Saturday, 30 January 2021
// నీ కోసం 278 //
అప్పుడే సాయింత్రమైపోయింది
నన్ను మధురాక్షరాలతో పలకరించినట్టే కనిపించి
అప్పుడనగా మాయమయ్యావ్
నువ్వు మళ్ళీ పిలుస్తావని
మూసుకుపోతున్న కళ్ళను మభ్యపెట్టి
తడిపెదవుల్లో కొన్ని మాటలు దాచుంచాను
అప్పటిదాకా ఆర్ణవమై
అంతలోనే అలలా అంతర్ధానమై
అపరిచితమయ్యే అల్లరెక్కడ నేర్చావో
నీ నిరీక్షణ మధ్యలో
నా మౌనం సగం సగం నవ్వుతూ
నిశ్శబ్దాన్ని తర్జుమా చేయమన్నది తెలుసా
పూర్తికాని కవనంలో పరిమళపుష్పాల్లా
నీ తలపుముత్యాలు ఏరుకుంటూ
పొద్దు గుంకింది చూడు
పదాలు వాడిపోయేలోగా
ఈపూటయినా నన్నాలకిస్తావో లేదో మరి
లేదంటే అలవాటయిన శూన్యం ఉండనే ఉందిగా 😔😒
// నీ కోసం 277 //
పొద్దువాటారిన నీలినీడల్లో కాలమాగి
రాత్రికి తలుపు తెరవగానే
చూపులు కొలవగలిగిన దూరంలో
నిలబడ్డది నువ్వేనని వెలుగులీనింది దేహం
కొమ్మని కలవరిస్తూ రాలిపోయిన పువ్వులా
మాటలు మరచిపోయిన నా విరహం
ఒంటరితనాన్ని వీడిపొమ్మనే సముదాయింపులా
ఒక్కసారిగా పెదవంచున రాజుకుంది మందహాసం
తపమెంచి తలవంచిన నీ మదినెంచి
తడబడుతున్న నా చూపునేమనకు..
సిరులొలికే నుదుటన మరులొలికే ముద్దులు
ఆలాపనకే గానీ ఆకట్టేందుకు కాదని
నువ్వనుభూతిస్తే చాలంటుంది విను 💜😌
// నీ కోసం 276 //
నీకై చాచిన చేతుల్లో
యధాలాపంగా ఏ పరవశాన్ని తాకావో
చెదిరిందిలా నా ప్రతిబింబం
మాటలు వలసపోయిన నిశ్శబ్దంలో
నువ్వే చందనపు చూపులు చల్లావో
బుగ్గలు కందిన పరిమళం
మనసు నవ్వుతున్న ఈ క్షణం..
గుండెకొమ్మకి సరళీ స్వరాలు పూసినట్టు
కన్నులే తెరువనివ్వని తన్మయత్వం..
అల్లకల్లోలంగా చిలుకుతున్న ఊహలన్నీ
కమ్మని కూనిరాగాలుగా
మహకొత్త నిర్వచనమీ తీపిప్రవాహం 💜💕
// నీ కోసం 275 //
ఎదురుచూడని సాయంకాలం
ఎదలోకి నీ ఆగమనం..
జివ్వుమని వీస్తున్న చలిగాలికి
మబ్బు పట్టిన కళ్ళలో
నిదురనే కలగంటున్న మత్తు
తరుముతున్న నీ విరహం
నన్ను సవరించే మురిపెం..
గులాబీరంగు సిగ్గువిడిచి పచ్చనైనట్టు
మౌనం గిలిగింతల చందనమై
బుగ్గలకు నెమలీకలు రాసినప్పటి నవ్వు
గాఢమైన నిశ్శబ్దక్షణాల్లో
సున్నితమైన నీ తలపు వ్యాపకం..
ఊహల నైరూప్యంలో నేనున్నప్పుడు
సుషుప్తి వీడితే తపస్సు చెదిరి
మనసు నొచ్చుకుంటున్న వైనం
చూపు కలపని బెంగల్నీ
ముద్దుచేసే రెప్పలు కదా నీవి..
ఇమిడిపోయానందుకే,
హృదయం బరువెక్కినపుడల్లా
ఒకరికొకరం తోడవ్వొచ్చనే 💜😂
// నీ కోసం 274 //
కొన్నలా కలిసొస్తాయి..
నీ మౌనం చివరి ఏకాంతానికి
ఆహ్వానమందినట్టే నేనొస్తాను
ప్రేమను మాత్రమే పేరు మోయాలనుకునే
నిన్ను అభినందిస్తూ సీతాకోకలా అభినయిస్తాను
నన్నేమని పిలవాలో తెలీట్లేదంటూ
నీ పేరులో సగమిచ్చి సత్కరిస్తావు
దీర్ఘస్మృతులు దోసిళ్ళలో నింపుకున్న నువ్వు
లోలోపలి నిశ్శబ్దాన్నంతా నక్షత్రాలు చేసి
నావైపు పువ్వులుగా విసిరేస్తావు
చలిస్తున్న క్షణాల మధ్య దూరం తెగి
రెక్కలవసరం లేకుండానే
ఆకాశానికి చేరొచ్చని అనుకునేలోపునే
కొన్ని సంభాషణలు సెలయేరులవుతాయి
కలల పొందులో నేనలా ప్రవహిస్తూండగానే
ఇదీ కవనం చేయమని ఆదేశిస్తూ
రోజూలాగే నువ్వెటో అంతర్ధానమవుతావ్ 💜😉
// నీ కోసం 273 //
నీ విరహం నిశ్శబ్దంగా నవ్వినప్పుడు
రాలిన పారిజాతాల మువ్వల సవ్వడికి
నాలో ప్రేమ నులివెచ్చని దుప్పటి కప్పుకుంది
నీ మౌనమందించిన ప్రేరణకే
మనసు నిశ్చలమై.. నా నరనరాల్లోని ఆలాపన
సంచలనాన్ని సాంత్వన పరిచే అతీతానుభవమనుకుంటే..
తపించిన నా తలపుల నిర్మోహం
నిన్ను అలౌకికం చేసిందని నిరూపణగా
ఆ తడికళ్ళ స్పందన చాలు..
మన అవిశ్రాంతపు జీవితప్రయాణంలో
రససిద్ధి పొందే క్షణాల సుతారం
తుదీ మొదలూ అక్కర్లేని వృత్తం నాకు
తీరమంటూ లేని సంద్రంలా
ప్రేమకు ప్రేమే సంకల్పం
నిరీక్షణను అంతంచేసే నిరంతర దీప్తివంతం
// నీ కోసం 272 //
నిశ్శబ్దాన్ని విడిచిన కాలం చప్పుడు
నీకు వినబడలేదేమో
నువ్వొక్కసారీ నవ్విన ఆనవాలు లేదు..
రాలిపోతున్న ఆకుల ఆర్తనాదాలు
నా నిరీక్షణలోని నీ జ్ఞాపకాలంటే
గుబులు పడబోవుగా
నే పాడుకుంటున్న పదాలు
అనుసరిస్తున్న నీ చరణాలు కాగా
కాటుకపిట్టల కన్నుల్లో కోరికలా
చిమ్మచీకటి మౌనగతిలో మోగడం
మనసుకిదో మధురోహల విరహం
అదేమో.. మరి
నీ ఊహల్లో తప్పిపోడమే
నాకిష్టమైన తన్మయత్వం ఒక్కొక్కప్పుడు 💜
// నీ కోసం 271 //
కధలు చెప్పే కళ్ళు అంటారే
వినేందుకు ఉవ్విళ్ళూరే వారికోసమేమో
కలలకీ కల్పనకీ అర్ధంకానంత అతీతంగా
ఇష్టాలు మాత్రమే వ్యక్తమయ్యేలా
కాటుకలేని కళ్ళుంటాయ్
ఊహల అలికిడికి సంశయిస్తూ
అనుభూతులు రమించినప్పుడల్లా
చిన్నగా వర్షించినట్లు
కొంత వెన్నెలనలా చిలకరిస్తాయ్
పగలంతా పరాధీనపు నవ్వులై
వాకిలి మూసేవేళ
చీకటిని ఆవరించిన రాత్రికి మల్లే
నిరీక్షించడం ఆపని కలువలవుతాయ్
నువ్వేమో
చూపుల్లో ఊపుని దాచుకుని రాటుదేలిపోయాక
చెమరింపుల అభావాన్ని
దిక్కుతోచని మొహమాటంగా మార్చి
నీకేం చెప్పాలోనని ప్రయసపడతాయ్..
అయినా..
ఏకాంతంలో నిన్ను నింపుకున్న అమరిమితానందాన్ని
తమలో తామే ఏకాత్మగా పులకించేందుకు
ఒక్కోసారి మూసుకుంటేనే అవి బాగుంటాయ్.. 💜
// నీ కోసం 270 //
స గ మ ద ని స..
స ని ద మ గ స..
హిందోళ రాగాలాపన మొదలైందా
తడిగా నీ నవ్వు
పాడనీమరీ.. నేనూ చెమరిస్తే నువ్వు తాకాల్సి ఉంటుంది
ఈ ఊహలతో నావల్ల కాదు బాబూ..
వినో..ద..మో..హ.న.కర..
వచ్చినట్టే ఉంటుంది..ఇలా అయితే స్వరకల్పనెలా చేసేది
అబ్బా..అంతలేసి కళ్ళుపెట్టి ఆరా తీయకు
మనోధర్మ వైచిత్రి..
అనుసంధించాలని తానప్రక్రియను
ప్రయోగిస్తున్నా..
అవును.. నీకిష్టమైనంత లలితంగా ఉంటుందిది
ప్రతిపదంలో ప్రేమతత్వం ఉండాలంటావుగా
రెప్పలమాటు మేలిముసుగులోనే
ఎదురుచూపులు దాచి ఉంచు..
కురుస్తున్న మంచువర్షం..మత్తుని చల్లుతుంది కదా..
కలలు కలిసిన కలనేతల్లో
మనసు ఒదిగిపోయి చాలాసేపయ్యి..
Hmm..
ఈపూటకిదే నా కౌగిలనుకో..
కాసేపైతే నా సాధనా పూర్తయిపోతుంది 😌💜
// నీ కోసం 269 //
పగలంతా పని చేసుకోనివ్వక నావెనుకే ఉండి
విప్పార్చుకుని మరీ
కనుపాపల్లోకి చూస్తూ ఉంటావ్ కదా
నిశ్శబ్దంగా నన్ను చదివి నీకోసం రాసుకున్నట్టు
ఒక విరహగీతాన్ని రాసుకుని
నాకొదిలేసి.. ఇద్దరికీ చెరిసగమంటావు
రాత్రంతా వెన్నెల్లో విహరించినప్పుడు
అలవాటైన నీ గుండెచప్పుడు వింటూ
రెక్కల్లేకుండానే ఎగరగలనని తెలిసిపోయింది
ఆకులన్నీ గాలికి ఊగి రాలిపోతూ
ఏదో రహస్యాన్ని చెప్పి
మౌనంగా ఋతువుకి లొంగిపోవడం చూసాక..
ఈ కార్తీకదీపాల వెలుగులో
నీకోసమూ ఓ వాక్యం రాయాలనుకున్నాను
Ur Heart is a "feeling" to me n
Ur silence itself is d words to my Melody 🎶💜
// నీ కోసం 268 //
అన్నీ అమర్చుకుని పుట్టడమంటే
కొంత ఐశ్వర్యమూ, ఆరోగ్యమూ
మరికొంత అందమూ, అదృష్టమూ
అనుకుంటారందరూ
ఉదాత్తత, సౌశీల్యమూ సంగతి
ప్రస్తావించేదెవరు..
అల్పసంతోషులెక్కువగా తిరిగే లోకంలో
క్షణాలన్నీ కాలక్షేపాల వృత్తాలే
అద్భుతాల కోవలోని ఆత్మసౌందర్యపు రహస్యం
గుడ్డికన్నుల ముందరి కార్తీక దీపం
కొన్ని దైనందిన భావోద్వేగాల అస్తిమత్వమంతే
కాగితపు పువ్వుకి తమకమేంటని ప్రశ్నించేవారెందరో 😔
// నీ కోసం 267 //
మౌనాన్ని వదిలించుకున్న మనసు
చెవిలో చెప్పిన రహస్యం
సరికొత్త ఋతువై
ప్రపంచానికి పరిచయమవుదామని
విషాదానికి వీడ్కోలిచ్చేలా
రాయబారం నడిపిన కాలం
కలవరించిన కార్తీకాన్ని కన్నులకిచ్చింది
జీవితం పరాయిదయినా
హృదయం మాత్రం వ్యక్తిగతం
దీర్ఘశ్వాసతో దిగులు దించేసి
పెదవులబుట్టలో నవ్వులపూలు నింపేస్తాను
అవును..
లోపలంతా నువ్వు ఆకాశమయ్యాక
మేనంతా మేఘమై.. Self love అనివార్యమయ్యింది 💜 See Less
// నీ కోసం 266 //
నిద్దురను వెలేసిన చీకటివేళ
మనసుకి రెక్కలొచ్చినట్టు
నేనో విహంగమై ఊహల సరిహద్దుల్లో ఎగురుతుంటాను
సగం సగం నవ్వుతున్న పెదవుల్లో
పలరింపులున్నాయో లేవో వెతికేలోపే
అలసిపోయిన నేను అస్తిత్వాన్నీ కోల్పోతాను
దూరాల్ని దగ్గర చేస్తున్న మాయ
ఒక్క మాటలోనే ఓదార్చి పోయాక
నాకు నేనో ఆప్తవాక్యం రాసుకుంటాను
నిరంతరంగా ప్రవహించాలంటే
రోజూ వాన కురవనవసరం లేదని
లోలోని అనుభూతి తడిగా పరిమళిస్తుంది
పదాలతో పనిలేని మౌనం
చేపట్టిన క్షణాలను నెమరేస్తున్నప్పుడు
వేకువ కోసం తొందరేదీ లేదనిపిస్తుంది 🌸
// నీ కోసం 265 //
ఎంతగా దాక్కుంటావో తెలీదు
సూర్యచంద్రులు కూడా మబ్బుచాటుకి
అన్నిసార్లు పోతుండరు
వేకువప్పుడు తొందరపడి లేచి
ఉక్కిరిబిక్కిరయినట్టు అనిపించగానే
నీ కుశలాన్ని కనుక్కోవాలని
కళ్ళు తెరుస్తాను
ప్రపంచం పలకరింపులు మొదలెట్టి
వెలుతురులోకి నడవమనగానే
నువ్వు పంపే పువ్వులగాలి పీలుస్తూ
కాసేపటికి నెమ్మదిస్తాను
రాత్రంతా కలల్లోకి తొంగిచూస్తూ
ఎన్ని భావాలు చదివావో అడిగేలోపు
కవిత్వపు పుటలు మూసేసి
కాలం కన్ను కొట్టిందని వెళ్ళిపోతావ్
గోధూళి నింగికెగిసే వేళ
నిట్టూర్చుతూ నే నిలబడినా
ఏకాంతానికి రంగులద్దాలని
నిశ్శబ్దంగా నవ్వుతూ ఉండిపోతావ్
ఆశలతీరంలో నీ ఊసులనూహిస్తూ ఉండగానే
చిలిపి చుక్కల దుప్పటి కప్పేస్తూ
రెప్పలమీద మెత్తగా ముద్దుపెట్టి
బజ్జోమని చెప్పకనే చెప్పేస్తావ్ 😒
// నీ కోసం 264 //
A pretty sort of aching
వేకువ కదలికలకి వీస్తున్న చల్లనిగాలి
కరిగిన కుంకుమ కారణం నిలదీస్తూ
ఇక్కడిక్కడే తచ్చాడుతుంది
నిన్న కురిసిన కన్నీళ్ళలో
మిగిలిపోయిన మాటలు కరిగి
ఎద ఉప్పెనయ్యిందంటే వినదే
అడవిలా మారిన ఏకాంతం
క్షణాల మధ్య దూరం లెక్కిస్తూ
విషాదాన్ని వెతికి వేధిస్తుంటే
ఎంత గాయమవుతుందో ఏం చెప్పనూ
కోయిల పిలుపు కొమ్మలు దాటొచ్చినా
ఆలకించలేని అలసత్వం
ఊహలకు ఉరేసినంత మహాపాపం కదా
పాపం శమించేందుకు
పదాలన్నీ నెమలీకలవ్వాలేమో
అప్పటికైనా నీ నవ్వులు పురాగీతాలవుతాయేమో 😒
// నీ కోసం 263 //
ఈ చిరుగాలికింత తమకమెందుకో
ఏదో రకంగా తడమాలని
వెచ్చదనం కోసం పరితపిస్తున్న నన్ను కవ్విస్తుంది
ఈ చలికాలపు ఆరంభమే
కన్నుగీటుతూ మొదలయ్యిందంటే
నా ఏకాంతాన్నెంత వెంబడిస్తుందో
నీ పదాలు పెదవులపై అల్లుకునేలోపు
మెత్తగా రెప్పలుమూసి మరీ
వెన్నులో వణుకు పుట్టిస్తుంది
వేకువ క్షణాల చిక్కదనానికి
కౌగిలి దుప్పటిగా కప్పేసుకుంటాలే
యుగళగీతంలా నీ జ్ఞాపకముందిగా 💜💕
// నీ కోసం 262 //
తలుపుని తోసుకొని వచ్చేసే గాలిలా
ఆత్రంగా నా ఏకాంతాన్ని పగలగొట్టేందుకు
తలపులు తెరుచుకుని వచ్చేస్తావే
విప్పారిన రాత్రినంతా
చీకటి కనపడనంత గమ్మత్తుగా
నన్నంతా పరచుకునే లేత నీలాకాశమవుతావు
కోటిసీతాకోకల రంగు పులుముకొచ్చి
నీరవంగా నన్ను చదువుతూ
విరహాన్ని ఆవిరిచేసి ప్రేమ చిలకరిస్తావు
వేకువకంతా అలసిపోయిన నెలవంకలా
సగంసగం మబ్బు ముసుగేసుకుని
నిదురమ్మను కౌగిలించే పాపవవుతావు
నన్ను ముద్దుచేసిన ముచ్చటంతా
కలగంటావేమో
సిగ్గుపడి నీలోనే నువ్వుండిపోయి
నన్ను తప్పించుకు తిరుగుతావు
అదిగో..కాలం కదులుతుంది గుండ్రంగా 💜
// నీ కోసం 261 //
పోగొట్టుకున్న పాటలన్నీ ప్రాణంలోనే
దాగున్నాయేమో
ఇన్నాళ్ళూ అంధకారమనుకున్న లోకంలో
కొద్దికొద్దిగా వెన్నెల కురుస్తూంటే
నాలో..
ఆగిఆగి నులివెచ్చని నవ్వు మువ్వయ్యింది
నీ మౌనమో సమ్మోహన లహరిగా మారి
శరత్కాలపు సామగానమై
హృదయావస్థను కలస్వనం చేసినందుకే
కలమూ కాగితమూ లేకుండా
కళ్ళల్లో గుట్టుగా నువ్వు రాసుకున్న
నిశ్శబ్ద కవితనూ చదివించింది
మనోవనమాలీ
తప్పిపోవాలనో..తప్పించుకోవాలనో లేదిప్పుడు
నా కలవరపాటు పంచుకొనే..
ఈ పదహారణాల పసిడిపదాలు
నిన్ను చేరి పగడాలై రంగు తేలినప్పుడు 💜💕
// నీ కోసం 260 //
సంధి కుదరని సమయమంతా
స్వగతాన్ని స్మరిస్తున్నా
ఒక్క నవ్వూ తడమలేదు
చీకటి పడకుండానే
అనామక నిశ్శబ్దం మాత్రం
మనసు కిటికీ తెరుచుకునొచ్చేసింది
మబ్బుతునకలు రాగమాలిక
రాయమని వెంటబడుతున్నా
ఒక్క పదమూ ఒలకనంటుంది
ఆ వినీలాకాశపు సరిహద్దుల్లో
సాయింత్రపు లిపిని నేను ఆరాతీస్తున్న
సంగతి నీకు తెలిసుండదు
ప్చ్... నీ మౌనానికి
కాసిని మాటలొస్తే బాగుండేది
నాలో పసిదనం సందడి కోల్పోయేట్టుంది 😒😒
// నీ కోసం 259 //
నిలకడలేని క్షణాలు
మౌనంగా నిన్ను అనుసరిస్తూ
నాకర్ధం కాని సంగతులు పరిశీలిస్తున్నాయి తెలుసా
నీకూ నాకూ వంతెనేసేలా
ఆ ఓరచూపులు నాటుకున్న ఊహలు
నాకు కమ్మనిపాటగా చేర్చుతున్నాయని తెలీదా
నల్లమబ్బు నీలికురులలో
ఇన్ని కవితలు..
