Saturday, 30 January 2021
// నీ కోసం 274 //
కొన్నలా కలిసొస్తాయి..
నీ మౌనం చివరి ఏకాంతానికి
ఆహ్వానమందినట్టే నేనొస్తాను
ప్రేమను మాత్రమే పేరు మోయాలనుకునే
నిన్ను అభినందిస్తూ సీతాకోకలా అభినయిస్తాను
నన్నేమని పిలవాలో తెలీట్లేదంటూ
నీ పేరులో సగమిచ్చి సత్కరిస్తావు
దీర్ఘస్మృతులు దోసిళ్ళలో నింపుకున్న నువ్వు
లోలోపలి నిశ్శబ్దాన్నంతా నక్షత్రాలు చేసి
నావైపు పువ్వులుగా విసిరేస్తావు
చలిస్తున్న క్షణాల మధ్య దూరం తెగి
రెక్కలవసరం లేకుండానే
ఆకాశానికి చేరొచ్చని అనుకునేలోపునే
కొన్ని సంభాషణలు సెలయేరులవుతాయి
కలల పొందులో నేనలా ప్రవహిస్తూండగానే
ఇదీ కవనం చేయమని ఆదేశిస్తూ
రోజూలాగే నువ్వెటో అంతర్ధానమవుతావ్ 💜😉
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment