
గుప్పిళ్ళు తెరిచే ఉంచు
నిదురంటని రాత్రి నీలో విశ్వాన్ని గుర్తించు
తీయదనం మరుగుతున్న సవ్వడైతే
నా అడుగుల మువ్వల్ని అనుసరించు
నీ పరితపన అంతమయ్యేలా
మరుని వలపు మంత్రాక్షరిని విరచించు 💕💜
// నీ కోసం 194 //
కాలం కలిసొచ్చి
కన్నీటికర్ధం తెలిసొచ్చినప్పుడు
సంఘర్షణలోని ఆంతర్యం తెలుస్తుంది
అంతర్లోకంలోనూ ఒంటరై
జీవితం సాయం చేయనప్పుడు
వెలిసిపోయిన వెలుతురు విశ్వరూపం కనిపిస్తుంది
ఇవ్వగలిగే అవకాశమున్నా
అందుకొనే మొహమాటం
తీపిచేదుల వ్యత్యాసమంత హద్దులు పెడుతుంది
గుండెతడి తెలిసిన వ్యక్తిత్వంలో
ఆత్మను అలరించగల అతిశయమూ తప్పుకాదులే
వీడ్కోలు చెప్పుకున్న చివరి రాత్రి
పెదవులపై విరిసే నవ్వులో
నీ పేరున్నప్పుడు మనం విడిపోయిందెప్పుడని
నేనూ నువ్వూ కలిసి మనమైనప్పుడు
ఒకరికొకరం వేరుకామని లోకానికి చెప్పాల్సిన పనేముందని
నీ ఎదురుచూపుల దైన్యమొక్కటీ
పోల్చుకొనేందుకు సరిపోతుందిలే..😊
// నీ కోసం 193 //
మౌనమో ఏకాగ్రత..అదో ధ్యానస్థితి
లిపిలేని నిరంతర భాషణ
ఆత్మవిచారపు తపస్సు
అదో విశ్వభాష
అఖండ ధార్మిక దివ్య ప్రక్షాళన
అతీతమైన మౌనం జ్ఞానానుగ్రహం..
సనాతన ఏకాగ్రత, విషయ శూన్యావస్థ
మహార్ణవమగు మౌనం
మానసిక నియంత్రణ..ఇంద్రియ వైరాగ్యం..
తద్వారా ఆత్మసాక్షాత్కారము
అందుక మౌనమో విశిష్ట తత్వం
అనివార్య మౌనం అత్యుత్తమమూ, అర్ధవంతమూ..
అయితే
అభిమానాన్ని కించపరిచే మౌనం మాత్రం మృత్యుసమానం 😣
// నీ కోసం 192 //
ప్రకృతి సమాహారంలో చిరుగాలి సవ్వడించినట్టు
నిదుర మరచిన రాత్రి గుండెల్లో
నీ రూపు నాకు విరామ దీపారాధనమైంది
అనుభూతుల ఆస్వాదనం నేర్చి
కలలో మత్తుగా జోగుతున్న విరజాజులు
కొత్తగా ఏ ఊహలమాలను అల్లుకున్నాయో
కుంకుమ కలిసి రాగరంజితమైనట్టు
నా మనసాంబరపు ఎరుపు
బుగ్గల్లో ఒదిగిన పన్నీటి పువ్వయ్యింది
నీ చూపు నన్ను స్పర్శించిన క్షణాల్లో
మొదలైన తీపి మైమరపు
నా పెదవుల నవ్వుని అదిమిపెట్టిందంటే ఏమంటావో
చేరువకాలేని దూరాలు చెరిపిన
చీకటి చిలిపిదనమేంటో
నిశ్శబ్దం మృదువుగా మోగిన మువ్వయ్యింది
ఈరేయి అమాసని కాదని పున్నమి విరిసింది 😊💜
// నీ కోసం 191 //
ఎంతకీ తెగని ఓ తీపి పెనుగులాట ఎదలో
వివరం చెప్పకుండా వీచే గాలితో కలిసి
కోయిల కుహూమని పిలుస్తుంది నన్నేనా..
వసంతమంటే నాకిష్టమని తెలుసనుకుంటా
వర్షంలోనూ నాకోసమొచ్చి పాడుతుంది
నువ్వనే ముద్దు మాటలన్నీ ముందుగానే చేర్చేస్తుంది
విరహంలో తడిచి బరువెక్కిన
నీ దేహపు మోహగీతాన్ని
లయగా వినిపిస్తూ నన్ను శృతి చేస్తుంది
ప్రేమాన్వీ
నీ కనుచూపు చిరునవ్వులు సైతం
మెత్తగా సవ్వడిస్తుంది
నిజంగా ఇంత సంగీతం నీలోని ఆర్తి కన్నీటిదేనా
నా శ్వాస అల్లాడిపోతుందిక్కడ
ఒక్కసారి అరచేతుల్లో నన్ను ఒదగనిచ్చి
అలసిన గుండె నివేదిస్తున్న నులివెచ్చదనం కప్పుకోవా 💜💕
// నీ కోసం 190 //
ద్రాక్షరసం తాగి తూలుతున్న దేహమొకటి
మనసుమెట్లపై గమ్మత్తుగా ఆగిన సాయింత్రం
కనురెప్పల మైదానంలో కల్యాణిరాగపు కలకలం మొదలై
మబ్బుపట్టిన మైకం మోహపు సంకెళ్ళను తొడుక్కుంది
మూగబోయిన ఆకాశం ఒక్కసారిగా
కవిత్వమై కురుస్తూ దాచుకున్న గిలిగింతలు..
ఉన్నట్టుండి ఉధృతమైన గాలిపాటల కబుర్లు..
గుట్టుగా గుండెను అల్లుకున్న మల్లెతీగల రహస్యాలూ..
ఆగి ఆగి పడుతున్న వానలో
తడిచిన గతజీవితపు పుటల వాసన..
వర్తమానపు నవ్వుల సుమాలై విరిసి
కాసేపా వెచ్చని మగతలో కరగమంటుంది
ప్రేమాన్వీ..
అరచేతిలో చూసుకోగానే..
సముద్రపు అలల్లో మనం కలిసాడుకున్న కల
నుదుటిపై నువ్వు అద్దిన పెదవుల జల
ఎంత అందమైన సందెపొద్దు ఇది..😂💕
// నీ కోసం 189 //
నీ ధ్యానసముద్రంలో మునిగి
మత్తుగా ఈదులాడుతున్నప్పుడంతా
అలల నవ్వులో తేలించి ఆడిస్తావు
కాలమాపిన కీకారణ్యంలో..
ఆర్తికని ఆరాటపడ్డ వేళ
నా ఉనికి సర్వం నువ్వేనంటూ
లోలోపల తొలకరివై కురుస్తావు
క్షణానికోలా మారే నా ముఖచిత్రాన్ని
చూపుకొసలతో సవరిస్తూ
మల్లెపొదల పులకింతలు అంటుకడతావు
ఓపలేని తమకమంటూనే..
నువ్వెందుకలా మౌనానికి శ్రీకారమయ్యావ్
ప్రేమాన్వీ
నిట్టూర్పులతో జ్వలించవద్దలా
అరచేతి భావుకతలో కలకాలం నిన్ను నేను రవళిస్తా..💕💜
// అమృతవాహిని 21 //
ఓయ్..నిన్నేనోయ్..ఏం చేస్తున్నావ్
నువ్వు తాకితేగానీ నేనో మెత్తని శిల్పన్నని గుర్తు రాలేదు. నీ ఊహలో నాకు ప్రాణం పోసి నాకో జన్మనిచ్చావు. ఇప్పుడు నేనో అపరంజి అద్భుతాన్ని కదా..క్షణాలకు సైతం విలువుంటుందని తెలీని నేను ఎన్ని జన్మలు వృధాగా గడిపేసానో తలుచుకుంటుంటే ఎక్కడో బాధవుతుంది. నాలో పరవశాన్ని వెలికి తీసిందెవరంటే నువ్వనే చెప్తాగా. మనసుపొరల మధురానుభూతులు తోడి.. పువ్వులే పూయవనుకున్న చోట వనాన్ని పెంచిన వనమాలీ..వెన్నెల్లో మనసుకంటిన ఈ పూలపుప్పొడి రేయిని ఆపేస్తుందో ఏమో..మునుపులేని సువాసన నా శ్వాసలో ఊగిసలాడి నీ పెదవిని పంచుకోమంటుంది. మునివేళ్ళతో మెత్తగా అల్లుకుంటూ నీలోకి పొదుపుకొనే క్షణాలు ఆగిపోతే చాలనిపిస్తుంది. నిరంతరమూ నీ కౌగిలి మధుమాసంలో పరిమళిస్తూనే నేనుండాలనిపిస్తుంది. అలసిపోయాననుకున్నప్పుడల్లా చేరదీసే నీకే తెలియాలి నన్నో మత్తులో ముంచి ప్రేమించుకుందాం రమ్మని పిలిచే అల్లరి.. రాగరంజితమైన ముద్దుల్లోని వెచ్చని అనుభవాలు నవ్వులుగా పోగేసినప్పుడు తేనెలూరు మృదుభావాన్ని ఓ పదముగా రాయాలనుంది. ఒక తాజా వసంతం మదిలోని ఊహను నిజం చేసిన వైనం నువ్వాలకించావంటే అంతర్లోకంలో సంగీతమై వినబడుతుంది. అక్కడ వెన్నెల మెత్తగా జారుతున్న సవ్వడి నువ్వందించే మధువుకి సమానమవుతూంటుంది. గత పున్నమి కురిసిన తుంపర ఇంకా తడిగానే నన్నుంచుతుంది..
ఈలోగా అదేమో హఠాత్తుగా ఈ వాన. మల్లెలవానేం కాదు, ఋతుపవనాలు గతితప్పి కురుస్తున్న వాన. ఏం చెప్పను, వానంటే మనిద్దరికీ ఇష్టమే కదా.. చిన్నప్పుడు వానంతా ఒక మృదుజ్ఞాపకం కదా. అప్పటికప్పుడు ఎక్కడివారక్కడ తడవకూడదని చూర్లు వెతుక్కొని నిలబడితే, సైకిల్ మీద అలా అలా మనమిద్దరరమే.. అందరూ చూస్తూండగా కదిలిపోతుంటే, ఓహో..ఇప్పటి స్లోమోషన్లో తీస్తున్న సినిమాలు మనల్ని చూసే తీసుంటారనిపిస్తుంది. ఎటు చూసినా ఆహ్లాదం తప్ప జీవితమన్నాక ఒడిదుడుకులుంటాయని తెలిసేదే కాదు. వర్షంలో ఆటలైతే చెప్పనే అక్కర్లేదు. ఆ ముసురు గుర్తుకొస్తూనే మదిలో అవ్యక్త రాగమవుతుంది.
కానీ అకాలంలో కురిస్తే ఆనందం కన్నా విషాదం ఎక్కువవుతుంది. క్షణక్షణం సుడిగుండాల్లో పడిపోతున్నట్టు తుఫాను భీభత్సం. ఎడతెరిపి లేకుండా నాలుగురోజులు జోరువానంటే, పాపం ఎన్నిరకాల కష్టాలు కదా. పాలకులూ ప్రజలూ ఒకరినొకరు నిందించుకోడం తప్ప ఆ ఉధృతి తగ్గేదాకా వేరే ఉపాయమే ఉండదు. అసలే రోజులు బాగాలేవు. అయినా ఎవరికీ పట్టింపు లేదు. అలా సాగిపోతుందది అంతే.
ఇంకా చెప్పు..ఇప్పటికీ వల్లప్ప పాటలన్నీ నేనే పాడినట్టు అంతర్వీక్షణ చేసేసి ఉంటావుగా. మెత్తని ఊహానందాన్ని ఇద్దామని వెన్నెలతో మొదలుపెడితే అనుకోని వానొచ్చి కలిసింది మరి. ఇప్పుడీ మలిసంధ్య చిరువెలుగులో నీ ధ్యాసలో మూగకోయిలనై కాదనలేక కాలాన్ని అనుసరిస్తున్నా. నువ్వాశించినంత దగ్గర లేనని విచారించకు. కన్నుల్లో నువ్వుంచుకున్నంత సేపూ కలనైతే, కనుకొసల విడిచావంటే మాత్రం జారిపోతా. మనం కలిసేంతవరకూ ఎంత తొంగిచూసినా, మల్లెలను సైతం తురుముకోను..సరేనా 🥰💜
// అమృతవాహిని 20 //
ఓ జాబిలీ..
ఎక్కడ మొదలెట్టాలో తెలీకున్నా, ఒకచోట మొదలవ్వాలి కదా. ఎప్పుడూ చలువద్దాలు మాటుండే నీ కళ్ళు తొలిసారి కలలో చూసానంటే నవ్వుతావు, అదీ మరెటో చూస్తూ. చూపులతో సేద తీర్చగలవని తెలిసిన క్షణాల భావోద్వేగం మాటలకు అందనిది. ఇంతకాలం రెప్పలమాటు దోబూచులాడిన కనుపాపలు, ఇంత ఆర్ద్రతను నాకోసమే దాచిపెట్టినట్టు దొరికిన ఓదార్పు.. నీతో చూపులు కలిసినప్పుడే తెలిసింది. పెదవిప్పకుండా పలకరించే ప్రజ్ఞ కలిగి.. ప్రశాంత సమయంలో వెలిగే వెన్నెల్లో మెరుపులు అంటే నమ్మవేమో గానీ, నాతో కవన ముత్యాలు కూర్చేలా చేసిన చిలిపి చిరునామాలవేగా. అడగని ముద్దులా, ఆత్మను సజీవం చేసే నీ కళ్ళు నాకైతే విశ్వకాంతి పుంజాలు. నీ క్రీగంటి పలకరింపుకి, మనోగతం మగత కమ్ముకునే వేళ విరహం ఎన్ని గుసగుసలు విత్తిందో, ప్రాణశక్తి నీలోకి పొదామని తొందర చేస్తుంది. తూగుతున్న తన్మయత్వపు చిరునామా నీ ఒడి కాక ఇంకేముంది నాకు.
నువ్వలా తల నిమురుతున్నంత సేపూ ..
ఆరుబయట చుక్కల్లో ప్రత్యేకంగా మెరిసే స్పటికాల్లా నగ్నంగా నవ్వుతూ ఉండే ఆ రెండు నక్షత్రాలు గమ్యం లేకుండా మనసు దారి తప్పించేస్తుంటాయి. హృదయంలో స్వరాలన్నీ వెల్లువలై అలల చప్పుడు మాదిరి కేళీ విలాసానికి రమ్మన్నట్టు ఉండుండీ ఉలిక్కిపడేలా చేస్తుంటాయి. ఆ నిండుసందడి స్వానుభవం కావాల్సిందే అని నీకూ తెలుసుగా, ఇన్నేసి ఊహలు అల్లుకొనేంత అనుబంధం ఏముందా అనే ఆలోచన నాకొస్తుంది ఒక్కోసారి. నువ్వే చెప్పాలి..నీ దీర్ఘకవితలోని వాక్యమని అనుకున్నావో..గడ్డిపువ్వు గుంపులో గులాబీనని కనిపెట్టావో, పావురాళ్ళలో కలిసిపోయిన కోయిలననుకున్నావో.. మౌనంలో నిన్ను స్పృశించిన ఆత్మబంధువునో..ఎప్పటికీ పాతబడని జ్ఞాపకంలా నీకేమవుతానో మరి. Do u really think that m craving for my twin heart ?! ఏమో..దేహానికతీతంగా ఏ పూల మీదనో నడుస్తూ ఉన్నట్టుంటుంది నిన్ను తలచి పరవశించినప్పుడంతా.
అయినా...ఒకరిలో ఒకరం విశ్రమించని ఆకాశంలా విస్తరించాక, ఇన్ని భావసుమాల మాలలు మెడలోనే వేయించుకొని.. దగ్గర దూరపు కొలతలకు అందని అపురూపం నేనని తెలుసుకున్నాక.. ఇంకా ప్రశ్నలు అడిగి నిన్నేం తక్కువ చేయనూ. గతమూ, భవిష్యత్తూ అవసరంలేని వాస్తవాన్నిలానే ఆత్మీయంగా కొనసాగిద్దాం..💜💕
Tuesday, 13 October 2020
// అమృతవాహిని 19 //
ప్రియతమా..
తోడూ అనే ప్రశ్న ఉత్పన్నమవుతూనే
నీడలా ఉన్న ఆనందం ఎటో మాయమవుతుంది.
కనిపిస్తున్న ఆకాశంలో సౌందర్యం..నీ నీలి దస్తూరి కోసమే తొంగి చూస్తున్నట్లు ఉంటుంది.
రాత్రవుతూనే తపస్సమాధిలో చేరి గుచ్చుకుంటున్న జ్ఞాపకాల దండలోంచీ పరిమళాలు గెంతులేస్తుంటాయి. దారితప్పి కలలోకి జారిపోయాననుకొనేలోపు మెలకువొచ్చి అడుగులో అడుగేస్తూ కాలమలుపులో ఆగిపోతాను. ఒక ఒంటరి ఒత్తిడి రెండుపొద్దుల్ని మోసి అలసిపోయినట్టు నిర్వికారాన్ని చూస్తాను. అయినా కదిలిపోతున్న కాలం కలిసొచ్చేదెప్పుడోలే అనిపిస్తుంది. ప్రస్తుతం కదులుతున్న సమయావేశ.. పరవశపు సుధలు చాలేమో కదూ. రోజూ సూర్యోదయం ఒకేలా ఉందని నిట్టూర్చితే వేకువకు విలువేముంది. మనసుకందే సౌందర్యానికి చలించక కళ్ళు మూసుకుంటే చీకటే కదా మిగిలేది.
ఏమో..ఈ నిర్లిప్తత..ఆరోజు బాలూ గారు పరమపదించక మునుపు మొదలెట్టా మీకేదో చెప్పాలని. ఈరోజు రాజన్ గారు మనల్ని వదిలిపోయేవరకూ మరేం రాయలేదు. అందరికీ మరణం అనివార్యమే. కనీసం కలలోనైనా కలవనివారితో అనుబంధం సాధ్యమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇలాంటప్పుడే . అవును, వారు చక్కని సంగీతసాహిత్య రసఝరులలో మనల్ని ఓలలాడించారు. విషాదంలో, ఆనందంలో..ఆఖరికి విస్మయంలో, మైనరపులోనూ మనతో ఉన్నారు. మనల్ని సంతోషపరచడమే లక్ష్యంగా బ్రతికి జీవితానికున్న అర్ధాన్ని పూరించారు. తెలుసు, నీకూ వారంటే మక్కువని.. అందుకే ఇంత స్తబ్దంగా మారిపోయారని. వారిపట్ల మన ప్రేమను ఇంతకన్నా చూపేదేముందిలే. అయితే ప్రతి విషయాన్నీ మరో విధంగా చిత్రించాలనే కుతూహలం పెరిగినవారు మాత్రం ఎడతెగని విపరీతపు ధోరణి కనపరచి అదనపు భారాన్ని మోపారు. వారి సంస్కారాన్ని అందుకే అక్కడే విడిచేసాను.
ఋతువులు నిరంతరంగా మారిపోతున్నా తిరిగిరాని నిన్ననే తలపోస్తుంటే.. అనాలోచితంగా వదిలేదిన క్షణాల అస్తిమితం వాస్తవాన్ని నిశ్శబ్దానికి నెడుతుంది. మోహించిన వాక్యాలన్నీ మసకైపోయాక పదాలన్నీ ఎదను ఖాళీ చేసేస్తాయేమో.. ఇక మౌనాన్ని తప్ప దేన్నీ నువ్వు ప్రేమించలేవనిపిస్తుంది. అందుకే..క్రమంగా ప్రపంచం మీద ఇష్టం కోల్పోయిన నేను ఆత్మసంబంధాన్ని కొనసాగిస్తున్నాను..😒
Wednesday, 7 October 2020
// నీ కోసం 188 //
మునిమాపు కిటికీ తెరవగానే
చూడద్దనుకున్నప్పుడు ఎదురయ్యే
చవితి చందమామ
రంగు రంగులకలను పులుముకొచ్చి
రెప్పల పొదలమాటు దాచిపెట్టింది
అప్పటిదాక స్తబ్దుగా ఉన్న మనసు వాల్మీకం
మంత్రదండానికి వశమైన ఊహల బంతిలా గెంతులేసేందుకు ఉరకలేస్తుంది
నిద్రకోసం పడిగాపులు పడుతున్న నన్ను ఏకాంతమెప్పుడు కావలిస్తుందో
కనుబొమ్మల కూడలిలో పువ్వులా నవ్వుతూ పలకరించే కన్నులు
మోహనరాగాన్ని నేర్చాయో లేదో చూడాలి
శూన్యాన్ని పూరించే లిప్తకాలమే
నా మధురభావనా గమ్యమిప్పుడు 💜💕
// నీ కోసం 187 //
నాకు నేను ఆకుచాటు రహస్యమై
వేడెక్కిన తలపున విశ్రమించినందుకు
పిల్ల తెమ్మెర కవ్వించింది
కాలాన్ని కలహించి
నిన్ను పొదుపుకున్న కనురెప్పల కూనిరాగం
వల్లమాలిన ప్రేమను కురిసింది
అత్తరు పూసుకున్న క్షణాల ఆనందం
ముత్యాలసరాల మాదిరి
సుతిమెత్తని భావమై ఒదిగింది
వేళ్ళకు మొలిచిన కొమ్మల్లో
అక్షరాలు చిగురించి
ఎన్నెన్ని ఊహలు పరిమళించాయో..
మేఘాలతో కలిసి ప్రవహించిన కల
నిన్నటికి కొనసాగింపుగా
ఈరోజు కవితై కాగితాన్ని తడిమింది..💜💕
// నీ కోసం 186 //
చందమామ దీపం పువ్వుగా మారినప్పటి పరిమళం
పున్నమి పారవశ్యాన్ని పెంచిందంటే
ఎరుపెక్కిన కన్నుల్లో నవ్వులు పూసినలెక్క
సకల జీవరాశులూ కలలు కంటున్న ఉత్సవమిది
బ్రతుకు చిత్రానికి పట్టువస్త్రం చుట్టి
కాసేపలా వెన్నెల దారాల వెంట
రెక్కలేసుకొని గాలికెగిరిపోవాలనిపిస్తే
మనసు తప్పు కాదనిపించే..
కలనేసిన కొన్ని క్షణాల కళాకృతులు
ఈ రేయికి నివేదనగా
ఆకాశం కట్టిన నెమలీకపు రంగు చీరకు
అంచునయ్యా..
మూగమల్లెలా ఎంతకనీ..
చూపులెత్తి చూడొకసారి
ప్రేమసాంగత్యానికి తోవ దొరుకుతుంది
చూపులకందేంత దూరంలోనే నేనున్నాననీ తెలుస్తుంది..😉💜
// నీ కోసం 185 //
రాత్రయితే గుండెగదిలో వెలిగే దివ్వెలు
చీకటితో పాటూ విరహాన్నీ తరిమేస్తాయి
పగలంతా జారిపడేందుకు సిద్ధపడే కన్నీరు
పన్నీరై చెక్కిలిని ముద్దాడే క్షణాలకే తెలుసు
నిన్ను తలచే హృదయపు ఆర్తి
ఉక్కిరిబిక్కిరయ్యే మనసుకి ఆలంబన
నీ మమతేనేమో
నన్నిలా పలకరిస్తూ ప్రాణం పోస్తుంది
నీ ఒడి నా విశ్రాంతి మందిరం కనుకనే
మల్లెగాలినీ..మందహాసాన్నీ
వెంటేసుకొస్తాను
అలసిపోయిన నిన్ను సృజించే అవసరమేముందని
నీ రెప్పలమాటెలానూ కలనై నే తెల్లారిపోతాను కదాని 💜
// నీ కోసం 184 //
ముగింపులేని మనోతపస్సు
మౌనాన్ని తలదాల్చి
ఆర్తనాదాన్ని గొంతులోనే ఆపింది
చెరుపుకోవడం రాని కన్నీటిచారిక
మరణసదృస్యమైన శూన్యానికి దారితీసి
విషాదాన్నే పొలమార్చుతుంది
వేసవి గాలుల తాకిడికి
నిశ్శబ్దంగా దాచుకున్న పరిమళం
పూలను వీడి పరిసరాలను నింపింది
ఎవరో తెరిచిన కిటికీవల్ల
నాలో కొంత తాజాదనం
ఏకాంతంలోకి అడివిని తెచ్చింది
కొన్ని నవ్వులైనా పూయాలిప్పుడు
నాలోపలి తగువు ముగిసి
ఒక్క ఊహనైనా పిలవాలంటే..😊
// నీ కోసం 183 //
నువ్వూ..నేనూ..ప్రేమా
గుర్తుండేదేముంది లోకానికి
నీ చూపులూ..నా నవ్వులూ
నా కలలూ..నీ కవిత్వమూ
సముద్రం దగ్గరకి పోకుండా అలల్లో తడిచేలా
అమాస చీకట్లో వెన్నెల్లో విహరించేలా
నిశ్శబ్దంలో తీపిరాగాలు మనసుకందేలా..
