Sunday, 27 December 2020

// నీ కోసం 212 //

నువ్వేదైనా మాట్లాడితే బాగుండని ఎదురుచూస్తాను శుభోదయమూ, శుభరాత్రి తప్ప మరేం లేనట్టు నువ్వుంటే.. నాకిక్కడ చలికాలం మొదలయ్యిందని చెప్పాలనుకుంటాను వసంతమెప్పుడో తరలిపోయినా కోయిలను అనుకరించేలా పిట్టలు పాటలు పాడుతున్నాయని.. రేయంతా నిద్దురలేక ఎరుపెక్కే కళ్ళు అనూహ్యంగా రెప్పలు తెరిచి ఆ మాధుర్యంలో మమేకమవుతూ కంటిపాపలో నిన్ను తడుముకుంటానని నందివర్ధనాలతో నీ గురించే ముచ్చటిస్తానని తెలపాలనుకుంటాను నీ మౌనానికి మాటలు కూర్చుతూనో ఆ చిరునవ్వుకి ఉపమానం వెతుకుతూనో పొందికగా కవనానికి నిన్నెలా అంటుకట్టాలనో ఊహిస్తూ అలసిపోతున్నానని ఓసారొచ్చి నిరీక్షణ అంతం చేయమని అడగాలనుకుంటాను.. సాయింత్రానికంతా శివరంజనిరాగం దరిచేరకుండా మధ్యమావతి మొదలెట్టి మోహనరాగంలో నీ తలపు తపనలు చేర్చి స్వరసమ్మేళనాన్ని ముగిస్తానని నివేదించాలనుకుంటాను ఇప్పటికైతే...నా అంతరంగం స్రవించినంత మేరా ఊదారంగు రంగవల్లులు చుక్కలు మాత్రమే మిగిలిన చీకటిలోనైనా ఓసారలా మైమురిపించు కలైతేనేమి..నువ్వు కనికరిస్తే అదే కలనాదమనుకుంటా ☺️

No comments:

Post a Comment