Sunday, 27 December 2020

// నీ కోసం 228 //

ఎవరో వెనుక నుంచీ వచ్చి రెప్పలమీదుగా కన్నులు మూస్తారు. ఇటు తిరిగి నులుముకునేలోపే లేతపచ్చి ఆకంత మెత్తగా ముద్దుపెడతారు. అప్పటికప్పుడే చిగురించినట్టయ్యే దేహం, మావిచిగురు రంగులోకి మారి, అనుభూతి నింపుకున్నంత బరువెక్కుతుంది. మాటల్లేకుండా చిరునవ్వుల పుప్పొడి చల్లడం నీకు కాక మరెవరికి చేతనవును..?! ఆహ్లాదం ఊపిరి పోసుకునే వేళ, క్షణాల కలవరం సుదీర్ఘ వాక్యంలా మొదలవుతుంది. ఊహలో బ్రతికి ఉన్నట్టుగా కలిగిన పరవశం నిజమైనదేమోననిపిస్తుంది. పున్నాగు చెట్టు కింద సాయంకాలపు నీడలో నీ స్మృతి పరిమళించి, చిన్న వానతుంపరగా ఎదలో ఆనందం అత్తరు పదాల వసంతమై గుభాళిస్తుంది. రాసుకున్న పాటలన్నీ మోహనగీతాలే అయితే, గుండెల్లో అలలా విరుచుకుపడే ప్రేమ తడిపిగానీ ఆవిరవక, వేళ్ళకొసలు ముడేస్తూ పాడుకుంటుంది..దిక్కులు దాటి ఎగిరేంత వివశత్వం పోగేసుకున్న రాత్రులల్లా కొంటె కలల అల్లరిది. ఓసారలా పక్కనొచ్చి కూర్చో రాదూ..ఈ పిచ్చికి కారణం నీకేమైనా తెలుసేమో అడగాలి 😉

No comments:

Post a Comment