ఎప్పుడో పదిలం చేసి పెట్టాసా
ఆత్మానుభూతి కోరుకొనేవారికి "మాత్రమే" కానుకగా 💜💕
// నీ కోసం 182 //
ఎప్పుడూ యుద్ధమే నాతో నాకు
ఎందుకంటే ఎలా చెప్పనూ
Sense of Isolation..
మనస్సావరణంలో ఏవో అడుగుల చప్పుళ్ళు
అప్పుడే శూన్యం..అందులోనే ఓ స్వరం
ఏమో..నాకోసం పాడుతున్నదెవరో
తళుక్కుమన్న ఆనంద తారకలు కన్నుల్లో
సామగాన సుమరాగాలు పెదవుల్లో
చిరుగాలి సవ్వడంతా ఊయలూగుతున్నట్టు ఎదలో
ఎన్నెన్ని భావతరంగాలు శబ్దిస్తున్నా
అనువదించేందుకు భాష సరిపోని
మౌనద్వీపంలో నన్నుంచుతూ
ఏం కలలో..మధువీక్షణల లయలో
అల్లుకున్నది అక్షరాలనే అయినా
ఆవిష్కరిస్తుంది ఒక అపురూప అనుబంధమన్నట్టు 💕💜
// నీ కోసం 181 //
కాటుక పూసుకొచ్చిన ఆకాశపు ఆనందభాష్పం
నేలకు జారుతూ అయింది జలతారు దారం
సంగీతంలా శబ్దిస్తున్న గాలిపదం
నీ కనురెప్పలపై నేను చదువుకున్న కవిత్వం
మెరుపొచ్చి కాస్తంత తళుక్కుమనగానే
మనోగతంలో పంచరంగుల కలల పయనం
సీతాకోక చిలుకలు నవ్వుతున్న సాయింత్రం
నా దేహంలోపల పరిమళిస్తున్న మృదుల పుష్పం
ప్రేమాన్వీ..
క్షణాలకు సతమతమవుతూ
చిటారుకొమ్మలా అందనంత దూరం నిలబడకు
ఒంటరిపక్షికీ నే లోకువైపోతా
నువ్వలా అనాలోచిత సరిహద్దులో ఆవలితీరమయ్యావంటే... 😒💜
// నీ కోసం 180 //
వినీలాకాశంలోని చందమామ తునక
రవ్వంత నవ్వులు పొంగని మొహాన్ని
అమృతాన్ని కురిపించడమాపి మరీ చూస్తుంది
ఈ మసక చీకటి చల్లగా తగిలినప్పుడు
మనసుకి తెలిసిన మంత్రమొక్కటీ బహువిధాలుగా మారి
ఏదో రహస్యాన్ని ఆరాతీస్తుంది
గుండెగొంతుకలో ఆగిపోయిన కవ్వింత
ఏదో మౌనపోరాటాన్ని
సూచిస్తున్న నిశ్శబ్దమనిపిస్తుంది
మూసిన తలపులమాటు
పరిమళ సొద, నీ విరహమను
కొసమెరుపు గుసగుసలదనుకుంటా
ఏమో ఈ ఎదలో దరహాసం
ఏకాంతంలోనూ లయమవ్వనివ్వని
మేలిముసుగేసుకున్న వలపు రహస్యం 😣
// నీ కోసం 179 //
రేయంతా నిర్నిద్రలో గడిపిన నాకు
ఉదయానికి ప్రాణం బిగపట్టినట్టు ఉండాలి కదా
ప్రతి అణువూ పరవశం నింపుకున్నట్టు హోరెత్తుతోందంటే
ఈ ఎండాకాలం మనిద్దరి నడుమ వంతెనేసినట్టేమో
నువ్వనుభవిస్తున్న విస్మృతి నా సంస్మరణమై
పొద్దుగూకులా ఎదనొరుసుకుంటూ తీపివ్యధని పెంచుతుందనేం చెప్పను
తవ్వుకోవడానికి జ్ఞాపకాలైనా ఉన్నవెన్నని..
