Sunday, 28 March 2021

// నీ కోసం 281 //

 కాలాన్ని కసురుకున్నంత సేపు పట్టలేదు

మనసు పారేసుకున్న క్షణాలు తిరిగొచ్చి
ఒడి నింపిన ఉద్వేగం నీకు తెలీదు కదా

ఇన్నాళ్ళూ కలలో కదిలిన చిరునవ్వు
నిలువెత్తు నిజమై ఎదురొస్తే
కుదురుగా ఉన్న కళ్ళు పన్నీరొలికాయనైనా తెలుసా

సాయింత్రమలా చెట్లను చూస్తుంటే
అలవాటుగా సాగిన ఆకుపాటల కచేరీలో
అన్నీ అందమైన పదాలే

అక్కడ సముద్రం ఉప్పొంగినందుకే
ఇక్కడ తీరం ఇష్టంగా తడిచిందని
ఇసుకపూల పరిమళం పలకరించి మరీ చెప్పింది

ఏం పంచిపెట్టావో నా అంతరంగానికి
మోహావేశపు తీపి ఎక్కువై పొలమారుతున్నా
మళ్ళీ మళ్ళీ నిన్నే తలవాలంటుంది 


No comments:

Post a Comment