జీవితపు విలువ తెలిసినవాడికి
రాత్రి చింపిరిదైనారంగుల కల దూరమనిపించదు
ఒక్కోమెట్టెక్కుతూ గుండెబరువు
దించుకునే ఆటలో
పాములు పడగెత్తినా
గొడుగులై కాపుతాయేమో
ముసురేసిన రోజున
పడమటకొండలకవతల వెలుతురుందని
చల్లగాలినీ వాడు ప్రేమిస్తాడు
వేకువకి ఆశల ఊయలెక్కేందుకు
కాలాన్ని కరగమని..
కొలిమిలోకి తొంగిచూసేవాడికి
నిట్టూర్పు సెగలో వేడి తెలియకపోవచ్చు
నిప్పుకణికల దేహపు నెత్తుటిచుక్కలు
మట్టిలో కలిసి మొలకలయ్యాక
ఆకాశం తనే అపరిచితాన్ని మరిచిపోతుంది
అప్పుడు
వాడి గుండె వెచ్చదనాన్ని
కావాలించేవారికి తెలిసిపోతుంది
ఎప్పటికీ ఆ బాహుసంకెల విడిచిపోరాదని
No comments:
Post a Comment