Thursday, 9 December 2021

//నీ కోసం 425//

Ohh.. it's raining in my heart చీకటివేళ నులివెచ్చని మత్తులా తీరాన్ని తడిపిపోయే అలల్లా సమ్మోహనమైన నీ తలపులు అర్ధంకాని అపరిచిత వర్ణంలోని రాగాలను రాయబారానికి పంపుతాయెందుకో My eyes r filled with u అసలే వశం కాని మనసు మొర ఆలకించలేక నేనుంటే కళ్ళల్లోకొచ్చి కూర్చుంది కాక దేహాతీత విషాదాన్ని అధిగమించమని ఈ ఓదార్పులెందుకో Are u really watching me thru an invisible cloak ఎక్కడుంటావో తెలుసుకోలేను ఏం చేస్తుంటావో అస్సలే అడగను దిక్కుతోచని పిచ్చుకలా తిరిగే నన్ను నిశ్శబ్ద రహస్యంలా అనుక్షణం అనుసరిస్తుంటావని మాత్రం అనుకుంటాను Feel like m sired to u పైకి రాలుగాయిలా కనిపిస్తూ లోపల నీదో రాతిగుండెని తెలిసినా ఆ పరిమళాన్నే శ్వాసిస్తున్నానంటే ఆత్మానుగత సొంతభావమిదేమో మరి

//నీ కోసం 424//

కలలన్నీ సముద్రపు ఒడ్డునే ముగుస్తున్నా వేకువకంతా పరిమళపు తోటల్లో మేల్కొంటున్నా మంచు ముత్యాల్లో నీ రూపాన్ని పోల్చుకుని సరదాపడినా అవి అదృశ్యయ్యే వేళకంతా గాయమై మిగులుతున్నా భావమూ, బెంగా నీ మీదనే అయినా కన్నూ, కన్నీరూ నాదే కదా ఏమో.. హేమంతాన్ని పరితపించినంతగా చలిని అలవాటు చేసుకోలేకపోతున్నా

//నీ కోసం 423//

Evng... చలి సాయింత్రం తలపులు తెరుచుకున్నా మనసుకి చెమట పట్టడం ఆగలేదు చీకటిలో చిరునవ్వులు పోగొట్టుకుని తీరికలేని విహంగంలా రెక్కాడుతున్నావని అపస్వరంలో నువ్వన్న మాటలన్నీ నిజమేనా Night.. మలిపొద్దు మత్తుగా మరలిపోతున్నా మన మధ్య దూరం తరగలేదు నా ఆవేదనా కన్నీరు మలుపులు తిరిగి నీ మది గుమ్మం ముందే వాగై నిలిచింది గమనించుకున్నావా Late nite.. అర్ధరాత్రి అస్థిమితంగా కదిలి మూడు గంటలు దాటింది నీ ముద్దు వేడి తగలని కన్నేమో మూతబడనంటుంది నిర్మలాకాశంలో చుక్కలు కదిలి మొగ్గ విచ్చుతూ పరిమళమొలుకుతున్న పూలను అలసిపోనివ్వక ఆశలు నింపుతున్నది చూసావా ఏమో.. కలలు పూచే వేకువ జామునైనా కాసేపు కౌగిలిస్తే నువ్వొచ్చి తలదాచుకొమ్మనేలా.. తొలికిరణం నాలో ఉత్సాహమదే నింపుతుందని కిటికీ తలుపులు తెరిచి మరీ నిదురను పిలుస్తున్నా

//నీ కోసం 422//

నిదురేరాని నాకు కలలు రావనే కదూ ఇష్టమైన పల్లవిలా పదే పదే గుర్తుకొస్తావ్ విచ్చుకున్న పువ్వులా నవ్వి ఎంత కాలమైందో నీ నిశ్శబ్దానికేమైనా తెలుస్తుందా క్షణమో యుగమై భారమవుతున్న చలిరోజుల ఉక్కపోతలు నీకసలు అనుభవానికొచ్చి ఉండవు ఉప్పొంగుతున్న అలలకు దిగులేంటో అడిగి చూడొకసారి నిన్ను విడిచొచ్చిన నా వేదనకి తాము సుళ్ళు తిరుగుతున్నాయని చెప్తాయి వర్తమానాన్ని కోల్పోతున్నానని జాలిపడి అక్షరం ఆసరా ఇవ్వబట్టి సరిపోయింది గానీ.. ఈ గుండె బరువుకి ఊపిరాగిపోయుండేది

//నీ కోసం 421//

ఉదయాన్నే నీ చూపులు తడిమినప్పుడంతా పురివిప్పిన పువ్వులా పరిమళించి అగరుపొగల ధూపాన్ని మించిపోయానా సాయింత్రపుగాలి కెరటమై వీచినప్పుడంతా గొంతు విప్పే ఏకాంతాన్ని నీ మౌనాలాపనగా ఆలపించానా మెత్తగా మత్తుగా ఉండే రాత్రులప్పుడు కాలాన్ని కవిత్వంతో ఆపి మరీ నీ చిరునవ్వులుగా రాసుకున్నానా గుండెల్లో దాచుకున్న ప్రేమనంతా గుక్కతిప్పుకోనివ్వని గానం చేసి లోలోపలి సంగీతాన్ని నిద్దుర లేపానా మధుర స్వప్నంలా నిన్ను తపించి చూపులతో ఎంత పిలిచానో.. తీరా నువ్వొచ్చినప్పుడేమో నిలువలేక వెనుదిరిగిపోయాను

//నీ కోసం 420//

ప్రతి వేకువకీ అదృశ్య పరిమళమై వచ్చి గాఢ నిద్రలో ఉన్న నిన్ను మేల్కొలపాలనుకుంటానా వెచ్చదనం నుంచీ వేరు చేయొద్దంటూ అరచూపుల నవ్వులతో అమాంతం కౌగిలిస్తావ్ శరత్కాలపు వెన్నెల్లా నీ కళ్ళు బాగున్నాయంటూ రాత్రంతా రెప్పవాల్చకుండా అలా చూస్తూ.. పెదవిప్పని గుసగుసలతో ఏకాంతాన్ని కవ్వించి అలిగిన మౌనంలో రేయిని అమృతం కురిపిస్తావ్ ఆదమరచిన భావాలు ఒంపుతా రమ్మంటూ పొన్నపూల ప్రవాహంలో ఉక్కిరిబిక్కిరయ్యేట్టు చేసేసి చీకటి దుప్పటి కప్పుకున్నా గుండెచలి తీరలేదంటూ అపురూపమైన మాటల్ని సగం సగంలో ఆపేస్తుంటావ్ అపరిచిత రాగంలో చప్పుడు చేయని పాటలు పాడి నీ చిలిపిదనపు ఊహల్లో ఊయలూపి ఊపి చివరికి దెయ్యంలా వదలవంటూ విసుక్కుంటావు నిజం చెప్పూ.. నువ్వా నేనా దెయ్యం

//నీ కోసం 419//

1. అవధుల్లేని కాలం సమ్మోహనమై కదులుతున్నా కొన్ని క్షణాలు మన అరచేతుల గుప్పిట్లోనే పదిలం చేసా నిన్ను కలిసానన్న ఆనందమే లేకుంటే ఈరోజు నాకెందుకింత విషాదం 2. సన్నని తెరలా కన్నీటి పొర కన్నుల్లో.. దానిమ్మపువ్వులా నీ నవ్వేమో, అప్పుడెప్పుడో చిన్నప్పుడు లెక్కించిన తారలన్నీ చీకటిలో నువ్వు లెక్కించ వీల్లేని కనుమెరుపులుగా.. 3. నాలో నిరంతర ధ్యానమిక మొదలైనట్టే మనసు వణికిన అలజడి తెలిస్తే ముందే చెప్పు చిలిపి గుసగుసల కావ్యమొకటి కలిసే రాసుకుందాం

//నీ కోసం 418//

ఎంతగా మారిపోయింది నీ నవ్వు నిద్దురలో నేను ఉలిక్కిపడేలా కలల్లో వెతుక్కుంటూ మరీ వచ్చి ముద్దు చేసే ఆ పెదవుల భాష మూగబోయింది మన కనుపాపల కేరింతల్లో కాలం కరిగి కొన్ని మౌనాలకి మాటసాయమై ఒకరినొకరు ఇష్టంగా చదువుకున్నప్పుడు మనసులోపలి చిలిపిదనం కన్నుల కొసమెరుపుగా వెలిగి నారింజ సాయింత్రంలా ఉండేది కదూ వెలుతురు నుంచి చీకట్లోకి దూకుతూనే రెప్పలకు వేళ్ళాడుతున్న మత్తునాపుకుంటూ వెచ్చని పాటల్లోకి వలస పోయినప్పుడేమో తమకంతో తూలిపోయే రాగాలుగా అనంతానంత లోకాల్ని పరిచయించి ఎదలోయల్లో వెన్నెల గుమ్మరించేది కూడా Hmm .. సరేలే.. దిగులు దాటేందుకు ఇంకో నాలుగడుగులు గాయాన్ని కొంత మాననీ తడిచూపు తేలికై తరంగమైనప్పుడు అదే తిరిగొస్తుందిలే

//నీ కోసం 417//

ఒక్కో పదం ఒక్కో వాక్యంగా మారుతున్నప్పుడు నువ్వెదురుగా ఉన్నట్టే అనిపించే దృశ్యం కాలాన్ని తప్పుకుని నాకోసం రావడం ఎప్పటికీ నాకెంతో ఇష్టమైన స్వప్నం

//నీ కోసం 416//

ఈ రెప్పల కింద దీపాలు అందంగా నిన్ను ఆహ్వానించు రహస్య ద్వారాలు ఎడబాటుని ఎగిరేసే నువ్వున్న కలలేమో అమావస్యంటూ ఉందని తెలియని రాత్రుళ్ళు దిగుళ్ళను దాచేసే నవ్వులుంటాయ్ కనుకనే తారావళి కొసల్లో అన్నేసి మెరుపులు ఏమయితేనేం.. నీ పరిష్వంగపు కార్చిచ్చు ముందు ఈ పండుగ వెచ్చదనం అదేమంత కాదులే

//నీ కోసం 415//

ఏదో చెప్పాలనుకుంటాను, ఎన్నో వినాలనుకుంటాను ఏది చెప్పినా తెలుసు అనేస్తావు.. ఏదన్నా చెప్పమంటే నీకన్నీ తెలుసంటావు.. నా సగం నీ దగ్గర, నీ సగం నా దగ్గర ఉన్నా కూడా తమీ తీరని అసంతృప్తి. వికసిస్తుందో, వాడిపోతుందో తెలియని సాయింత్రమిది చలిగాలి మరీ ముల్లులా గుచ్చుతుంది నీ మనసులాగే ఏదో బరువు మోస్తూ, ఇక్కడ ప్రకృతి మబ్బుపట్టి స్తబ్దుగా ఉంది వానకోయిలలూ లేవూ, సందేశాలంతకంటే లేవు అన్నీ అందంగానే ఉండుంటాయేమో., ఆస్వాదించే మనసే లేదిప్పుడు.. ఎన్నిసార్లు ఊయలూపినా నీ దగ్గరకొచ్చి ఆగిపోతుంది తెలుసుగా రాయకుండా ఉండలేనితనం కాదిది నీ నుంచీ నీలోకే ఒదిగిపోతున్న నా మౌనానిది

//నీ కోసం 414//

కొన్ని దీపాలు సువాసనలతో మత్తెక్కిస్తుంటే ఇంకొన్ని కేవలం వెలుగునిస్తూ ఉదాత్తంగా ఉండిపోతాయి కలలు వాస్తవాన్ని ఆవిష్కరిస్తాయంటారు గానీ రాలిపడ్డ కన్నీటి జాడలు ఏ సంధికాలంలోనూ చప్పుడు చేయనీయవు దీర్ఘకాలంగా ఎండిపోయిన ప్రవాహంలోని రంగులు మెరుపులుగా తప్ప పునర్లిఖించేందుకు పనికి రావు ఏమో, నేనో మాయా నక్షత్రాన్నేమో ఏరికోరి నన్ను వెతికేలోపు ఎన్ని పోగులుగా రాలిపడతానో

//నీ కోసం 413//

అలసిపోయిన ఆకు దిగులు దేహాన్ని దాటి మరీ హృదయాన్నావహిస్తుంటే... అశాంతికి అనేక ముళ్ళున్నట్టు భరించలేని విచారం కారణాలకందని కన్నీటి పర్యంతం సరిహద్దులు ఎగిసి మరీ నిర్లిప్తపు సంకేతాలందించినా అలవికాని నిట్టూర్పుల ఆగంలో రెక్కలు మొలిపించుకున్నా రాలేని ప్రవాసమంత ఈ దూరం నువ్వో చూపుకందని గోధూళి స్వప్నం మలుపు మలుపుకీ గాయపడుతున్న మనసు తడబాటు క్షణాల విరుద్దరాగాల విషాదపు కచేరిలో చలిగాలులకలవాటులేని నిశ్చలత్వం చీకట్లో నీడలు నడుస్తున్న నిశ్శబ్దం Pch.. తప్పదు.. తట్టుకుందాం కాలం కనికరించి ఈ రాకాసి రోజులు అంతమయ్యేవరకూ అప్రమత్తతను కప్పుకుందాం !! చిన్ని చిన్ని మాటల వంతెనేసుకుని కలుసుకుందాం

//నీ కోసం 412//

నా నిరీక్షణలోని ఓ దీర్ఘశ్వాస ఊహకవతలి అక్షరాలను వెతుక్కుంటూ కాలాన్ని ఏమార్చిన సంగతి చీకటయ్యేదాకా తెలుసుకోలేకపోయింది రవ్వంత నవ్వు చిగురించిన ఈ క్షణాల తాకిడి అవధులు మరచిన అలల గలగలలా నులివెచ్చని అనుభూతిలో మునకలేయించింది ఎటు చూసినా వర్షం రాలిన చినుకులన్నిటినీ మార్చి మార్చి ఏవైపు నుండీ చూసినా నీ పదాలు చిత్తడి చేస్తున్నట్టే ఉంది మరి

అమృతవాహిని 22

మనస్వీ... ఎలా ఉన్నావు, ఎక్కడికెళ్తే అక్కడ స్థిరపడిపోయి నన్ను మర్చిపోడమేనా ?! ఎప్పుడు చూడు, కాలంతో పోటీ పడినట్లే పరుగులు పెడుతుంటావు. ఎక్కడున్నావో తెలుసుకోలేక నాలో నేను గింజుకుంటాను. తెల్లారి లేచింది మొదలు, ఇల్లూడ్చే చీపిరి నుంచి చిగురించే చెట్లదాకా నీ కబుర్లే చెప్తుంటాను. ఈ ఆకాశం విశాలంగా ఉండబట్టి నా మనసుని ఏమంత కసురుకోకుండా ఆలకిస్తుంది. తెలుసా, అయినా సరే, ఏపూట కాపూట నువ్వేం చేస్తుంటావోనని తోచినట్టు ఊహించుకుంటాను. నా నవ్వులన్నీ నీ పేర రాసుంచా కాబట్టి నువ్వు నన్ను తలచినప్పుడల్లా ఆహ్లాదంగానే అనిపిస్తా. నిన్ను పాడి పాడి అలసిపోయిన నా పెదవుల బెంగ నీకు తెలీదు కదా. నీ తలపుల్లో సోలిపోయే కళ్ళలోని కన్నీరు నిన్నింకా తపించేట్టు చేస్తుందంటే నమ్ముతావుగా. నా చుట్టూ ఉన్న అందరూ చాలా బాగున్నట్టే అనిపిస్తున్నారు. పండుగ పనులన్నీ శ్రద్ధగా చేసుకుంటూ భక్తిగా ఉన్నారు. సగం అమ్మానాన్న లేనితనం, ఇంకో సగం, నీకు చేరువకాలేని తనం.. వెరసి నాదెప్పుడూ ఏకాకితనమే. బెంగగా ఉందని కాసేపు డాబా మీదకి రాగానే మెల్లిగా గాలొచ్చి ఆత్మీయంగా హత్తుకుంటుంది. ఆ సంగతలా ఉంచితే, మసకపొద్దు మొదలయ్యే సమయం నుంచీ చిమ్మచీకట్లోనూ నా కళ్ళకు ఒకే నక్షత్రం కనిపిస్తుంది. అందుకే దానికి నీ పేరు పెట్టుకుని పలకరిస్తున్నాను. అప్పుడప్పుడూ, మనోవీధిలో నీతో దాగుడుమూతలాడుతున్నట్టు మభ్యపడుతున్నాను.. కొండాకోనల్లో దారితప్పిన అలలా అయినా కలలోకైనా రావేమని అడగాలనుకుంటానా... గొంతులో ఆగిన భాష్పాలు గుండుసూదులై గుచ్చుతున్నందుకేమో సరిగా నిద్రయినా రాదు. అందుకే నిన్నూ ఏమీ అనలేక ఓర్పుగా ఇలా ఉంటున్నా