నువ్విచ్చిన పూలనే మాలకట్టానని తెలుస్తుందిగా
కనబడక కవ్విస్తూ లోలోన
ఏమి వల్లిస్తుంటావో
కొన్ని ఊసులు గంధంలా చెవిసోకాయి అచ్చంగా
అవునూ..
అనంతరాగాల గండుకోయిల నువ్వు
దూరమో దగ్గరో తెలీని ఆకాశం నువ్వు
శరన్మేఘంలో దోబూచులాడుతూ
నన్ను చూసి నవ్వే చందమామ నువ్వు 💜💕
// నీ కోసం 258 //
ఎదురుచూస్తూ చూస్తూ
మనసుకి కళ్ళు రావడం
చూపులు మసకబారి కలవరించడం
పిలిచిన పెదవికి..బదులు రాకపోవడం
అవును
చెప్పుకోలేని బెంగ..
ఇప్పుడు పదాలు తడుముకుంటుంది
నక్షత్రాలకీ సంగతి తెలిసి
నిలువలేక..అక్షరాలవుతామని ఆరాటపడ్డాయి
ఆత్మస్పృహ కోల్పోయేలోగా
రాత్రికిప్పుడే రంగేయకపోతే
పగటికి.. అవే విరహాలై నర్తిస్తాయి
ఓయ్..
మైమరపు కోసమని తొందరపడకు
నువ్వు కౌగిలికి చేయి చాచేలోపు
గుప్పెడు వెన్నెల కుమ్మరించి
నీకోసమో జోలపాట రాయనీ..
అప్పటికి నీకూ తెలుస్తుందిగా
నీ ఆనందానికి బహువచనం ఒకటుందని 💜💕
// నీ కోసం 257 //
పరిసరాలన్నీ నిశ్శబ్దంగా పరిమళించడం
హృదయంలో నువ్వు చేసిన
కావ్యగానపు పంక్తులదేనా
అలసిపోని తలపులతో పులకరించే నువ్వు
నిజంగా నీలిమబ్బులను దాటే
విహారానికి నన్ను పిలిచావా
మరైతే నా మందస్మిత మధురిమని
కాస్త సరిచూసుకోనివ్వు
కొన్ని మువ్వలూ..కొన్ని అలలు
వెంటేసుకొస్తే నీకూ ఇష్టమేగా
అయితే నీ అల్లరి రాసేందుకు
నాకు అనుమతినివ్వాలి
క్షణక్షణం ఆసువుగా పుట్టుకొచ్చే పాటలన్నీ
మనం పాడుకోవాలి
సరేనంటే పదపోదాం..
పల్లకీనో..పడవ కారునో సిద్ధం చెయ్యి మరి..😉😍
// నీ కోసం 256 //
U r my definition of Smile
హృదయం నుండీ వెలువడ్డ
ఆ చూపుల్లో దయ
యుగాల నైరాశ్యాన్ని చెరిపేస్తుంది
U r my definition of Warmth
దారితప్పింది ఏకాంతంలోనే అయినా
ఆ నులివేడి ఊపిరిలో వేణువులూది
చలిపొద్దుల్లోనూ స్వేదాన్ని పరిమళిస్తుంది
U r my definition of Music
అల్లంత దూరన్నుంచే అణువణువూ విస్తరించిన
ఆ ప్రేమాతత్వం నీలమై నిఖిలమై
మోయలేని హాయిని జోలపాట పాడుతుంది
U r my definition of Poetry
పరువం కలవరించిన ముద్దుమరకలతో
ఆ పెదవి తాకిన మేరంతా
దేహమో వానాకాలానికి ఒణికే తీగవుతుంది
U r my definition of Dream
రెప్పలకిటికీలు మూసుకున్న వేళ
ఆ కన్నులు పోగేసుకున్న మెరుపుకల
నా వేకువ ప్రణయకావ్య దృశ్యమవుతుంది
Last..but not least..
U r my definition of Paradise
మౌనంగా మోహరించే సాంబ్రాణిపొగలా
ఆ అరచేతి వెన్నెల వెన్నునిమిరి
సందిలిలో తనివితీర్చే మురిపెమవుతుంది 💜💕
// నీ కోసం 255 //
కనుపాపల్లోకి తొంగిచూసి నవ్వలేదేమో
నువ్వున్న కలను హత్తుకునేందుకు ఆశపడ్డ
నయనం అరమోడ్పులోనే ఆగిపోయింది..
అలల అందం తీరానికి మురిపెమన్న సంగతి
సముద్రానికి తెలిసినట్టు
నీ సమక్షంలోని నా హృదయాలాపన
నీకూ తెలుసుగా. .
మరైతే
ఆకాశపు అంచుల వెంబడి వానచినుకులు
నన్ను దాటి ఆవిరైన భావతరంగాలదని తెలియనిదా
ప్చ్..
విషాదానికి దగ్గర బంధుననేమో
ఏ ఆనందమూ దరిచేరకుంది
Yeah..I know..u r an aloof,
But u being with me forever..
is an illusion..
Hope this pain b dissolved Soon 🌻
// నీ కోసం 254 //
మది తలుపులు మూసి
పెంచుకున్న ప్రేమవనానికి
ఊహల ఆధారం.. ఊపిరి సమానం
అంతరంగపు అరల్లో
తాదాత్మ్యం ఎక్కడ నిక్షిప్తమయ్యిందో
లేతపచ్చని చిరునవ్వుకి తెలిసుండాలి
వినువీధుల గుండా
చుక్కల తోరణాన్ని అనుసరించి
ఎన్నిరాత్రుల ప్రయాణం చేసున్నావో మరి..
లేదంటే..
నా మనసు కొమ్మకు పూసే పువ్వుల
బంగారు కాంతులు
నడిరేయి పరిమళించడం నీకెలా తెలుసూ
కలవరపడ్డ ఋతుపవనం
నిద్దురలోని నన్నూ పొలమార్చిందని..
శరత్సుగంధాన్ని ఆరా తీసావా
అలా కాక...
ఓ అరక్షణం అరచేతిని కౌగిలించి
ఆత్మీయస్పర్శను వెచ్చబెట్టావా 💜
// నీ కోసం 253 //
కురుస్తున్న చినుకులకే
గుండెల్లో చెలరేగిన అల
అంతులేని దిగులు.. నీలపురాగం
ఊహలు మీటుతూండగా
తీగలు తెగిన వైరాగ్యం
తడిచి ఒణుకుతున్న మనోభావం
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే
మధురమైన పాటలా
మనసుకి నువ్వో వ్యసనం
ఎప్పుడేం చేయాలో తెలీక
దిక్కులు చూస్తున్న చూపులతో
పూర్తిగా మరిచింది పదకోశం
అయ్యో..
ఇప్పుడేం రాయాలో కొంచెం చెప్పు
నీకోసమే మరి..ఓ కవిత రాయాలనుంది 😌
// నీ కోసం 252 //
ఒంపులు తిరిగిన పెదవుల్లో
అవధులు దాటిన నవ్వు
మదిలో పూలవనాలున్నట్టు అనంతమయ్యింది
చిరుగాలి మోసుకొస్తున్న పలకరింపుకేమో
మౌనం దూరమై మాటలు మొదలైనట్టు
ఆనందం వెనుదిరిగి చూసే వేళయ్యింది
చుక్కల్లో ఆగమ్యమైన చూపు
ఒక్కో భావాన్నీ పోగేస్తుంటే
నీ హృదయాభినందనల లెక్కయ్యింది
మనసు చురుక్కుమనేలా
నా ఊపిరిలో అడ్డుపడి పొలమార్చాక
కాగితం కురిసి ఎన్ని కవితలవుతాయో
చూడాలనుంది..💜💕
// నీ కోసం 251 //
ఎక్కడో ఆరంభమైన చూపు
అడుగుల్ని కొలవడం మర్చిపోతుంది
ఉన్నపళంగా కలలన్నీ నిషాదాన్ని
మొదలెట్టినట్టు
మనసు నిండా కురిసిన వానకి
చీకటి సముద్రమై భయపెడుతుంది
పొద్దుపొడవని సమయం
పోగేసుకున్న పదాలన్నీ
నిషిద్దాక్షరాలై ఎదురవడం
అవుననలేని అబద్దమెందుకో తెలీదు
అయినా
మూసిన కనురెప్పలకూ
ఈ కవిత్వం పిచ్చేమిటో 😒😱
// నీ కోసం 250 //
హృదయం తప్పిపోయిన ఏకాంతంలో
శరత్పున్నమి జాబిలి పగలే విచ్చేసిన రోజు
వలసపోయిన ప్రాణాన్ని ఎక్కడని వెతకాలో మరి..
