Saturday, 30 January 2021
// నీ కోసం 265 //
ఎంతగా దాక్కుంటావో తెలీదు
సూర్యచంద్రులు కూడా మబ్బుచాటుకి
అన్నిసార్లు పోతుండరు
వేకువప్పుడు తొందరపడి లేచి
ఉక్కిరిబిక్కిరయినట్టు అనిపించగానే
నీ కుశలాన్ని కనుక్కోవాలని
కళ్ళు తెరుస్తాను
ప్రపంచం పలకరింపులు మొదలెట్టి
వెలుతురులోకి నడవమనగానే
నువ్వు పంపే పువ్వులగాలి పీలుస్తూ
కాసేపటికి నెమ్మదిస్తాను
రాత్రంతా కలల్లోకి తొంగిచూస్తూ
ఎన్ని భావాలు చదివావో అడిగేలోపు
కవిత్వపు పుటలు మూసేసి
కాలం కన్ను కొట్టిందని వెళ్ళిపోతావ్
గోధూళి నింగికెగిసే వేళ
నిట్టూర్చుతూ నే నిలబడినా
ఏకాంతానికి రంగులద్దాలని
నిశ్శబ్దంగా నవ్వుతూ ఉండిపోతావ్
ఆశలతీరంలో నీ ఊసులనూహిస్తూ ఉండగానే
చిలిపి చుక్కల దుప్పటి కప్పేస్తూ
రెప్పలమీద మెత్తగా ముద్దుపెట్టి
బజ్జోమని చెప్పకనే చెప్పేస్తావ్ 😒
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment