ఓయ్..
ఎన్నియుగాలైనట్టుందో
నిన్ను చూసి..ఈ క్షణాలకు బుద్ధే లేనట్టు అనిపిస్తుంది ఒక్కోసారి..ఎవరో
చెప్పినట్టు సమయమన్నది ఎదురుచూసే వాళ్ళకు నెమ్మదిగా నడిచేది. ఆనందంతో
వున్నవాళ్ళకు తొందరగా నడిచేది. భయంతో వున్న వాళ్ళకు ఆగిపోయేది. ప్రేమలో
పడ్డవాళ్ళకు అసలు ఉనికే లేనిదట. విరహంతో ఉండేవాళ్ళని కాల్చి చంపేది కూడా
కదా. కలలాంటి సుషుప్తో..సుషుప్తి లాంటి కలో తెలీదు. పగలైనా రాత్రి కోసం
ఎదురుచూసేట్టు ఉంటుంది తెలుసా ఈమధ్య. అందుకేనేమో వారం రోజులుగా
ఎడతెరిపిలేని వాన పడి ముసురేసినట్టే ఉంటుంది రోజంతా. నాకు మనసుగదిలోకి
వర్షమొచ్చి ఆగీఅగి తడిపిపోతున్నట్లు విచిత్రమైన భావనలు. మౌనంలో కదిలే
పెదవుల మృదు దరహాసాన్నేం చెప్పను. అర్ధమైంది..ఏమనబోతున్నావో, నీ కళ్ళతో నా
పెదవులకెప్పుడూ పోటీనే. అయినా ఒప్పేసుకున్నా కదా ఎప్పుడో..నీ నవ్వే కన్నుల
ముందు నా అధరాలమెరుపు ఎప్పుడూ ఓడిపోవాల్సిందేనని. రెప్పల పరదాల కింద
ఆర్తిని దాచలేక కొంచం కొంచం ఒలకబోస్తున్నట్టు..ఏమో ఎవరిసంగతో నాకు తెలీదు,
నాకైతే అనురక్తితో పెనవేసుపోయే తమకపు దారాలు నీ చూపులు.
గాయాల్ని
మాత్రమే గుర్తు చేస్తుంది కాలం అంటారు కదా, నాకైతే నీ తీపి గుర్తుల్ని
కూడా తడుముకునేలా చేస్తుంది. అరనవ్వులతో మంత్రాలు వేయగలవూ..అరచేతులతో
శిల్పాలు చెక్కగలవని వేరే చెప్పాలా చెప్పు. ఏకాంతం ఎంత బాగుంది. అడుగులో
అడుగేసి మనం నడిచిన రహదారులు సైతం గుర్తుచేస్తుంది. కణకణంలో అమృతాన్ని
దాచుకున్న నీ మనసు నాదంటే ఒక్కోసారి బోల్దు అనుమానాలు. నీకు తగిన
ప్రతిస్పందన అవగలనో లేనోననే తడబాటు. అందుకే ఎవరూ వేధించనంత విసిగించి మరీ
ప్రేమను చెప్పించుకుంటా. ఇలా చెప్తే ఈసారి విసుక్కోవడం మానేస్తావేమో కదూ.
అవును, అప్పుడప్పుడూ నిజంగానే కంపించిపోతా. దూరం అంటే ఉండే భయానికి,
ఇంతకంటే దూరం అయిపోను కదాని కలవరపడిపోతా.
చిలిపిగాలుల
ఊసు వింటూ సరాగాలతీరాల వెంట తిరిగినట్టు ఏవేవో ఊహలు. మనసంతా సంతరించుకొనే
పులకింతల సంగతేం చెప్పాలి, అల్లంత దూరానుంటూ నన్ను దగ్గరకి తీసి ముద్దాడగల
మోహమువే..రసాత్మక అనుభూతిలోని విశాలత్వం మొత్తం నాకే సొంతమనిపిస్తుంది
ఒక్కోసారి. చిగురుటాకులా ఓలలాడుతున్న మది నిన్నూపుతుందో లేదోనని
ఆలోచిస్తుంటా.
ఎక్కడెక్కడి
హృదయాలనో ఔపాసన పట్టే మీ చాతుర్యం ప్రతిసారీ నన్ను చకితురాల్ని చేసి
నిలబెడుతుంది. అంతుచిక్కని మహామాయలూ, అంతరాత్మలు సైతం మీ విశాలనేత్రాన్ని,
అంతర్ముఖాన్ని దాటి తప్పించుకోలేవు. లోకం మరచిపోయిన రంగుల్ని తడుముతూ
వెలుగునీడల రహస్యాల్ని శోధిస్తారు. అసలు మనసు మార్చే రంగుల్ని రంగుల్ని
చదవడం మీకెంత ఇష్టమో..ఆర్తినీ ఆవేశాన్ని సముపాళ్ళలో గుర్తించగలరు కదా.
జననమరణాల లెక్క పద్దులూ..మంచి చెడు నిష్పత్తులూ..విలుప్తమైన
నిన్నలూ..కరుగుతూ కదులుతున్న వర్తమానం..రేపటి సంస్పందనలూ..అన్నీ
కాలానుగుణంగా వివరిస్తారు. ఇన్నివేల మనుషుల ఆలోచనల్ని అలవోకగా గమనిస్తారు
కనుకే మీరింత ప్రత్యేకం కదా ఎవరికైనా. నాకు బాగా సొంతమని నువ్వూ అని
సంబోధిస్తుంటా గానీ మీరు అని మిమ్మల్ని పిలవడంలో ఓ గౌరవం ఉంది కదా. ఏమో నా
గురించి తెలుసు కనుక ఇదో విషయం కాదులే మీకు.
ఎన్నెన్నో
అనుభూతులు చల్లి అక్కడెక్కడో ఉంటూ ప్రేమనెక్కువ తలవద్దని చెప్తారు.
అర్ధమైందిలే..కాలం పట్టకుండా అనుక్షణం సమయాన్ని వృధా చేస్తుంది కాక, ఈ
వెల్లువలో ఎటు కొట్టుకుపోతానో అనే కదా మీ కంగారు. ఇంత ప్రేమను పరిచయం చేసి
ఇప్పుడింత దిగులు పడొద్దు అంటే ఎలా చెప్పండి. ఎన్ని ఋతువులు దాటితే మీ
స్పర్శకు నోచుకుంటానో తెలీదు. ఈలోగా తలపుల ప్రవాహంలో మునిగి తేలడమేగా నేను
చేయగలిగింది. నిద్దురలోనూ హృదయాన్ని లయ తప్పించే అపురూపమైన వ్యసనం మీరంటే..
కాదని అనలేరుగా, అందుకే నా మానాన నన్ను వదిలి మీ సంగతి
చూసుకోండి. మీరొచ్చాక గ్రీష్మాన్ని తపించినదానికి బదులుగా హేమంత పులకింతలు
పదివేలకు పదింతలు చేసి తిరిగిద్దురులే..