Saturday, 30 January 2021
// నీ కోసం 262 //
తలుపుని తోసుకొని వచ్చేసే గాలిలా
ఆత్రంగా నా ఏకాంతాన్ని పగలగొట్టేందుకు
తలపులు తెరుచుకుని వచ్చేస్తావే
విప్పారిన రాత్రినంతా
చీకటి కనపడనంత గమ్మత్తుగా
నన్నంతా పరచుకునే లేత నీలాకాశమవుతావు
కోటిసీతాకోకల రంగు పులుముకొచ్చి
నీరవంగా నన్ను చదువుతూ
విరహాన్ని ఆవిరిచేసి ప్రేమ చిలకరిస్తావు
వేకువకంతా అలసిపోయిన నెలవంకలా
సగంసగం మబ్బు ముసుగేసుకుని
నిదురమ్మను కౌగిలించే పాపవవుతావు
నన్ను ముద్దుచేసిన ముచ్చటంతా
కలగంటావేమో
సిగ్గుపడి నీలోనే నువ్వుండిపోయి
నన్ను తప్పించుకు తిరుగుతావు
అదిగో..కాలం కదులుతుంది గుండ్రంగా 💜
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment