Wednesday, 21 August 2019

// నీ కోసం 35 //

నీ  వెచ్చని కనురెప్పల పొత్తిళ్ళలో ఒదిగానంటే
హృదయానికి కొంచం వెలుగొచ్చుండాలి
అయినా అలనై పుట్టుండకపోనా..
తీరమై నువ్వు నిలబడతానని అప్పుడే చెప్పుంటే

ఎదురుచూపుల్లో నీ నిశ్శబ్దానికి నే మాటయినప్పుడు
జీవితమో కొత్త అర్ధమై కనిపించి ఉంటుందిగా
ఈసారి నిరీక్షణ నిజం చేసేందుకైనా నేనొస్తాలే

ఓహ్..
ఆ మాత్రం నమ్మకముంది నీకు..
గమనించు..నీ స్వరం ఇప్పుడు హెచ్చుస్థాయిలో పాడుతుంది
నీ తనువు తన్మయత్వంలో తేలుతుంది

ఎలానూ పూలపరిమళం అద్దుకున్నావుగా మనసంతా
తలపుల పున్నమికి తెరతీయడం నీది కదా ఆలశ్యం
అపూర్వక్షణాల ఇంద్రధనస్సుకి ఎనిమిదోరంగుంటుంది చూడు

రాలేనన్న అపోహలోనే
నే వస్తాననే చిన్నారి ఆశ
నీ పెదవులపై దరహాసమైంది కదూ

నువ్విలా దిగులుకావ్యాలు రాయాలనే కాసింత ఎడబాటు
ప్రేమలో విరహం మధురమవుతుందెలాగో రేపు నాకు చెప్పు..



No comments:

Post a Comment