Thursday, 9 December 2021
అమృతవాహిని 22
మనస్వీ...
ఎలా ఉన్నావు, ఎక్కడికెళ్తే అక్కడ స్థిరపడిపోయి నన్ను మర్చిపోడమేనా ?!
ఎప్పుడు చూడు, కాలంతో పోటీ పడినట్లే పరుగులు పెడుతుంటావు. ఎక్కడున్నావో తెలుసుకోలేక నాలో నేను గింజుకుంటాను. తెల్లారి లేచింది మొదలు, ఇల్లూడ్చే చీపిరి నుంచి చిగురించే చెట్లదాకా నీ కబుర్లే చెప్తుంటాను. ఈ ఆకాశం విశాలంగా ఉండబట్టి నా మనసుని ఏమంత కసురుకోకుండా ఆలకిస్తుంది. తెలుసా, అయినా సరే, ఏపూట కాపూట నువ్వేం చేస్తుంటావోనని తోచినట్టు ఊహించుకుంటాను. నా నవ్వులన్నీ నీ పేర రాసుంచా కాబట్టి నువ్వు నన్ను తలచినప్పుడల్లా ఆహ్లాదంగానే అనిపిస్తా. నిన్ను పాడి పాడి అలసిపోయిన నా పెదవుల బెంగ నీకు తెలీదు కదా. నీ తలపుల్లో సోలిపోయే కళ్ళలోని కన్నీరు నిన్నింకా తపించేట్టు చేస్తుందంటే నమ్ముతావుగా.
నా చుట్టూ ఉన్న అందరూ చాలా బాగున్నట్టే అనిపిస్తున్నారు. పండుగ పనులన్నీ శ్రద్ధగా చేసుకుంటూ భక్తిగా ఉన్నారు. సగం అమ్మానాన్న లేనితనం, ఇంకో సగం, నీకు చేరువకాలేని తనం.. వెరసి నాదెప్పుడూ ఏకాకితనమే. బెంగగా ఉందని కాసేపు డాబా మీదకి రాగానే మెల్లిగా గాలొచ్చి ఆత్మీయంగా హత్తుకుంటుంది. ఆ సంగతలా ఉంచితే, మసకపొద్దు మొదలయ్యే సమయం నుంచీ చిమ్మచీకట్లోనూ నా కళ్ళకు ఒకే నక్షత్రం కనిపిస్తుంది. అందుకే దానికి నీ పేరు పెట్టుకుని పలకరిస్తున్నాను. అప్పుడప్పుడూ, మనోవీధిలో నీతో దాగుడుమూతలాడుతున్నట్టు మభ్యపడుతున్నాను..
కొండాకోనల్లో దారితప్పిన అలలా అయినా కలలోకైనా రావేమని అడగాలనుకుంటానా... గొంతులో ఆగిన భాష్పాలు గుండుసూదులై గుచ్చుతున్నందుకేమో సరిగా నిద్రయినా రాదు. అందుకే నిన్నూ ఏమీ అనలేక ఓర్పుగా ఇలా ఉంటున్నా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment