నీకూ నాకూ మధ్య దూరం
రెండు కాలావధులుగా లెక్కగడితే
కాలాతీత విరహం
రెండు హృదయాల చేరువంత
గుండెలో నువ్వెలిగించుకున్న దీపానికి
వెన్నెల వెలుగే
వెలవెలబోయిందంటే నక్షత్రాలూ నిద్రించినట్టేనని
కొన్ని మన జ్ఞాపకాల మధురోహాలు
సంద్రాన్నే తీపి చేసినంత
మోహంలో ముంచెత్తుతామంటే వద్దనలేవుగా
నులివెచ్చని కన్నుల కోనేటిలో
నా బొమ్మే కవితై కూర్చుందంటే
మనకెప్పటికీ ఎడబాటు లేనట్టేనని
నీకు నువ్వు ఎన్ని లోకాల్లో తిరిగినా
రోజు ముగిసే సమయానికి
నా ఏకాంతాన్ని భగ్నం చేసేందుకొస్తావుగా
No comments:
Post a Comment