ఎన్ని రాగాల పరిమళాలు జోలపాడినా
ఈ రేయి నిదురన్నది వచ్చేట్టు లేదు..
వెన్నెల్లో తడుస్తున్న ఆకులకూ
నాలాగే ఊపిరాడనట్టుందేమో
స్వగతంలో పాడుతూ.. తడబడుతూ
కొన్ని క్షణాల రెపరెపలు..పూలగంధం పూసినట్టు
ఇక్కడేవో పన్నీటి మరకలు
మూసిన రెప్పల వెనుక వెచ్చదనం
పెదవికేం తీపినద్దిందో,
దూరాన్ని తలచొద్దని చల్లగాలి గుసగుసలోపక్క
Hmm..
చానాళ్ళకి కురుస్తుందిగా జలపాతం
తలపులతో సంగమిస్తానంటే కాదనేదేముందిలే..💜💕
// నీ కోసం 249 //
Heart beat..Heart beat..
Speeding up..
మౌనంగా పులకిస్తున్న కళ్ళు
ముత్యాలై రాలితే
కదంతొక్కుతూ క్షణానికో నవ్వు
రంగు రంగు పువ్వులు పూయిస్తున్నట్టుంది..
మనసు దాచుకున్న మాటల అందం
మంచు వర్షానికి సమానమేమో
వెన్నులో వెచ్చని ప్రవాహం
మెలికలు తిరుగుతూ కదులుతున్నట్లుంది
రాగాల గొంతులో అనురాగరసం పొంగినప్పుడల్లా
గుండె పొలమారి స్వరమాగుతుందంటే
పంచమాన్ని అనుసరిస్తున్న నువ్వు
గమ్యంలో నన్ను కలుస్తున్నట్లుంది
నిజంగా..
మదిలోకి సముద్రమెప్పుడు చేరిందో తెలీనేలేదు
ఈ కెరటాల సవ్వడి మాత్రం నన్నూయలూపుతూంది..💜💕
// నీ కోసం 248 //
కలల కోసం కాచుకున్నట్టుంది నా పని
రేయయినా నిదుర జాడలేని
ఏకాంతంలో..
లెక్కించేందుకు చుక్కలు కరువైన ఆకాశం
శూన్యాన్ని పెనుగులాడుతున్న సమయం
నువ్వనని మాటలు
కడవలకొద్దీ వాన చినుకులై
కన్నుల్లో తడి గుబుళ్ళు కురిసింది కాక
కవిత్వం మీద బెంగపడ్డ కాగితాలన్నింటినీ
పడవలుగా మార్చేస్తుంది ..
రవ్వంత తీపి మైమరపు అంచుల్లో
కలవరం తరంగమై
కళతప్పిన నిశీధిని మోయలేని విషాదం
నాకసలే పరిచయంలేని మౌనమై
చిరునవ్వుని మాయం చేసేస్తుంది
సుదూరపు మబ్బుల్లో
ఆగి ఆగి మెరుస్తున్న విద్యుల్లత మాత్రమే
నన్ను పలకరిస్తున్న సవ్వడిగా
ఇదొకటే మదికి పరమానందమై
జ్ఞాపకాల నెమరువేతలో
మానసిక తపనలు కలబోస్తుంది 😒
Subscribe to:
Posts (Atom)