Sunday, 28 March 2021

// నీ కోసం 303 //

 Sway a little dear

నీ ఊపిరిలో హెచ్చుతగ్గులు
లేత చలిగాలుల ఉద్వేగపూరితమైనవా
చూపుల అల్లిక కోసం
ఎదురుచూసే చకోరి తపస్సు
తత్తరపడి చెదిరిందేమో చూడు..
నీ కన్నుల్లో నవ్వులు
నిద్దురను దగ్గరకి రానీక మెరుస్తున్నవా
అనాలోచితమైన నీ అనుభూతి స్మృతిలో
తెలివెన్నెల బొమ్మలా
కలలో కదిలే కవ్వింతెవరిదో కనుగొను..
నీ నిశ్శబ్దంలో
అరనవ్వుల స్వరలయలు వినబడినవా
మనసుకవాటం తెరిచి
ఆత్మీయంగా ఆహ్వానమందించిన
నీకో అస్పష్టమైన వివశత్వాన్నిచ్చింది నిజమైతే..
అదంతా నేనే..
తరలిరాని వసంతం కోసం
హేమంతం కదిలొస్తున్న కోలాహలాన్ని విస్మయించు


// నీ కోసం 302 //

 తనంతే..

అందనంత దూరాన ఉన్నాడనుకునే లోపునే
ఎలా ఉన్నావని దగ్గరకొస్తాడు
రూపమంటూ లేకనే తన ఉనికి చాటే
పరిమళపు గమ్మత్తులా
తను ఎదురుపడ్డప్పటి కనికట్టుతోనే
కనురెప్పలకి కావ్యాలు నేర్పుతాడు
చీకటివెలుగుల సౌందర్యాన్నీ
పాలసంద్రపు వెన్నెల కెరటాల్నీ
పువ్వులాంటి సున్నితమైన మాటల్నీ
గుండెల్ని మెలిపెట్టే నిశ్శబ్దాన్ని
దాచుకున్నట్లు కనబడ్డా గానీ..
పలకరించే ప్రతిసారీ
కొంత ఆర్తినీ ఆనందాన్ని కలబోసి
నన్నో సమ్మోహనపు ఆహ్లాదికను చేస్తాడు
తనకు తనో తరంగంలా తిరుగుతున్నా
నా లోపలంతా అలౌకికంగా విస్తరించి
ఆత్మశాంతి అనుభవానికి ఆధారమయ్యాడు

// నీ కోసం 301 //

 ప్రశాంత సమయంలో అస్పష్టమైన పాటలా

నిశ్చల సరస్సులో జారిపడ్డ పువ్వులా
క్షణాల్లో నీవైపు తిప్పుకుంటావెలా..
కన్నెత్తి కలవరపడితే మబ్బేసిందని
నా ఊహాజనిత నిశ్శబ్దంలో నువ్వున్నావని
ఇప్పటికిప్పుడే కనిపెట్టేసావా..
వేసవి సాయంత్రానికి విచ్చే మల్లెపొదలా
నాచుట్టూ తిరిగే ఈ పరిమళం
నీదేనని చెప్పాలనుకున్నావా..
ఆగి ఆగి వినిపిస్తున్న హిందోళంలో
కువకువలాడుతున్న నీ కవితా రాగాలు
లోగొంతుకలో నే పాడినట్టు వినేసావా
మరైతే ఎలా తెలుసు.. ప్రాణం పోతుందని..
చూపులతోనే ఊపిరి పోస్తున్నట్టు కాక
మనోహరమైన ఆ నవ్వేంటి
చల్లగాలేసినట్టు ఉక్కిరిబిక్కిరవుతున్నా..
సగం సగం కౌగిలించడం కాస్తాపవా


// నీ కోసం 300 //

 ఆకులు రాల్చుతూ కూడా శిశిరం నవ్విందంటే

హేమంతాన్ని పూర్తిగా అనుభవించిందనీ
వసంతాన్ని ఆహ్వానించేందుకు సిద్ధపడుతుందనీ
తెలిసిన విషయాన్నే చెబుతున్నావనుకున్నా
కాలాతీత ప్రయాణాలు చేసి
అలసిపోయిన అంతరాత్మకు సందేశాలెందుకని
కలలు కనే కళ్ళను నవ్వులు కోల్పోనివ్వద్దని
అప్పుడే విడుదలైన సీతాకోకచిలుకతో అనిపించావే
ఆనందాన్ని వెంటేసుకు తిరుగుతున్నప్పుడు
కటకటాల్లేకుండా శిక్ష అనుభవించొద్దని
విషపు కొమ్మలను తాకనవసరం లేదని
నువ్వు చెప్పిన మాట నిజమనిపిస్తుంది
నీ పదము చిలికిన సమయం
మనసు గంధాలు చిమ్మడం తొలిసారి కాకున్నా
నన్ను ముంచెత్తే ఈ మహద్భాగ్యం
ఎప్పుడూ ఇష్టమేలే..


// నీ కోసం 299 //

 నీకూ నాకూ మధ్య దూరం

రెండు కాలావధులుగా లెక్కగడితే
కాలాతీత విరహం
రెండు హృదయాల చేరువంత
గుండెలో నువ్వెలిగించుకున్న దీపానికి
వెన్నెల వెలుగే
వెలవెలబోయిందంటే నక్షత్రాలూ నిద్రించినట్టేనని
కొన్ని మన జ్ఞాపకాల మధురోహాలు
సంద్రాన్నే తీపి చేసినంత
మోహంలో ముంచెత్తుతామంటే వద్దనలేవుగా
నులివెచ్చని కన్నుల కోనేటిలో
నా బొమ్మే కవితై కూర్చుందంటే
మనకెప్పటికీ ఎడబాటు లేనట్టేనని
నీకు నువ్వు ఎన్ని లోకాల్లో తిరిగినా
రోజు ముగిసే సమయానికి
నా ఏకాంతాన్ని భగ్నం చేసేందుకొస్తావుగా
అవును..
గుప్పుమనే సెంటుగులాబీ నీ రాక్షసి..
గుట్టుగా నీలో గుభాళిస్తుంది ఎప్పటికీ


// నీ కోసం 298 //

 కాలప్రవాహంలో పడి, మన హృదయాల దూరాన్నెప్పుడూ కొలవనేలేదు. ఇప్పుడు నన్ను తాకుతున్న నీలగిరి గాలుల నిషాలన్నీ నిన్నే ఆలపిస్తూ నా పెదవిని ఒదలనంటూ, ఎన్నెన్నో ఊహలు కలిగిస్తూ ఎంతో నచ్చేస్తున్నాయి.. మళ్ళీ మళ్ళీ ఇదే ఆనందం కావాలని ఉచ్ఛ్వాసలన్నీ ఒకటే కోరికను విన్నవిస్తున్నవని తెలుసా ?!

నీ చూపులను దాటి స్వప్నలోకపు సరిహద్దుల్లోకి వచ్చేసినట్టున్నా. నీలి నీలి పువ్వులూ, నేల రాలిన పువ్వులూ, అక్కడంతా నిశ్శబ్ద మాధురి. ముందుకెళ్తే, ఆకాశాన్ని అందుకోవచ్చనిపిస్తుంది. పోగొట్టుకున్నదేదో ఇక్కడ దొరికినట్టు.. నాకేమో తొలిసారి ఇటు అడుగేసినట్టుంది. నువ్వో ఒంటరిక్షణాల నిశాచరుడివని నీవైపుకే రాలేదే, ఎప్పుడన్నా కళ్ళతో నన్ను కౌగిలించుంటావా ?!
నీ గుండెపై తలవాల్చగానే, ఇంత విశాల ప్రపంచమూ కురచయిపోయి, ఏదో జ్ఞాపకం నీ ఉనికిగా మారినట్టు, సమస్త నిశ్శబ్దమూ ఓలలాడుతుంది. నా నవ్వులు కోలుకునేందుకే ఇలాంటి కలనిచ్చావా.. ఎదలొక్కటిగా కలిసి స్పందిస్తున్న ఈ రాతిరి కధేమిటో తెలిస్తే చెప్పవూ


// నీ కోసం 297 //

 కనిపించకుండా కదిలే గాలిలా

ఇక్కడిక్కడే ఉన్నట్టుంటావు
ఒంటరిగా ఏమాలోచిస్తానోనని
తలపులెక్కి కూర్చుంటావు
కాసేపలా మౌనంగా కూర్చోగానే
కల్పనై కన్నుల్లోకొచ్చేస్తావు
మనోద్వారానికి తోరణంలా
ఇష్టమైన పండుగని తలపిస్తావు
ఒక్క కవితనైనా రాద్దామనేగానే
వాక్యమై గలగలా నడిచొస్తావు
ఇప్పుడిక..
ఇందాకో, ఇప్పుడో గుర్తొచ్చావనేం చెప్పనూ
మర్చిపోయేంత అవకాశమే నువ్వు ఇవ్వనప్పుడు


// నీ కోసం 296 //

 నీ జీవితంలో పులకరించిన క్షణాలన్నీ

నా జ్ఞాపకాల సౌందర్యానివేనని తెలిసి
నువ్వెదురు చూసిన బెంగకి బహుమతిగా
ఎదుట నిలిచిన నన్నలా తేరి చూస్తావెందుకలా
ప్రతి సాయింత్రం వెలిగే అనురాగదీపాలన్నీ
నీ విరహావేదన చమురుతో వెలిగేవని
నాకు కాక మరెవరికి తెలుసని
కల్పాంతాల క్రితం విడిపోయిన మనం
అతీతమైన జగత్తులో కలిసే ఉన్నా
నిరీక్షించి నీరయ్యే నీ నేత్రాంచలాలు
నన్ను తడిపి నిదురలేపిందిప్పుడేగా
కాలం కలగాపులగమై కలగా మారిందని
కలత పడతావెందుకూ
నీ హృదయ తేజస్సును తడిమిచూడు
ఆ సింధూరాంబరం నీడలో.. నిలుచున్నది నేనేనని చెప్తుంది

// నీ కోసం 295 //

 ఇష్టమైన పరిమళం

ఊపిరికొసనైనా దాచుకోలేకపోయాక
దిగులుపడే సున్నితం
అప్పుడప్పుడూ వెలిగే చుక్కల్లా
మెరిసే జ్ఞాపకాలతో
గుండెకు బరువు
గాలివాలు గమనించక
మొదలెట్టిన పయనమంతా
కల్లోలభరితం
ఏకాంత వెన్నెల్లో
విషాదానికి పిలుపునిస్తే
అశాంతికి కదా ఆనందహేల
ఈ క్షణాన్ని అనుభవించడం తెలీక
రేపటికి ఈరోజు..
నిన్నవుతుందన్న బెంగ
కదిలే ఊహలు
నిజం కావని తెలిసీ
ఆస్వాదించే హృదయానిది మాత్రం
అక్షర నివేదన

// నీ కోసం 294 //

 Love s more easily demonstrated

than defined..
కళ్ళతో మాట్లాడటం తెలియదని చెప్పినా
లక్ష్యం లేనట్టు స్పందిస్తావెలా..
మదిలో మాటలన్నీ వినేసావేమో అనిపించేలా
ఎన్ని చిరునవ్వుల కానుకలిస్తావో
కలలోకొచ్చిన ప్రతిసారీ
మౌనంగా చెట్లను తడిపి హాయిని పంచే వెన్నెల్లా
ఒక్కటే నాదం కదా నీది
అందుకేనేమో..
అందమైన అనురాగపు నీ ఆత్మశక్తి
ఆస్వాదనలో పైస్థాయి
అలౌకికమైన అంతఃప్రయాణంలో నీతోనే అయినా
ప్రతిక్షణం అనుభూతులెన్నో పంచుకుంటున్నా
ఏదీ ఆశించకుండానే పరిమళించే పువ్వులా
ప్రేమించడం నేర్చుకోవాలి


// నీ కోసం 293 //

 అద్వైత యోగం #


అవును..
ప్రతీదీ ప్రేమగా మారొచ్చు..

