Thursday, 9 December 2021
//నీ కోసం 420//
ప్రతి వేకువకీ అదృశ్య పరిమళమై వచ్చి
గాఢ నిద్రలో ఉన్న నిన్ను మేల్కొలపాలనుకుంటానా
వెచ్చదనం నుంచీ వేరు చేయొద్దంటూ
అరచూపుల నవ్వులతో అమాంతం కౌగిలిస్తావ్
శరత్కాలపు వెన్నెల్లా నీ కళ్ళు బాగున్నాయంటూ
రాత్రంతా రెప్పవాల్చకుండా అలా చూస్తూ..
పెదవిప్పని గుసగుసలతో ఏకాంతాన్ని కవ్వించి
అలిగిన మౌనంలో రేయిని అమృతం కురిపిస్తావ్
ఆదమరచిన భావాలు ఒంపుతా రమ్మంటూ
పొన్నపూల ప్రవాహంలో ఉక్కిరిబిక్కిరయ్యేట్టు చేసేసి
చీకటి దుప్పటి కప్పుకున్నా గుండెచలి తీరలేదంటూ
అపురూపమైన మాటల్ని సగం సగంలో ఆపేస్తుంటావ్
అపరిచిత రాగంలో చప్పుడు చేయని పాటలు పాడి
నీ చిలిపిదనపు ఊహల్లో ఊయలూపి ఊపి
చివరికి దెయ్యంలా వదలవంటూ విసుక్కుంటావు
నిజం చెప్పూ.. నువ్వా నేనా దెయ్యం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment