నేనో నిశ్శబ్దాన్ని..మాటలపై అలిగి అప్పుడప్పుడూ నిదానమైపోతుంటా. ఎన్నో భావాలూ, అనుభవాలూ, అనుభూతులూ క్షణం విరామం లేక మోస్తుంది నా గుండె. పైకంతా ఏదో కోపిష్టిగా కనిపిస్తున్న నేను నిజమైన నేను కాను. ఎన్నో మోసాలను క్షమిస్తూ మరెన్నో గాయాలను ఓర్చుకుంటూ మనసు కొంచం శిధిలమైనా..మరలా చిగురించేందుకు ప్రయత్నిస్తున్న మౌనాన్ని. జీవితపు ప్రయాణంలో పయనిస్తున్న ప్రతిసారీ ఎంతో ఏకాంతాన్ని ఎదుర్కుంటాను. తెలుసా అప్పుడంతా నీలో నేను శబ్దిస్తుంటాను. నీలో మరచిన అస్తిత్వాన్ని పలకరించేందుకు పైకి నిశ్శబ్దమవుతాను. నాకెటూ నన్ను తిరిగి తీసుకోవాలనే కాంక్షలేదు. నీలో సగమై నేనుప్పటి సమస్త జ్ఞాపకాలూ శబ్దిస్తుంటే.. అవి ఆలకించడమే నాకిష్టం...
కొన్నిరోజుల ఈ స్తబ్దత మరణసదృసమైనా..అల్లరిపరుగుల నీ అక్షరాల వెంట నా మనసు నిదురమాని మరీ వెంబడిస్తుంది. లోలోపల నీ మాటల్లో ఒలికిన అనుభూతులు గజిబిజి లాలిపాటగా వినబడుతున్నా రెప్పలు లయబద్దంగా నవ్వుతాయి తప్ప కలలను రమ్మనవు. మత్తుగా దాచుకున్న గుసగుసలన్నీ మెత్తగా పంచేందుకు చేస్తున్న నిరీక్షణ కొత్తజీవాన్ని నింపుతుంది నిజం..
No comments:
Post a Comment