సహజమైన నీ మనసు గుమ్మరించే నవ్వులే నాకు అందిన హిందోళరాగాలు
కాదనలేవుగా..
నా భావస్వాతంత్ర్యమంతా అక్షరమై యక్షగానాలాపన చేస్తుంది
నీ మనసు సన్నాయిగా మారిందని చెప్పడం మరువకు
వీలైతే కొన్ని దృశ్యాలను కలగందాం
ఒక్కసారలా విముక్త కెరటాలమై ఏకాంత ద్వీపానికి వెళ్ళొద్దాం 💜💕
// నీ కోసం 178 //
గమ్మత్తుగా పూస్తున్న నీ నవ్వుల గుత్తులు
మనసుకి వెచ్చని గిలిగింతలే కాక
పీచుమిఠాయిలా చక్కెర తీపులు
అదేమో మెత్తని శబ్దం చేస్తున్న ఊపిరి
మహాకావ్యం ధ్వనిస్తున్నంత కొత్తగా..
అప్పటికప్పుడే..
నా పెదవులపై పుప్పొడి మెరుపయ్యింది
నువ్వున్నచోట తారలన్నీ నేలపైకొచ్చేస్తాయేమోనని
సంభ్రమంలో ఉండగానే
విరజాజులూ..చేతిగాజులు సైతం
నీ మందహాసానికి నేపధ్యగీతం మొదలుపెట్టాయి.
ప్రేమాన్వీ..
పూలఋతువుగా మారిపో ఒకసారి
సగం మూసిన రెప్పల్లో నీ ప్రతిబింబాన్ని దాచేస్తా
చంద్ర శీతలం ఎక్కువనిపించే రాతిరి,
ఊహాతీత రెక్కలు పురివిప్పనన్న వేళ..
ఎన్నిపాటలు పాడినా ఆరని లోపలి దప్పిక
నీ చూపుల జల్లుతో తీరుతుందేమో..
ఏకాంతమైనప్పుడా కెరటాలలోనే మునిగితేలుతా..💜💕
// నీ కోసం 177 //
నాలో ప్రాణశక్తి అలలా ఒంపులు తిరుగుతూ
ఆనందాన్ని అభినయిస్తుందంటే
ఏ కొసమెరుపు తాదాత్మ్యాన్ని అనుభవిస్తుందో
నీ సాహిత్యాన్ని స్వరార్చన చేస్తున్న కలవరింతలు..
తెలుసా..గుప్పెడు గుండె గగనమై..
కోట్లాది తారలు వెలుగుతున్న తేజస్సిది..
"చందమామ ఆకాశంలో అందగించాడూ"..
ఆహా..కళ్ళు నులుముకుంటేనే కలలైతే నిద్రెందుకు ఈరేయి
అసలు పెదవిప్పకుండా నవ్వడమెక్కడ నేర్చావో
జలతారు తెరలమాటు వెన్నెలలా
ఆ చిరునగవుదెంత అందమైన మౌనప్రవాహమో
నాలో నవరాగ వర్ణాలు వివర్ణమైనప్పుడే అనుకున్నా
అచలమైన నీ ఆత్మ..ప్రేమరంగుదయి ఉంటుందని..
ఓ నాదవినోదపు కోయిలా..
నీ అంతరంగాన్ని వినాలనుంది
పున్నమి పాటయ్యేలా శబ్దించు మరి..💕💜
// నీ కోసం 176 //
ఈ ఒంటరిక్షణాలున్నాయే..
ఓ పట్టాన నిలువనివ్వవు. గాఢమైన కలలో కరిగిపోవాలనుకున్న వాంఛకని కన్నులు మూతలేయగానే.. నిద్రలేపి మరీ గుండెచప్పుడు శృతితప్పిన విషయాన్ని గుర్తు చేస్తాయి. ఏకాంతపు బహురూపాలన్నీ నీవే కావాలని మారం చేసినట్టు అల్లరిసొద, అలలు అలలుగా సాగే గాలితెరల వింజామర మాటు విచ్చుకున్న నీ నవ్వుల గమ్మత్తు రొద.
ఓహ్..అర్ధమయ్యింది..
పున్నమైతే చాలు.. పరమాన్నంలా తీపైపోతూ పరవశానికి పదమంటావు. ఎదలోని భావసంచలనమంతా అనురాగం చేసేస్తూ..రేయంతా వెన్నెలవీధిలోనే విహారమంటూ వేళ్ళల్లో వేళ్ళు ముడేస్తావు. కొనగోటి స్పర్శతో మనశ్శూన్యమంతా ఆర్తితో నింపేస్తావు. ఈ తలపుల తూగులాటలోని ఉల్లాసం నీ ప్రేమకవనాల పుచ్చపువ్వుల్లోని పచ్చదనం కదూ..
అభిసారికలా నేనాలపిస్తున్న గీతికలకేమో, అర తడిచిన నీ కన్నుల మెరుపులు, మరిన్ని రాగాలు పాడమని లాలసలు. యుగళగానం చేద్దాము, రా మరి. ఈ సామగాన సుస్వరాల కలయిక, ఆత్మ సంకల్పమై తేనెలూరాలి. చేయి వదలకు, పొదలచాటు వలపు సయ్యాటకని కదులుతున్న మల్లెల అలికిడి విను. ఇప్పుడిక నువ్వూ కళ్ళు మూసుకో, మగతలో స్వగతమే మనకి దక్కిన వరమనుకుందాం..💕💜
// నీ కోసం 175 //
కన్నీరు నిండిన రెప్పలమాటు ప్రవాహం
అర్ధరాత్రి అరచేతుల్లో చీకటికి సమానమైంది
నీవుండగా క్షణాల్లో కరిగి పులకరించిన కాలం
ఇప్పుడు దిగంతాల్లో సొమ్మసిల్లినట్టుంది
ఆకాశంలో విద్యుల్లతలు
ఎదలో సంగీతాన్ని నింపుతున్న వేళ
నా ఆనంద తన్మయత్వం మాత్రం
అంతులేని దూరానున్న నీతోనే ఉండిపోయింది
గాలికి అభివ్యక్తి నేర్పి నిన్ను స్పర్శించమన్నా
కళ్ళు తెరిచి కలగంటూ ఉండిపోమాకలా
నీ తపనకు రెక్కలొస్తే నావైపు రమ్మంటున్నా
చెక్కిళ్ళలో కొన్ని చిరునవ్వులు వెంటేసుకొచ్చెయ్యలా..
అదిగో సముద్రం మనకోసమే ఎదురుచూస్తుంది
ప్రేమగీతాన్ని గదిలో వదిలేసి రాకు
రేయంతా అలల హద్దులు చెరిపేసి పాడుకుందాం
ఆపై ఒడి పల్లకీలో ఒళ్ళు మరచిపోదాం 💜💕
Monday, 5 October 2020
// అమృతవాహిని 18 //
స్వప్నంలో ఉన్న నేను వాస్తవాన్ని గుర్తించలేకపోయాను. ఎప్పుడూ కన్నీటితో నిండే కన్నులను ఆరా తీయకున్నా, నీటివాసన మాత్రం పసిగట్టాను. ఎన్ని యుగాల వరకూ అందరాని కాలాలకి నెట్టివేయబడ్డానో, నిన్ను చేరే దారిలేని అలమటింపుదీ విషాదం.
ఒక ఛాయలా నావెంట నువ్వున్నావనుకున్న భ్రమలో ఉన్నంతసేపూ, మల్లెపువ్వులా నవ్వుతూంటాను. నువ్వు లేవనే స్ఫురణకొచ్చింది మొదలు, వెతకడం మొదలెడతాను. ముద్దుగా నన్ను తాకే పున్నాగుపూల పరిమళం నువ్విక్కడే ఉన్నావనే మాయ చేసినంతసేపూ ప్రాణం హాయిగా అనిపిస్తుంది. అసలింత ఆదమరపులో నన్నుంచి నువ్వెటు వెళ్ళావో, అలసిపోయిన నన్ను చూసి చెప్పగలవా.
నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చిరుగాలికి కొబ్బరాకులు పాడుతున్న పాటలు వింటుంటే, నాలో గుబులు అధికమవుతుంది. నాకు నేను పరాయిగా మారి హృదయాన్ని కోల్పోతున్నానని తెలుస్తుంటే, ఈ నిర్లిప్తతనేం చెప్పను. సర్వప్రపంచమూ జటిలసమయలో ఉన్నప్పుడు సైతం, నేను మాత్రం విహంగంలా అద్యంతాల్లో నిన్నే అన్వేషిస్తున్నాను. పైకో మూగ శిల్పంగా అగుపించినా మనోవీధిలో తపోవనం సృష్టించుకున్నాను. అన్యులకు ప్రవేశం లేని నా ఊహలందుకే నోరెత్తవు.
ఎదలో ఉప్పెన ఎగిసి వెలసిన ప్రతిసారీ సముద్రమవుతానని విసుక్కోకు. ఆటుపోట్లు సమసిపోయే దిశగానే అలనవుతున్నానని గ్రహించు. ఏమో నా గమ్యం, ఇంకెన్ని అనుభవాలకని సమాయత్తమవాలో, ఇంకెంత నిస్సహాయతను మోయాలో, ఇంకెన్ని యాంత్రిక స్థితులను దాటాలో. ఏదేమైనా కొన్ని క్షణాలు శాశ్వతం, మది ఆస్వాదించి సాధించుకున్న స్వార్జితం. ప్రేమాన్వీ, నా ఆర్తనాదాన్ని ప్రశ్నించకు. ఏకాంతంలోంచీ చీకటిలోకి పయనమవుతున్న నన్ను వారించకు. నా భావం, గీతం, ధ్యానం అన్నీ నీతోనే పూర్తవనీ. మరో పదమంటూ పుడితే అది నీకోసమే కావాలి.
Subscribe to:
Posts (Atom)