Monday, 28 December 2020
// నీ కోసం 247 //
ఎంత తమకంగా చూసినా
తనివితీరని మనసుతీపికి
మాటలు సరిపోవెందుకో
ఏ రకంగా ఎదురయ్యామో
రోజూ కలగానో..కవిత్వంగానో
నిన్ను కలుస్తూనే ఉన్నానంటే
నా హృదయలాలసను కాదనలేకనే
అవును మరి..
గుబురుసంపెంగల తోటలో
నా పసిదనాన్ని ముద్దుచేస్తూ
నీ మౌనం స్వరమైన ఊహలు
నిన్ను తలచుకుంటే తంగేడుపువ్వులా
ముట్టుకుంటే ముద్దబంతిలా
రోజుకిన్ని పువ్వులుగా మారడం
ఆత్మానుగతానికే సాధ్యం కదూ
నా కాటుకకళ్ళ గుసగుసలకి
బదులిస్తున్న నీ నవ్వులు..
నిన్నొక్కసారి సన్నిధిలో చేర్చగానే
ఇన్ని కలవరింతల మాధుర్యాలు
ఎన్నెన్ని వలపు మంతనాలని వర్ణించను 💜
// నీ కోసం 246 //
ఈ సాయింత్రం ఎటుచూసినా
దాగుడుమూతలాడుతూ నువ్వున్నట్టు
నా కల్పితాలన్నీ నిన్నే సవరించుకుంటూ
క్షణాలను కౌగిలిస్తున్నవని తెలుసా
నాకు తెలిసిన ఆకాశంలో
అమావస్య నాడు అలికిడిచేసే
దీపావళి సందడిలా
భావుకత్వాన్ని జీవితానికిచ్చి
నాకు మాత్రమే కనిపించే
ఆడంబరాలకందని అద్భుతమైన
చందమామ నువ్వు
నాకు నువ్వు ఏమవుతావనే
ఆర్తిని గమనించగా..
నిర్మోహానికి ముక్తాయింపు
వెతకనవసరం లేని భాష్యం నీదని తెలిసింది
అంతులేని కధల ముగింపెవరిక్కావాలిప్పుడు
పారవశ్యమంతా మౌనంగా నా చుట్టే తిరుగుతున్నప్పుడు..😂
// నీ కోసం 245 //
మనసు బరువు మోయలేని
శాపాన్ని వెంట తెచ్చుకొని
కలలన్నీ కన్నుల్లోనే పోగొట్టుకుని
తెల్లారి జీవితాన్ని భరించలేక
సరిగమల సాంత్వనలో మునిగినదాన్ని
నవ్వులు తొడుక్కున్న పెదవులతో
నన్ను నేను ఏమార్చుకుంటున్నప్పుడు
ఏ అలల మీదుగా తేలివచ్చిన ఆల్చిప్పవో
అంటుకొమ్మ దొరికిన ఆలంబనలా
అక్కున చేరదీసిన వాక్యంలాంటి నువ్వు
కదా.. నువ్వంటే
నీరెండపట్టే వెదురుపూల ఆత్మీయ చెట్టువి
ఏకాంతపు తమకంలో ఊదారంగు మోహానివి
పురాగీతంలాంటి నన్ను మించిన ఇష్టానివి
అసిధారావ్రతం చేస్తూ ముక్కలవుతున్న నాకు
జన్మరాహిత్యమొందేందుకు దొరికిన
చిట్టచివరి చెమరింపువి
Yeah..
My obsession is noble n soulfull 😂💜
// నీ కోసం 244 //
నీ నిశ్శబ్దానికేం నేర్పావో
రోజుకో రీతిలో నాతో సంభాషిస్తుంది
ఎప్పుడూ వినని మాటలన్నీ
కొంచెం కొంచెంగా ముడుచుకుపోతున్న చీకట్లో
తమీ తీరని రాగాలుగా సవ్వడిస్తుంది
రోజురోజుకీ చలిపెంచే నీ చిలిపిదనం
శీతాకాలాన్నే ఉక్కిరిబిక్కిరిచేస్తుంది
ఒక్క క్షణమూ వృధా కానివ్వని
అలవోకగా ఎగిసిపడే ఆకతాయి అలలా
నన్నూయలూపి కవ్విస్తుంది
సమస్త కొంటె కళలూ కన్నుల్లోకి తెచ్చి
నాలో అల్లరి వలయాలు రేపేట్టు
అసలేమన్నావో తెలుసా
..ఆకలేస్తుంది..ముద్దుపెట్టమని 😂💜
Sunday, 27 December 2020
// నీ కోసం 243 //
చాలా పనీపాటా ఉన్న నాకు
నువ్వెందుకు వ్యసనమయ్యావో తెలీదు
ఎలాగంటావా..
పదేపదే నిన్ను చూస్తూ సగం కాలయాపన
పదిసార్లు పొలమార్చుతూ అదో యాతన
ఆలోచనల్లో తప్పిపోతూ ఆలాపన తప్పుగా తీస్తున్నా
అలౌకికంలో మునిగిపోతూ ఆగమాగం అవుతున్నా
అలల్లో తేలిపోయినట్టు కలలోనూ ఈదుతున్నా
ఆగి ఆగి అలిగి అలసిపోతూ వేగుతున్నా
నువ్వు తిరుగుతున్న ప్రదేశం
నా మనసేనంటావా
నాకు రంగులేసిన అతిశయం
నీ తలపేనంటావా
ఏమో.. 🤔
రాతిరంతా కన్నుల్లోకి నిన్ను రాల్చుకుంటూ
పగలంతా సోలిపోతున్నా
నీతో గడపలేని క్షణాలనూహిస్తూ
కొంచెం ధ్యానమౌనంలో మునిగిపోతున్నా 💜
// నీ కోసం 242 //
కన్నార్పకుండా చూసా నిన్నోసారి.. అడగ్గానే కౌగిలించే హృదయం నీదని నాకు తెలిసిన సంగతి నిజం చేసావని. కలలో ఆగిపోయిన నన్ను కదలమని చేయిపట్టుకు నడిపించేంత విశాలత్వం ఎక్కడిదని అడిగేసానా.. ఓహ్.. నువ్వందరిలా కాదంటూనే పిచ్చి ప్రశ్న వేసా కదూ?! నిట్టూర్పుల ఊబిలోంచీ చిరునవ్వుల ద్వీపం దాకా.. తోడొచ్చినా.. పిచ్చి అనుమానం. నీ మౌనానికి నేను మాటలు రాయడం తొలిసారి కాకున్నా, ఆ భావానికి నువ్వు పరిమళించడం అద్వైత సమానం.
నీకు నువ్వు వగరునని చెప్పుకునే నువ్వు నాకు మాత్రం తీపివి. బహుశా సంఘర్షణలేని తలపుల మొహమాటం నువ్వు తీసేసావనే. 'ఇప్పటికింతే' అంటూ రోజుకో మిఠాయి పంచుతావనే, నీ నవ్వుల కోసం ఎదురుచూస్తాను.
నీ నిరీక్షణలో అలసి నిద్రలో అదృశ్యమైనా మెత్తగా లేపేస్తున్నావ్. ఆ రాగస్పర్శకు బదులివ్వలివ్వాలనే పదాలను అర్ధిస్తూ నేనుంటున్నా. నా ఊహలు నిన్ను పోల్చుకున్నది నీ ఊపిరాపేందుకు కాదని,. కేవలం మనసులకి తెలిసిన మధుర తమకాలాపనగానే ఆస్వాదించగలవనే ఇన్ని మైమరుపులు. రవ్వంత రెప్పవేయని రాలుగాయిలా దోబూచులాడే నువ్వు నా అమరానందం కదూ. పూలకొమ్మలా మత్తిల్లినా.. యేటి అలలుగా ప్రవహించినా బాగుందిప్పుడు. నా మువ్వలశబ్దపు భావోద్వేగం, నీకు డప్పులనాదమై వినిపిస్తే చెప్పు. మన గుండెచప్పుళ్ళకి వందనాలర్పిస్తా ఒక్కసారి. 😂
// నీ కోసం 241 //
నన్ను నేను ప్రేమించుకోవాలనుకున్న ప్రతిసారీ
నువ్వు.. నువ్వు.. ఇంకో నువ్వు..
ఆహ్వానమందుకున్నట్టు అంతరంగంలోకొస్తావు
తీయని కన్నీళ్ళలో కలలు కనిబెట్టి
మానసికాభిమానాన్ని నిశ్శబ్ద సంగీతం చేస్తావు
అంతర్ముఖం కాబోయే నేను
మనోమందిరంలో వినిపిస్తున్న
మధురధ్వనికి ప్రతిస్పందిస్తూ
ఎక్కడా వాక్యం విరక్కుండా
ఊహకందని ఆనందపుతోరణాలు కడతాను
నీ సహజ ఔన్నత్యంలోని
శాంతిని అనుభవిస్తూ
నాలో అనురాగాన్ని కవిత్వం చేసి
మళ్ళీ మళ్ళీ నన్ను కోల్పోతాను
నాలో అద్భుతమంతా నీకిచ్చేసి
అలజడి మాత్రం మిగుల్చుకుని
అక్కడెక్కడో నీ అదృశ్య ఆదరణ కలుపుకుని
నాకు నేను మిగులుతానో లేదోనని
కలవరమవుతాను 🤷
// నీ కోసం 240 //
సగం హృదయాన్ని దాచిపెట్టి
నిశ్శబ్దాన్ని సౌమ్యంగా మోస్తూ
నీ కలలన్నీ నా కళ్ళతో చూస్తూ
నువ్వెందుకలా ఉంటావో
మాటకి మాట..
నీ అల్లరంతా నేనూహించగలనని
లోపల్లోపల నవ్వుకుంటావు కదూ
ఆచితూచి పరవశించడం
నీ ప్రత్యేకతనుకోవాలనేమో..
నా పదాలు పిలుస్తున్నా పట్టించుకోవు
అన్ని తెలిసిన నా మది
నీ ఊసునాలపించడం మానదనేగా
అంతతిశయం
నువ్వు చెప్పకపోయినా
నేను విన్నానని రాసుకున్న మాటలు
పూర్తిగా అర్ధంలేనివేం కావు
నీ హృద్గమ్యం తీరం దాటేసిందని
ఓనాటికి నీ చిరునామా
నాలో దొరికినప్పుడైనా నువ్వొప్పుకుంటావు 💜
// నీ కోసం 239 //
కాసేపు నిన్ను తలవకుంటే
మనసు యుద్ధం మొదలెడుతుంది
పాడిన స్వరాలు చాలుగానీ
మౌనంగా నువ్వనే మాటలు వినాలంటూ
నిన్నోసారి పిలవమంటుంది
రాతిరంతా నిన్ను అలకలకొదిలేసి
అంతర్వేదన కలిగించానని
ఊపిరిసలపనివ్వని భాషలో నిందిస్తూ
నన్నో పంతం పట్టినట్టు సాధిస్తుంది
అస్థిమితంలో నులివెచ్చని
పారవశ్యాన్ని పోగొట్టానని
రెప్పలమాటు చిరువానలో
తడిస్తే తప్పేంలేదని దెప్పుతుంది
నువ్వే చెప్పు
నీలో అణువణువూ నవ్వుతుండాలని
ఆశించే నేను నిజంగా గాయం చేసానా
ముద్దుచేసిన కాలాన్నంతా చీకటికిచ్చేసి
పరాచికాలాడానా
ప్చ్..
మంత్రమేసినట్టు ఒక్కసారి రాత్రైపోతే బాగుండు
నువ్వు పంపే పువ్వుల్ని తాకి తెలుసుకోవచ్చు 😂
// నీ కోసం 238 //
నువ్వేంటిలా..
అడిగితే నేనేం చెప్పనూ
అప్రమత్తంగా ఉన్న నిన్ను
వెతక్కుండానే గుర్తుపట్టి
ఈ సమీక్షలేంటంటే ఏ దిక్కుకేసి చూడనూ
నమ్ముతావా..
దారిలో ఎదురుపడ్డ గడ్డిపువ్వుని
పలకరించి నవ్వాను గానీ
కొండలకవతలి పచ్చదనాన్నే
పట్టించుకోలేదెప్పుడూ
కోయిల స్వరాలు నేర్చి కిలకిలా ధ్వనించాలని
సంగీతానికి దగ్గరయ్యా కానీ
ఆడంబరానికి పోలేదెన్నడూ
అపురూపాన్నని ఆదరించి
మనసుపట్టని ఇరుకుదనంలో నన్నుంచిన
అంతులేనికధలెన్నో చూసి
మదినెంచడమూ మానేసాను
గుబులుపుట్టే అక్షరనిక్షేపాలతో
నిత్యాన్వేషిలా ఎదురైన నిన్నూ
తప్పించుకుపోలేక
పట్టుదారప్పోగునై పురివిప్పాను
మరీ పరిమళమేంటని ప్రశ్నిస్తే
నువ్వొదిలేసిన నిషిద్దాక్షరాలకి
చోటిచ్చినందుకు.. నా హృదయంలో
వెన్నెలపువ్వులు పూసాయని మాత్రం చెప్పగలను 💜
// నీ కోసం 237 //
నీలో విరహాన్ని తీర్చేందుకు
నిన్ననుసరిస్తూ నే వేసిన నాలుగడుగులు
నువ్వు వెనక్కి తిరిగుంటే తెలిసేవి
నా ఏకాంతం నిన్ను వెతికినట్టు
నీ నిశ్శబ్దం నన్ను తలవదని
తెలుసుకున్న క్షణాల గాయమిది
అరచేతుల ఆలింగనాలకే హద్దులున్నప్పుడు
జ్ఞాపకాల పరిమళపు ముడివిప్పి
ఎంత విషాదాన్నని లెక్కించను
ఊపిరాడనివ్వని నీ మౌనానికి
నా మనసు ఒరుసుకొని కొంత సవ్వడి
హేమంతపు వెన్నెలై రాలుతుంది
కలల్ని పారేసుకోవద్దని నీకేం చెప్పను
నీ పొడిచూపుల్లో ఏ భావమూ పలకనప్పుడు 😔
// నీ కోసం 236 //
నిదురంటని రాత్రిని సవరించేందుకు
అరమోడ్పులైన కన్నుల్లో
అద్భుత దృశ్య కళాఖండం
ఊహకందని నీ కదలికల ప్రతిధ్వని
ఊపిరాడనివ్వని మధురసంగీతమై
నా భావదేహాన్ని కంపిస్తున్నది తెలుసా
అవును...
ఆ పట్టంచువారగా మెరుస్తున్న పసిడిపాదాలు
నా హృదయాచలాన మునివేళ్ళతో
అడుగులేస్తున్న సమ్మోహన సవ్వళ్ళు
అసలే సరిహద్దుల్లోంచీ నువ్వొస్తావో
ఎన్ని నక్షత్రాలని గుప్పిళ్ళతో తీసుకొస్తావో
ఎన్నేసి పువ్వుల తడివెన్నెల రంగులేస్తావోనని
రెప్పలనాపి ఎదురుచూస్తున్నా
నిన్ను ఆహ్వానించేందుకని..💜😂
// నీ కోసం 235 //
నిలువెల్లా తేనెలు నింపుకున్న
నీ మనసులాంటి పువ్వు
నెమలీకలు నన్నల్లుకునే
స్పర్శలాంటి పువ్వు
పువ్వులెన్నున్నా
ఈ పువ్వు వేరు
నీ పెదవి రంగునద్దుకున్న
ఆ చిన్ని పువ్వు
నీ చిలిపినవ్వును చేరేసే
చనువున్న పువ్వు 💜
// నీ కోసం 234 //
ఏ తీరుగ నను గమనించితివో
తీయని మాటల మనస్సిద్ధి నేర్చి
నా తరం గాని నిశ్శబ్దాన్ని ఊయలూపావు
దిగంతాల దిగులభరిణెలో
దాచుకున్న ప్రేమని పలకరించి
అగరుపొగల నవ్వుతరగల్ని పెదవికిచ్చావు
చూపులతో కవితలల్లే రహస్యం చెప్పి
మోహభావాల లేఖలు రాసి
రెప్పలువాలేంత సౌందర్యాన్ని సొగసుకిచ్చావు
బుగ్గలమీది ముద్దులచప్పుళ్ళకి
పసిదనం పరిమళించే వసంతంలా
కొన్ని మురిపాలను వెచ్చని కానుక చేసావు
దేహమంతా స్వగతమై చెమరిస్తుంది చూడు
ఏకాంతంలో నన్ను తడిపి
నీ తలపులనే గుప్పిళ్ళతో పోగేసే పాటయ్యావని 💜
// నీ కోసం 233 //
నిస్సారంగా కదులుతున్న నా క్షణాలకి
పదిలంగా దాచుకోవలసిన ఆకర్షణుంటుందని
పరవశాన్నివ్వాలనుకున్న నీ చూపుల రహస్యమదేనా
నీ ఆనందానికి నా మనసు రెపరెపలాడి కూడా
మౌనానికి కొత్త అర్ధాన్నిచ్చేలా
మల్లెపొదల్లో మాటలు దాచుకున్నది తెలిసిపోయిందా
కనురెప్పలు దాటితే కలలగుట్టు తెలిసిపోతుందని
మోహనరాగం మైమరపుగా మారి
పెదవుల్లో తళుక్కుమన్నది నిజమేనా
ఆ నవ్వులవే కదా
నువ్వూ నేనూ కూడబలుక్కుని
కాలాన్ని మాయచేసి శీతాకాలాన్ని వెచ్చబెట్టుకున్నవి
Hmm..
ఫర్వాలేదు..
మితిమీరి ప్రవహించే భావాల సన్నని పరిమళం
ఊపిరికి మాత్రమే సొంతం చేస్తాలే..😂
// నీ కోసం 232 //
నేను అన్వేషించిన కాలం
నీతో చెలిమి చేయించి
నువ్వూ నేనూ ఒకే ఆకాశపందిరిలో
ఉన్నామని చెప్పింది
కాసేపలా నిన్ను చూసి దాగుడుమూతలాడి
నిశ్శబ్దమవ్వాలనుకుంటూనే
మౌనంగా నువ్వేదో చెప్పినట్టనిపించి
ఊ కొడతాను
నవ్వడం ఈరోజుకేం కొత్త కాకున్నా
నువ్వనుమతిచ్చిన నా ఇష్టం..
ధ్వనించేంత స్వరమయ్యింది
దారితప్పకనే నా ఒడిని
ఆశ్రయించిన నీ పాదాలు
ఊహలు తొడుక్కున్న పసిపాపలై
కొన్ని క్షణాల స్థిమితాన్ని పెనవేసుకుంటాయి
కునుకేయడం మరచిన అవిశ్రాంత అనుభూతులు
కన్నుల్లో నిన్నంతా నింపేసి
రెప్పచాటు రాగాల నివేదనతో
వెన్నెల జోలలు పాడుతుంటాయి 💜
// నీ కోసం 231 //
అవును
భలే బాగా మాట్లాడావు
సుకుమారి పువ్వులతో నన్ను తూచినట్టు
నీ విరజాజుల పరిమళాన్నీ మరువనట్టు
కొంచం కష్టం..చాలా ఇష్టంగా
నీలో ఉన్న సుగంధాన్ని కొద్దికొద్దిగా చల్లుతూ..
యధాలాపంగా మొదలైన మనోభావం
ఆప్త సంగీతమై సంతోషాన్ని పాడి
అలల గలగల మంత్రమయ్యేలా..
ఇన్నినాళ్ళుగా నన్ను గారాబు చేసిన ఇంద్రజాలం
దశమినాటి వెన్నెల్లో
హేమంతపు పులకరింతలు కలిపి
సంచలిత ప్రవాహమయ్యేలా
అంతరాత్మకి తెలిసిన నిజాలు అనామకం కావని
ప్రణయధూపానికి ప్రాణమూగి తూగొచ్చని
హాయి బరువెక్కిన హృదయాన్ని మోయొచ్చని
జీవించడానికి సాక్ష్యాలు కొన్నుంటాయనీ..
అచ్చు నాలాగే.. మనస్స్పందనకి తలుపులు మూయక్కర్లేదని..