విరిగిపోయి అతుక్కోవచ్చు
చిరిగిపోయినా రూపు దాల్చవచ్చు
ఎక్కువా.. తక్కువ సమతూకం వేయొచ్చు

Yeah.. Re-unification of Heart



ఒకటే మనసు.. దాని తీవ్రత..
తీయగానూ, చేదుగానూ..
సంతోషంగానూ, దిగులుగానూ
ప్రాణమొచ్చినట్టుగానూ, పిచ్చెక్కినట్టుగానూ
అనిపిస్తే...

ఒకసారి నిశ్శబ్దమే.. మరోసారి సంగీతం
ఒకసారి విచక్షణ కోల్పోతే.. ఇంకోసారి సంకల్పం
ఒకసారి ఊహే కదా అనుకుంటే, అదే జీవితమవ్వొచ్చు

U can b an Alchemist, who transforms
everything with Love.. 😇💞

// నీ కోసం 292 //

 జీవితపు విలువ తెలిసినవాడికి

రాత్రి చింపిరిదైనా
రంగుల కల దూరమనిపించదు

ఒక్కోమెట్టెక్కుతూ గుండెబరువు
దించుకునే ఆటలో
పాములు పడగెత్తినా
గొడుగులై కాపుతాయేమో

ముసురేసిన రోజున
పడమటకొండలకవతల వెలుతురుందని
చల్లగాలినీ వాడు ప్రేమిస్తాడు

వేకువకి ఆశల ఊయలెక్కేందుకు
కాలాన్ని కరగమని..
కొలిమిలోకి తొంగిచూసేవాడికి
నిట్టూర్పు సెగలో వేడి తెలియకపోవచ్చు

నిప్పుకణికల దేహపు నెత్తుటిచుక్కలు
మట్టిలో కలిసి మొలకలయ్యాక
ఆకాశం తనే అపరిచితాన్ని మరిచిపోతుంది

అప్పుడు
వాడి గుండె వెచ్చదనాన్ని
కావాలించేవారికి తెలిసిపోతుంది
ఎప్పటికీ ఆ బాహుసంకెల విడిచిపోరాదని 



// నీ కోసం 291 //

 వచ్చేస్తున్నా బంగారాలూ..

నన్నో అందమైన లోకానికి ఆహ్వానించావంటే
చీకటినెదిరించి నీ ఆధీనమయ్యేందుకు
దిక్కులు దాటి ఎగిరొస్తానంతే

లోలోపల మోహలాలస
ఉన్మత్తపు ఊహలా కన్నుల్లో నీరు నింపే
అపూర్వ క్షణాల కానుకలివేనేమో
దూదిపింజెలా తేలిపోతున్నా

ఎటు వెళదామో చెప్పు..
వీచేగాలికి సంయోగపు తీవ్రత తెలిసేలా
నిన్నూ నన్నూ తాకి, పిలుచుకు రమ్మన్న
ప్రేమలోకపు సామ్రాట్టుని వెతుకుదామన్నావా
ఇదిగో నే వస్తున్నా

అదిగాక..
వసంతరాగపు గమకాలు పాడే
కోయిల గూటికి పోదామంటావా
కొన్ని స్వరాలు నేనూ మోసుకొస్తా

నువ్వు రాసిన ప్రేమలేఖలో
తీపి మాటలు తాగానిన్నాళ్ళకి
మన ఎదురుచూపుల కలవరింతలు ముగిసేలా
మలుపుల్లో కలుసుకుందాం రమ్మంటే
అస్సలే కాదననుగా 



// నీ కోసం 290 //

 కొన్ని మాటలు నీ మౌనాన్ని దాటొస్తే ఎంత బాగున్నాయో. నా కోసం నువ్వు వెతికావన్న ఊహ మనసంతా బంగారు కాంతులు నింపింది.


సంగీతంలో మమేకమై నే తీసిన రాగానికి కోయిలమ్మ పాటతో సరి పోల్చావంటే నా గొంతుకి ముత్యాలహారం నువ్వలంకరించినట్లుంది. వెన్నెల తాగి పెదవి కందిందేమోనని నువ్వు ప్రశ్నించిన భావుకత నన్ను సిగ్గు పూలతో కప్పింది. నీ గుప్పెడు భావాలు కవిత్వంగా మారి నాలో పరిమళాలు నింపుతున్నట్లుంది.

మానసికంగా నీకు దగ్గరైన ఈ క్షణాల్లో నా విరహమెటు పోయిందో గమనించలేదు. మధురభావాలు నాలో అనంతమవుతుంటే.. ఇప్పుడీ కలస్వనాన్ని ఆపడం కష్టమే. ఊహల రసవాహినిలో మునుగుతూంటే, మళ్ళీ పల్లవి మొదలయ్యేలా ఉన్నదీ నిజమే.

తొలకరంటి చూపు చేసిన మాయకి ఈ రాతిరికెన్ని పులకింతలో రేపు వేకువకి నీకు నివేదిస్తాలే. నా కాటుకతో జత కట్టిన నీ కన్నులు ఇంకెన్ని కథలు చెప్తాయో వినాలనుంది. ఇప్పుడిక నీ పిలుపుకే నా ఎదురుచూపులు నన్ను నేను కొత్తగా వినేందుకు..



// నీ కోసం 289 //

 నేనో నిశ్శబ్దాన్ని..మాటలపై అలిగి అప్పుడప్పుడూ నిదానమైపోతుంటా. ఎన్నో భావాలూ, అనుభవాలూ, అనుభూతులూ క్షణం విరామం లేక మోస్తుంది నా గుండె. పైకంతా ఏదో కోపిష్టిగా కనిపిస్తున్న నేను నిజమైన నేను కాను. ఎన్నో మోసాలను క్షమిస్తూ మరెన్నో గాయాలను ఓర్చుకుంటూ మనసు కొంచం శిధిలమైనా..మరలా చిగురించేందుకు ప్రయత్నిస్తున్న మౌనాన్ని. జీవితపు ప్రయాణంలో పయనిస్తున్న ప్రతిసారీ ఎంతో ఏకాంతాన్ని ఎదుర్కుంటాను. తెలుసా అప్పుడంతా నీలో నేను శబ్దిస్తుంటాను. నీలో మరచిన అస్తిత్వాన్ని పలకరించేందుకు పైకి నిశ్శబ్దమవుతాను. నాకెటూ నన్ను తిరిగి తీసుకోవాలనే కాంక్షలేదు. నీలో సగమై నేనుప్పటి సమస్త జ్ఞాపకాలూ శబ్దిస్తుంటే.. అవి ఆలకించడమే నాకిష్టం...

కొన్నిరోజుల ఈ స్తబ్దత మరణసదృసమైనా..అల్లరిపరుగుల నీ అక్షరాల వెంట నా మనసు నిదురమాని మరీ వెంబడిస్తుంది. లోలోపల నీ మాటల్లో ఒలికిన అనుభూతులు గజిబిజి లాలిపాటగా వినబడుతున్నా రెప్పలు లయబద్దంగా నవ్వుతాయి తప్ప కలలను రమ్మనవు. మత్తుగా దాచుకున్న గుసగుసలన్నీ మెత్తగా పంచేందుకు చేస్తున్న నిరీక్షణ కొత్తజీవాన్ని నింపుతుంది నిజం..


// నీ కోసం 288 //

 



అద్వైతరహస్యానికి అర్ధం చెప్పేందుకు
కలల్లో బ్రతికే నన్ను కౌగిలించి
కన్నీటిని లెక్కబెట్టక
నీ ఊపిరి వెచ్చదనంతో చలి కాచుకొమ్మని
మనసుపొరల్లో మధురం నింపి..
అంతర్మధనం ఒకటే తెలుసనుకున్న చీకటికి
ఆనందించడమెలాగో నేర్పింది నువ్వే కదూ

అందుకే నిశ్చింతగా
వెన్నెల రాత్రి నీ విరహాలన్నీ నాకొదిలేసి
బుజ్జిపాపలా బజ్జున్నావా 

జీవనగతిలో దార్శినికతను వెతిక్కునే
వియద్గంగలా 
తామరాకు మీది నీటిబొట్టులా 
నీ సా(న్ని)హిత్యమే నా సౌందర్యమై
మదిలో నవ్వులు పూసింది నిజమైతే
ప్రేమాన్వీ..
మౌనంలో నీ స్పర్శ కొంచెం కొంచెం తెలుస్తుంది
ఈ అనుభూతి యోగాన్నిలానే ఉండనీ 


// నీ కోసం 287 //

 అరచేతుల్లో కలలు ముడుచుకుని

ప్రపంచమంతా తిరిగినా
ఎక్కడా పువ్వులు నవ్విన జాడ తెలియలేదు
కళ్ళు తెరిచే నిదురపోతున్నానని
ఎవరో చెప్తే, విషాదపు వీధిని వదిలి
కొన్ని మలుపులు తిరిగాను
చెట్టుచేమలు చిగురిస్తున్నా
వసంతాన్ని గుర్తించలేకపోయానని
మరింత కుంగిపోయాను
కన్నుల్లో సముద్రాలు పొంగి
పెదవుల తీరాన్ని చేరగానే గుర్తించాను
ఇన్నాళ్ళుగా ఘనీభవించిన గుండె కరిగి
ప్రవాహం మొదలయ్యిందని
ఈలోపునే...
శ్వాసలోకి పరిమళమెప్పుడొచ్చి చేరిందో
నా నవ్వులకే మత్తెక్కిపోతున్నారు ఇప్పుడందరూ


// నీ కోసం 286 //

 ఉద్గ్రంధంలా ఉండే నిన్ను

మౌనంగా అనుసరించాలనుకుంటానా

ఒక్కసారి మనసులోకి తొంగిచూసే వరకు
వివశత్వంలో పడిపోతుంటా
మల్లెనీ.. మరువాన్నీ కూడా
స్వాతిశయంతో వెక్కిరిస్తుంటానా
నా అందమైన అనుభూతులన్నీ
నీ సమక్షంలోని సువాసనలైనందుకే
క్షణకాలం భరించలేని విరహంతో
నీ ముద్దుమాటలు వినాలనుకుంటానా
విరామమెరుగని స్వరాల వెల్లువ
అలా మొదలైపోతుంది దానికదే
కాసేపు కునుకేసినా
కలగా నువ్వే వస్తావనుకుంటానా
ఈ తడికళ్ళ వేకువనిరీక్షణలోనే
రేయి ముగిసిపోతుంది అంతలోనే


// నీ కోసం 285 //

 నీ తలపులు మాత్రమే వినబడుతున్న ఈ సమయం

నిశ్శబ్దాన్ని నే పూజిస్తున్నాననా..

గుండె గొంతులోకొచ్చిన ఆనందం
చీకటిలో చెమరించిన చెంపకే తెలుస్తుంది
నా తేనెరంగు కన్నుల్లోంచీ
తీపి తాగేస్తున్నట్టు ఆ చూపు
నన్నంతా మత్తులో పడేస్తున్న ఈ క్షణాల్లో
ప్రేమవీచికల చిలిపిదనమంతా నాకే సొంతమనిపిస్తుంది
మోహపెడుతూ పిలుస్తున్న నీ అల్లరి
ఇంకాస్త పెరిగి ముత్యమంత ముద్దయ్యింది