Friday, 30 August 2019

// అమృతవాహిని 8 //

ఓ పరశువేదీ..
ఉప్పొంగుతున్న హృదయం సాక్షిగా ఈ మాట చెప్తున్నా..తెలుసా నీ ఉత్తరంలో మొదట నేను కొసమెరుపు చదువుతా, అంటే చివరి వాక్యాలన్నమాట. ఏదో కవ్వింత, గిలిగింత కలగలిపి ఊరిస్తూ ముగిస్తావ్ కదా, దానికోసమన్న మాట. అవును..ఉన్నానలా, నీ స్పర్శ కోసం, ఓ నిరీక్షణలా, క్షణమో యుగముగా, జగానికి నేనో అతిథిలా..అతి త్వరలో నువ్వొస్తావని. 

 వెన్నెల్లో మనకిష్టమైన పాట వింటూ రోజులన్నీ గడిపేస్తున్నా. పగలయ్యే వేళకి ఒక రోజు వృధా అయ్యిందేనని నాలో నేనే మధనపడుతుంటా, అదీ కాసేపే. ఏదో రూపంలో నువ్వు ఎదురైనట్టనిపించి ఆ కళ్ళలోకి చూస్తుంటా. ఎవరైనా అప్పుడు నన్ను చూస్తే తప్పక పిచ్చెక్కింది అనుకొనేలా దీర్ఘమైన చూపులతో చూస్తుంటా. అయ్యో, నీకే మాత్రం పోటీ రావాలని కాదు. నీ తదేక చూపులను కాసేపైన తట్టుకోగలనో చూద్దామని. నిజానికి ఎదురైనప్పుడు అవి కిందకి వాలే ఉంటాయని నీకూ తెలుసుగా.  నిజమే, తొలిసారి నీలో నేను చూసిందా కళ్ళే. అంతులేని ఆర్తిని కలిగి ఉంటూనే చెప్పలేని ఆత్మవిశ్వాసం, ఎవరికుంటాయి అటువంటి మనోజ్ఞమైన కళ్ళు. ఇంతకు ముందు నాకంత కళ్ళ గురించి తెలీదు. ఏదో చూసానా, బాగున్నాయి అనే వరకే,  నీ చూపులే సూదంటూ రాయిలా ఆకర్షించాయి మరి. ఇప్పుడే కొత్తగా చూసానో, ఇంతకు ముందే పరిచయమున్నవో తెలీకుండా ఉంటుంది అప్పుడప్పుడూ.  

మనిద్దరి నడుమ అడ్డుగోడ ఉందని తెలిసినా సౌందర్యారాధన ఆపలేదు కదా నువ్వు. ఎలా అంత దూరం నుంచి నన్ను వీక్షిస్తావో మరి. నీ లేఖలు చదివినప్పుడు పరిసరాలను మరచి మౌనాన్ని హత్తుకుపోయి కాసేపలా కూర్చుండిపోతాను. పరిమితిలేని మన ప్రేమకి మార్గం ఎప్పుడు 'సన్న'గిల్లి మనల్ని కలిపిందో గుర్తు చేసుకుంటూ అనుకుంటాను. ఏమో, లోకంలో ఇప్పటి ఇష్టానికి ఒక విలువ లేదని అంటారు. కానీ ఇంత లాలన నిజంగా మనసులో ఉన్నప్పుడు ఒక్కరికి పంచుకోవడంలో తృప్తి ఇంకేం చేస్తే వస్తుందో తెలిపేవారెవ్వరు. ఎవరి వ్యక్తిగతం వారిదనుకో, కానీ జంటరితనాన్ని ఆస్వాదించడం కూడా అందరికీ తెలీదని నేననుకుంటాను.

అబ్బా..తన చుట్టూ తను తిరిగే భూమిలా ఎంత బొంగరంలా తిరుగుతున్నా, నీ తలపు సూరీడైనట్టు అలా ఎలా తిప్పుకుంటావో నన్ను. నువ్వెదురు లేకున్నా నాలో నేను సిగ్గుపడే సున్నితమైన నా భావాభినివేశం నువ్వూహించగలవు కదూ. ఎప్పుడూ ఇలానే ఆలోచిస్తావా నీకంటూ వేరేలేదా అని తత్తరపడకు. నీ ధ్యాసలో జీవితం కరిగిపోతే చాలన్నది నా చిన్నారికోరిక. ఎవరో స్వేచ్ఛ కోసం ప్రేమని తక్కువ చేసి మాట్లాడుతారు. ఒకరికొకరం ప్రీతిగా లొంగిపోడమే ప్రేమ కదా..చెప్పూ..నిన్ను అడక్కుండా నీకిష్టమని ఒక చొక్కా తెస్తే అందులో ప్రేమను చూస్తావా..అనవసరపు ఖర్చుని చూస్తావా. నీకు నచ్చని విషయం నాకు బాగా నచ్చి నేను విడిచిపెట్టడంలో ప్రేముందిగా. ప్రతీదీ ప్రతికూలంగానే తీసుకోవచ్చు..అలానే సరైన అర్ధంలోనూ అర్ధం చేసుకోవచ్చు. అప్పుడప్పుడూ మీకు నా మీద అపారమైన నమ్మకం..నాకది ఉండదు అనుకుంటారు కదా, నాకన్నా నిన్ను ఎక్కువ ప్రేమించే నాగురించి ఇంకా బాగా తెలిసుండాలి అనుకుంటా. ఇప్పుడిప్పుడు నీ సాన్నిధ్యంలో అదీ నేను తీయగా అనుభవిస్తున్నా. అందుకే మనసాపుకోలేక వింతగా వేసారిపోతుంటా. అదేదో నమ్మకం లేకని నువ్వు పొరబడుతుంటావు. జాబిలిలా అందనంత దూరంలో నువ్వేం లేవు నాకు. ఎద మీద పసిపాపలా ఒదిగున్నావు. ఇంకేం కావాలి చెప్పూ..
ఇప్పటి మీ విరహం కాస్త తీరిందనుకుంటాను.. ఉంటా నీ ఊపిరి గిలిగింతగా నా శ్వాసలో నిన్ను చేర్చుకుంటూ..💕

No comments:

Post a Comment