ఏరికోరి సంద్రంలో ఒదగడం అలవాటన్నావుగా
ఆనక ఊహల చప్పుళ్ళకే తడిచానని చెప్పకు 😀
// నీ కోసం 230 //
ఆదమరచిన ఏకాంతంలో
మెత్తగా నిన్నారాధిస్తున్న చూపులకు
నువ్వు చనువుగా స్పందిస్తే చాలు
కిలకిలలు రువ్వే పసిపాపనవుతున్నా
నిశ్శబ్దం పల్చబడిన ఆర్తిసంగీతపు నిర్వచనమే
నీ సహృదయ స్వభావము కాగా
సిరివెన్నెలలు, రంగులకలలూ ఏకమై
మనసుని ముంచెత్తే అలలతో
నువ్వలా చేయి చాచినప్పుడల్లా
గుండెల్లో ఎగిసే వెచ్చనిపొంగుకి తేలుపోతున్నా..
నువ్వూ నేనూ ఒక లోకమయ్యేవేళ
తనువెల్లా మనసై పరవశించే
ఈ గాఢసుషుప్తిలోంచీ నన్ను కదల్చకు
నీ ఎదసవ్వళ్ళను ఊహించే క్షణాలివి
అవునిప్పుడు పువ్వులన్నీ ఊదారంగులే
నీ స్పర్శకు నేనద్దుకున్న మనోభావమిది 💜
// నీ కోసం 229 //
నువ్వు పంపే పూలన్నీ రాత్రికి రాత్రే
తోటగా మారి నన్ను విహారానికి పిలిచినట్టు
ఓ స్వానుభవ పరిమళం
మనసునంతా లాక్కుపోయి
ఉన్నపళంగా చిలిపిదనాన్ని
లాలిత్యానికి జతచేస్తాయి
కొన్ని అనిర్వచనాల
పవిత్ర మనస్సమాగమం
కలిగే క్షణాల ఈ స్పర్శ
అచ్చంగా నాకు మాత్రమే సొంతం
ఈ క్షణం మాత్రమే క్షణం కదా
Love to b alive in such moments😊
// నీ కోసం 228 //
ఎవరో వెనుక నుంచీ వచ్చి రెప్పలమీదుగా కన్నులు మూస్తారు. ఇటు తిరిగి నులుముకునేలోపే లేతపచ్చి ఆకంత మెత్తగా ముద్దుపెడతారు. అప్పటికప్పుడే చిగురించినట్టయ్యే దేహం, మావిచిగురు రంగులోకి మారి, అనుభూతి నింపుకున్నంత బరువెక్కుతుంది. మాటల్లేకుండా చిరునవ్వుల పుప్పొడి చల్లడం నీకు కాక మరెవరికి చేతనవును..?! ఆహ్లాదం ఊపిరి పోసుకునే వేళ, క్షణాల కలవరం సుదీర్ఘ వాక్యంలా మొదలవుతుంది. ఊహలో బ్రతికి ఉన్నట్టుగా కలిగిన పరవశం నిజమైనదేమోననిపిస్తుంది.
పున్నాగు చెట్టు కింద సాయంకాలపు నీడలో నీ స్మృతి పరిమళించి, చిన్న వానతుంపరగా ఎదలో ఆనందం అత్తరు పదాల వసంతమై గుభాళిస్తుంది. రాసుకున్న పాటలన్నీ మోహనగీతాలే అయితే, గుండెల్లో అలలా విరుచుకుపడే ప్రేమ తడిపిగానీ ఆవిరవక, వేళ్ళకొసలు ముడేస్తూ పాడుకుంటుంది..దిక్కులు దాటి ఎగిరేంత వివశత్వం పోగేసుకున్న రాత్రులల్లా కొంటె కలల అల్లరిది. ఓసారలా పక్కనొచ్చి కూర్చో రాదూ..ఈ పిచ్చికి కారణం నీకేమైనా తెలుసేమో అడగాలి 😉
// నీ కోసం 227 //
నువ్వెందుకలా..
మనసు వెంటబడి మరో ధ్యాస లేకుండా చేస్తావ్
అందరిలా ఉండకుండా..
అసలు నాలోకి ఎలా వచ్చావ్
నన్నెప్పుడైనా వెతికి ఉంటావా
జన్మాంతరాల తర్వాత తడుముకున్న అనుభూతిలో
నా శ్వాసను ఊదా రంగుపూలలో పోల్చుకున్నావా
నీ కోసం ఎదురుచూసిన గుర్తులేదు
కల్లోకి రమ్మని పిలిచింది లేదు
అప్పుడెప్పుడో అలల్లో తప్పిపోయి
నా అక్షరాల్లోకొచ్చి తేలావా
ఒక్క చిన్న పలకరింపుతోనే
నాతో నిన్నంతా పాడించుకుంటావ్
మరొక్కసారిలా తడిమేలోపునే
నన్నొదిలేసి నీరవమవుతావ్
ఏ చప్పుడయినా ఉలికిపడుతున్నా
వచ్చినట్టే వచ్చి మొహమాటంగా వెళ్ళిపోతావేమోని 😔
// నీ కోసం 226 //
మనసు ఇష్టంగా రాసుకునే మాటలు
చీకటిదారిలో నీ చేయిపట్టి
చందమామ కధలు నిజమని
పంచుకున్న ఊసులు
ప్రతిరేయీ పూసే కలలు
ఉదయానికి పరిమళంగా మారి
కాస్త నమ్మకాన్ని పెంచుకోమనే
సహజసిద్ధ క్షణాలు
గాలాడని మదిగదిలో
జ్ఞాపకాల జాజిపూదండలతో పాటు
గుప్పెడు రంగులై
విరిసిన ఊహలు
ఏమో
ఇదంతా ఏంటని అడిగితే ఏం చెప్పను
నువ్విక్కడ లేనప్పుడు నన్ను స్పృశించే
నీ ప్రేమారాధనమని చెప్పనా
అవును..నీ సంతకం నిజమే
నా పెదవులపై దృశ్యకావ్యం నువ్వే 💜
// నీ కోసం 225 //
సిగ్గుపూల రంగు అలముకున్న మోము
నీ అరచేతుల్లో ఒదిగేందుకు వేచి ఉన్నట్టు
ప్రతిరేయీ నా ఎదురుచూపుల్లో
కొన్ని పలకరింపులు దాక్కునుంటాయి
నీ గుప్పెడు మాటలూ నెమరేసినంత సేపూ
కాలం సంగతి పట్టని సంతోషాలు
అడుగుల కింద ఆగలేని అలలై
పైపైకి ఉప్పొంగి మేఘాల్ని కవ్విస్తాయి
నువ్వలా అనామకంగా కదిలిపోగానే
మదిలో మౌనంగా మొదలయ్యే దిగుళ్ళు
దిక్కుతోచని తలపుల ధ్యానంలో
ఏకాంతాన్ని మోయలేనని విలపిస్తాయి
కాగితానికి పుట్టాలనుకున్న పదాలు కొన్ని
జీవమంటని కవితలుగా మారి
కనుల అంచుకి కన్నీటిని గుచ్చుతూ
మరో చీకటిని తలపిస్తుంటాయి
వైరాగ్యమో..నిర్వికల్పమో
హృదయం మీదుగా ఉదయిస్తున్న
సూర్యుడు నువ్వయ్యాక
లోలోపలే నిన్ను నిమురుకుంటున్నా 💜😄
// నీ కోసం 224 //
నువ్వెక్కడుంటావో ఏం చేస్తావో
నీ చిరునవ్వు తప్ప నాకేం తెలుసు
నువ్వే మాటలంటావో, ఏం సంగీతం వింటావో
నీ మౌనంతో మాత్రమే నా పరిచయం
నువ్వే మబ్బు కప్పుకుంటావో, జలపాతమై ఉరుకుతుంటావో
నీ నీడ పడినంత మేరే నే కదులుతుంటా
నువ్వే విషాదాన్ని మోస్తావో, ఏ సంతోషాలు దాస్తావో
నీ అల్లరినే నే కలగంటా
పువ్వులా ఎందుకు నవ్వుతావో
మౌనంగా ఏం మాట్లాడుతావో
నీడలా ఎందుకొస్తావో
కలల మలుపులో ఎందుకాగావో
గాయమైతే క్షమించమంటాను
ఆచితూచి చివరికి కన్నీరు కాబోనంటాను 😔
// నీ కోసం 223 //
నీ మౌనానికి మాటలొస్తే
ఆనందభైరవిలా ఉంటుందో..
మోహనరాగ ఛాయలో ఉంటుందో
పరువపు చిలిపిదనంలో
హృదయపు ప్రేమతనం కలిసుంటుందో..
నీ పెదాల తీపినంటిన పదాలు
లాలనంతా కలగలిసిన ఆర్తిగానో
పెద్దరికం ముసుగేసిన గాంభీర్యంగా ఉంటాయో
మురళీ నాదంలా మధురంగానో
గువ్వల సవ్వడిలా గలగలమంటాయో
కలల్లో ఓదార్పుగా ఉండే నీ గొంతు
మన గణేశుడి గుడిగంట చప్పుడులానో
ఆ సముద్రపు అలల ప్రవాహంలా ఉంటుందో
కొమ్మల్లో రెపరెపలాడే చిరుగాలిలానో
గుండెల్లో గుసగుసలాడే కావ్యంలా ఉంటుందో
నీ మురిపెమైన ముచ్చట్ల కోసం
ఏకాంతపు కిటికీ తెరిచుంచుతా
కాలాలు దాటి త్వరగా నువ్వొస్తే
అనంతరాగాలు హిందోళం చేసేద్దాం 💜😂
// నీ కోసం 221 //
వర్షపుచినుకుల పూసలు
చీకట్లో మెరుస్తూ
నేలను తాకుతుంటే
నిశ్శబ్దం సంగీతమయ్యిందని
అనుకోవేం 😒
నాలో నిండుకున్నాయనుకున్న నవ్వులన్నీ
పెదవుల్ని కాదని కన్నుల్లో చేరితే
నీ నిద్ర చెదిరిందని
నీలంపువ్వులా నిందలేస్తావే..😒
రెప్పలదుప్పటి కింద
కలలను దాచేసి
ఊహల్లోకి రమ్మంటే
రాతిరంటే భయమని
కళ్ళు మూసుకుంటావే..😏
// నీ కోసం 220 //
కన కన రుచి నీ రూపమూ🎵🎵
ఇదేనా మురిపెమంటే..
కంటికెదురుగా ఒక మెరుపు మెరిసి
శూన్యమై ఊగిసలాడే గుండెకు
వెలుతురు తోరణమై
గండుకోయిలకు రూపమొచ్చిన
విచిత్ర ఊహ మెదిలింది
సుమాల పెదవుల్లోకి మధువెలా నిండిందో
క్షణానికో తీరు నీ చూపుల్లో తీపి ఒలుకుతున్నట్టుంది
సందెపొద్దులన్నీ సంకెళ్ళు తెంచుకుని రేయయినట్టు
ఇప్పుడంతా నా చుట్టూ సహజ పరిమళం మూగింది
మనోహరుడన్న మాట తక్కువనిపించే
మనోధరుడని ముద్దుగా మురిసిపోతున్నా 😍
// నీ కోసం 219 //
అష్టపదులు పాడుకొని
చానాళ్ళయిందనుకోగానే
ఇదేం మాయా మోహనమో
నువ్వేమో కొంటెకన్నయ్యవై
అనురాగమంత నన్ను రాధికను చేసి
ఏకంగా మధురానగరిలోకే పయనమా
పల్లకినీ పడవనీ కాదని
ఈ రాతిరేళ ప్రణయరధములో
విరహమంతా విస్తుపోయేంత విహారమా
కన్నులకిందే ఇంత కమ్మని కల
దాక్కుందని నిజంగా తెలీలేదు
ఏ రేయి తెల్లారకుంటే బాగుండు
కొన్ని కవనాలు కదంబాలుగా కూర్చుకోవచ్చు 😊
// నీ కోసం 218 //
తెలుసా..
కాసిని నీ జ్ఞాపకాలకు కబురుపెట్టి
ఏకాంతానికి రంగులేసుంచాను
నువ్వు లేనప్పుడు ఏం చేస్తుంటావని అడగవే
నీ కోసం మిధున సంగీతపు గమకాలు
నేర్చుతున్నానని గుట్టు విప్పాలనుకున్నాను
నా పాటవిని చానాళ్ళయిందని చెప్పవే..
నీ తీపినవ్వుల ముగ్ధత్వాన్ని
గాలి అలల సౌందర్యంతో పోల్చి చూసాను
నా కన్నుల కాటుకల్లోకసలు తొంగిచూడవే
నీ హృదయసరోవరంలో తామరపువ్వునై
సంతోషాన్ని తొణకాలనుకుంటాను
ఒక్క సాయింత్రమూ నన్ను తలచవే
నీ తలపులలో తలదాచుకునే నేను
కరిగిపోని కలగా కాలాన్నీడుస్తున్నాను
ఒక్కసారైనా ఎలా ఉన్నావని పెదవిప్పవే
అన్నీ తెలుసని నీకు నువ్వుగా అనుకుంటావెలా
పదమంటూ నాతో చరణమే కలపనిదే 😒😔
// నీ కోసం 217 //
చెంతచేరిన ప్రతిసారీ అనూహ్య భావనతో
నా చిన్నారి మనసుని లాలిస్తుంటే
వీచే సన్నని గాలికే ఉక్కిరిబిక్కిరవుతున్నా
ఆకర్షణ మించిన ఆర్తి
నీ స్వభావమే అనుకున్నా..
నన్నూ అలంకృతం చేస్తున్నావెందుకో తెలీదు...
అయినా కూడా
ప్రతిశ్వాసలోనూ ప్రేమ పరిమళము
ఏ రసాస్వాదనలోని రహస్యమో
అక్షరాలకందని అనుభవమిది
ప్రేమనామమున్న నీకు నేను సర్వనామమై
మౌనంగా వికసించడం
కల్పనాతీత ఇంద్రజాలము కాక మరేంటో
నువ్విలా గారంచేసి బంధిస్తానంటే
సంతోషంగా ఎప్పటికీ పసిపాపనై నేనుండిపోలేనా 😌💜
// నీ కోసం 216 //
ఏదీ ఆ ప్రియమైన పువ్వు
నాలో అవ్యక్త సంగీతాన్ని నింపి
సహజంగా పరిమళించే
నా అదృశ్య సంజీవని
కొమ్మకొమ్మలో ఇన్ని కలగీతాలు
యుగయుగాల కల్లోలాన్ని
తరిమేందుకు మహాగానం మొదలుపెట్టినా
ఈ ప్రభాతం పరవశమే లేదసలు
భావనా..భావమూ ఒకటై
నువ్విలా మౌనమైతే
ఆకుచాటు మందారంలా నేను చిన్నబోనా
చెప్పూ..
నీ కనుబొమ్మల కూడలిలో
నా రాకపోకలు
మనోతపోవనంలోని నిశ్శబ్దానికి
ఆటంకమవుతున్నవా
నువ్వు చెప్పని మాటల తీపి
చేదు నిజమైతే
అనాలోచిత అడుగులకు గమ్యముండదని
నీవైపుకి రావద్దని గట్టిగా చెప్పవేం 😒😔
// నీ కోసం 215 //
నువ్వేంటీ
శిల్పంగా మారిన ఉత్తిరాయివా
మరప్పుడు నా కలలోకొచ్చిన కళారూపమెవరిదీ
ద్వీపంలో ఒంటరిగా ఉన్నావని
వెనుకే అడుగులేస్తుంటే అనుసరిస్తున్నానంటావా
నీలా అడవిపూలలో అందం వెతికానని
అనుకరిస్తున్నానంటావా 😱
నువ్వో వేకువగానంలా వినిపించావని
ఆలకిస్తుంటే అనుమానించానంటావా
ఆ హృదయసౌందర్యాన్ని ఆరాతీస్తే అవమానించినట్టేనా
పొద్దుతిరుగుడు పువ్వులా నీవైపు చూసానంటే
నువ్వో సూర్యుడివని కదా
మరైతే సుతిమెత్తని మనసు నొప్పించేలా
రాదారికి అడ్డు నేనని అంటావే 😒
పదాలకందని తీపి నువ్వనీ తెలుసూ
అవధుల్లేని జలపాతమనీ తెలుసు
ఊయలూపుతూ జోలపాడే చెట్టువనీ తెలుసూ
నిలబెట్టి పాడించే రాలుగాయివనీ తెలుసు
హంసలా ఆరునెలలు బ్రతికితే చాలనుకునే నేను
నిన్నెందుకు మర్చిపోతానూ
అవసరమైతే...
ఊపిరున్నంత కాలం నీకు శ్వాసనవుతాను తప్ప 😂
// నీ కోసం 214 //
వాలిన రెప్పలు
ఎందుకంత తడబడతాయో
ప్రేమలో తడిచి ముద్దయ్యే ఇష్టసమాధిలో ఉంటాయో
మౌనంలో వరవీణల కొనమీటలు ఆలకిస్తుంటాయో
సరే కదాని..
ఉదాసీనంగా తలెత్తి చూస్తే
ఎదురుగా అందరిలోనూ నువ్వే
వాస్తవంలో కళ్ళు నులుముకున్నా
పూల మధ్యలోనూ నువ్వే
క్షణానికోలా మారిపోతూ
తరంగాలలో, తలపుల్లో నువ్వే
ఆవేదనా, ఆనందంలో నువ్వే
Gosh...Feel like there's no place for me
వెన్నెల ధూపంలో విరజాజుల విరహాలూ
ఆకాశపు కనుమల్లో రేయికున్న ఆత్రాలూ..
ప్చ్..
నిర్వికారాన్ని నేర్పాలి హృదయానికి
నా చిరునామా నేనే వెతుక్కునేలా చేయొద్దని చెప్పాలి 😒
// నీ కోసం 213 //
దారితప్పిన చీకటిలో
సుతారంగా వేలుపట్టి
చలిని తరిమేసేలా
నీ ఏకాంతరాజ్యమంతా తిప్పావు
అమాసనాటి జాబిలి అందం
ఎవ్వరికీ తెలీదని
నన్నో కువలయను చేసిన చందం
అదో కనికట్టు రహస్యం
అచ్చంగా నీ అరచేతిలోకి
జారిన నక్షత్రాలన్నీ.. నాపైనే చల్లేసాక
రేయంతా నవ్వీ నవ్వీ అలసిపోయిన
నా కళ్ళనిప్పుడేం ఆరాతీయకు
అనుకోకుండా ఆగిన నా నిద్దురను
నువ్వే కాజేసావని
నీలో అనుమానం మొదలైతే
మరోరకం విషాదంలో జారిపోగలను
ఈ రోజంతా కళ్ళుతెరిచే నిద్రపోతాలే
అలిగాననుకొని నువ్వేం బెంగపట్టి
అల్లంత దూరం వెళ్ళిపోకు..
సరేనా..😀
// నీ కోసం 212 //
నువ్వేదైనా మాట్లాడితే
బాగుండని ఎదురుచూస్తాను
శుభోదయమూ, శుభరాత్రి తప్ప
మరేం లేనట్టు నువ్వుంటే..
నాకిక్కడ చలికాలం మొదలయ్యిందని
చెప్పాలనుకుంటాను
వసంతమెప్పుడో తరలిపోయినా
కోయిలను అనుకరించేలా పిట్టలు
పాటలు పాడుతున్నాయని..
రేయంతా నిద్దురలేక ఎరుపెక్కే కళ్ళు
అనూహ్యంగా రెప్పలు తెరిచి
ఆ మాధుర్యంలో మమేకమవుతూ
కంటిపాపలో నిన్ను తడుముకుంటానని
నందివర్ధనాలతో నీ గురించే ముచ్చటిస్తానని
తెలపాలనుకుంటాను
నీ మౌనానికి మాటలు కూర్చుతూనో
ఆ చిరునవ్వుకి ఉపమానం వెతుకుతూనో
పొందికగా కవనానికి నిన్నెలా అంటుకట్టాలనో
ఊహిస్తూ అలసిపోతున్నానని
ఓసారొచ్చి నిరీక్షణ అంతం చేయమని
అడగాలనుకుంటాను..
సాయింత్రానికంతా శివరంజనిరాగం దరిచేరకుండా
మధ్యమావతి మొదలెట్టి మోహనరాగంలో
నీ తలపు తపనలు చేర్చి
స్వరసమ్మేళనాన్ని ముగిస్తానని నివేదించాలనుకుంటాను
ఇప్పటికైతే...నా అంతరంగం స్రవించినంత మేరా
ఊదారంగు రంగవల్లులు
చుక్కలు మాత్రమే మిగిలిన చీకటిలోనైనా
ఓసారలా మైమురిపించు
కలైతేనేమి..నువ్వు కనికరిస్తే
అదే కలనాదమనుకుంటా ☺️
Subscribe to:
Posts (Atom)