Tuesday, 6 August 2019

// అమృతవాహిని..6 //

ప్రతిరేయీ క్షణాలను అపూర్వం చేసుకుంటూ నిన్ను రాసుకున్న రాతలన్నీ గుండెల్లో దాచుకున్న ఊహల చిత్రాల తాలూకు ఆనవాళ్ళు. బయట కురిసిన వెన్నెలే నా మదిలోనూ కురుస్తుందంటే..అదీ అమావస్యనాడు సహితంగా..ఏదో అతిశమనిపించవచ్చు కానీ ఆ చిరువేడికే మనసు ద్రవించి కన్నీరుగా జారుతున్న విషయమేమని చెప్పను. నీ చూపులూ మాటలూ ఒకదానితో ఒకటి పోటీపడి నన్ను లాలిస్తున్నా..నా విరహం తగ్గేదిలేదని మొరాయిస్తున్న సంగతేం చెప్పను. నిద్రొస్తుందని మనసు మారాం చేస్తున్నా మూతపడని కన్నుల దిగులు  ఏ భాషలో నీకు వివరించను. 

నేనో ప్రత్యేకమైన.. అపురూపమైనదాన్నని నువ్వు చెప్పేవరకూ తెలీదు. నిన్ను ధ్యానించడం తప్ప వేరే ధ్యాసలేని నన్ను లోకం పిచ్చిదానిగా ముద్రేసి ఎందుకూ పనికిరానిదాన్నని ఎన్నడో అనేసింది. జీవితమంతా వెతికి అలసిపోయిన నాకు రాబోయే కాలానికి  చిన్నారి ఆశలా నువ్వు ఎదురైనందుకే..ఎదకంతా పండుగలు. నిన్ను ప్రేమించేందుకే పుట్టానని అనిపించేలా మోగుతున్న గుడిగంటలు. ఇదంతా నీకూ అనుభవై ఉంటుందనే అపోహలో నిన్ను పదేపదే మాట్లాడమంటాను. 

నాలో కదిలే భావాలు నీ రూపాన్ని ధరించినందుకేగా దూరంగా ఉన్నా నిన్ను అల్లుకున్నట్టే భావిస్తాను. ప్రతిసారీ విన్నపాటే విన్నా..అందులో మనముండి మైమరచినట్టు ఒకటే నవ్వులు. చీకటిలో నేనున్నా నావైపొస్తున్న వెలుగు నీ తాలూకు వెన్నెలంటే విన్నవారు గింజుకుంటారేమో కానీ నాలో కదిలే సంగీతం నువ్వేనంటే ఒప్పుకోక తప్పదు. కలలోకి రమ్మంటూ కనులు మూసిన కాసిన క్షణాలకే నువ్ రాలేదేమని నిలదీసేందుకు లేచిపోతాను. ఆ అర్ధరాత్రి గుసగుసలతో నన్నెంతో బుజ్జగించి నిద్రించేలా చేస్తావు. తెల్లారుతూనే తిరిగి తడుముకొనే ఆ తపనేంటో ఈ జన్మకి అర్ధం కాదేమో..

No comments:

Post a Comment