//నీ కోసం 411//

శీతాకాలం చలిగాలికేం చెప్పావో నా గదిలో వెచ్చదనానికి విలువనిచ్చి చప్పుడు చేయకుండా తప్పుకుంది నువ్వు చెప్పినందుకే క్షణాల్ని 'క్షణాలు'గా అనుభవిస్తున్నానా.. నీ ఆత్మపరిచయంగా నువ్వు పాడిన జోలపాటకి స్పందించేందుకే నిద్రలోకి జారేందుకు చూస్తున్నా.. ఏమో.. ఏకాంతానికి విసుగొచ్చి కాలాన్ని కదలమన్నా కానీ కదలనందుకేమో.. నీ విరహమ్మాత్రం నిర్విరామంగా కనురెప్పలను కలవకుండా చేస్తుంది

//నీ కోసం 410//

ఏమో నాకైతే చిరుచలిగా ఉంది శరత్తు సగం కూడా కదలకుండానే హేమంతాన్ని పిలిచినట్టుంది నిశ్శబ్దమంటేనే భయపడే నేను, కొన్ని సవ్వళ్ళకి ఉలిక్కిపడి ఇష్టమైన పుస్తకాన్నీ చదవలేకపోతున్నానా.. సాయింత్రం ముగుస్తూనే చిన్నగా వణుకు మొదలయ్యి ఏవో పురా జ్ఞాపకాలు గుండెపొరల్ని కదుపుతూ కొన్ని దిగులు పాటల్ని గుర్తుకు తెస్తున్నాయి. అదో కలవరమో, దుర్బలత్వమో గుబురు చీకట్ల భయానక అస్తిత్వమో ఎడారిపువ్వుల నిర్లిప్త ఒంటరితనమో మరి.. Hmmm, as u r my better place.. కొన్ని మాటలతో సముదాయించి గోరువెచ్చని కూనిరాగాలతో జోలపాడి నా వెన్ను నిమిరే స్నేహం నువ్వే కదా మొత్తంగా ముడుచుకుని నీ రెప్పలకింద దాక్కుండిపోవాలని పదేపదే అదే కోరిక తలపోస్తుంది మది

//నీ కోసం 409//

నీ పెదవులు అలసిపోవడం ఇష్టం లేక నువ్వెక్కువ మాట్లాడకున్నా ఆ మౌనాన్ని Synthesizerలో వినగలుగుతాను.. ఒక్కచూపు విరితూపుగా సొగసుకి సోయగమిచ్చావని మళ్ళీమళ్ళీ నీ కన్నుల్లో ఒదగాలనే పదేపదే anxiousగా పడిగాపులు కాస్తుంటాను నిన్ను కలిసిన సాయింత్రపు గుండెల్లోని తత్తరపాటు జ్ఞాపకాల అలలై ముంచెత్తినప్పుడంతా తడిచి తడిచి emotionsని మోస్తుంటాను ఆకాశంలా అందనంత దూరంగా నువ్వున్నా కోరుకున్న క్షణంలో దగ్గరగా అనిపిస్తావని విరహాన్ని withdraw చేసి చల్లబడుతుంటాను అప్పుడప్పుడూ వచ్చే మేఘసందేశంలో గొంతెత్తి పిలిచే నీ తీయని పిలుపులు వినబడి ప్రణయావేశపు కొత్త lyricsని పాడుతుంటాను ఏం బెంగపడొద్దని చెప్పావ్ కదా.. అందుకే మరి నా చిరునవ్వుల్లో మొలకెత్తే నీ fragranceని భావుకతగా తలచి ఆస్వాదిస్తుంటాను

//నీ కోసం 408//

చుక్కలు మెరుస్తున్న నీలాకాశాన్ని చూడగానే నీ జ్ఞాపకాల్లో నిలిచిపోతున్నా నిన్ను ధ్యానించేందుకని అరచేతులు కలపుకోగానే ఎంతకీ అంతమవని ఆ విశాల మైదానంలో నేనూ పారదర్శకమై తప్పిపోతున్నా నీ నవ్వులన్నీ తనే దాచుకున్నట్లు ఈ గాలి నన్ను పులకరింతై చుట్టుకుని పట్టుతప్పిస్తున్న సమయం నా పెదవంచున నీ కవిత్వపు సుతారాన్ని పాడుతున్నా ఈ పువ్వులకింత గంధం ఎక్కడిదోనని నిశ్శబ్దం రాల్చుతున్న వివశత్వపు పుప్పొడికి అరమోడ్చుతున్న కళ్ళనూ మూయలేకున్నా నిద్రపట్టని రాత్రులన్నీ ఇంతే.. ఎక్కడో ఉన్న నువ్వు నా నిరీక్షణా క్షణాల సవ్వడికి చీకటిగుహలోంచీ వాస్తవంలోకొస్తావని ఆత్మరతిని కొనసాగిస్తున్నా..

//నీ కోసం 407//

సగంసగం అందీ అందని ఆకుపచ్చటి కలలోని పులకరింతలా ఎన్నినాళ్ళు నన్నిలా వెంబడిస్తావ్ పలకరింపు పేరుతో గుర్తుకొచ్చి అభ్యంగనాంతరపు అమితమైన నిద్రాసక్తిని ఏమీ తెలీనట్లు క్షణాలలో తుడిచిపారేస్తావ్ వారం వర్జ్యాల లెక్కలేకనే అర్ధంకాని అనుభూతులు ప్రతిస్పందించినట్లు నీ ధ్యాసలోని తీపిని మభ్యపెడుతుంటావ్ ఒక్కసారన్నా నాతో నన్ను గడపనీయక నిశ్శబ్దాన్ని భగ్నం చేసినట్టు నా ఆదమరుపుని అధాటుగా అల్లుకునేస్తావ్ అబ్బబ్బా.. ఏమంటున్నావో తెలుసులే ఊపిరి తీయరాని హడావుడిలో నువ్వుంటే అల్లరికాపు కాసి గుసగుసలు మొదలెట్టింది నేనేనని కదా !! What to do.. I'm embraced by ur voice out of d blues

//నీ కోసం 406//

పొద్దు మారిపోయే వేళ కొన్ని పరిమళాలు పువ్వులనొదిలి పరిసరాలను అలజడి పెడుతుంటాయి ఆగి ఆగి రాలుతున్న ఆకులేమో ఏవో మాటలు మననం చేస్తున్నట్లు మృదువైన ప్రకంపనలు మదికందిస్తాయి మౌనంగా మొదలయ్యే వాక్యాలేమో అప్పటికప్పుడు ప్రాణం లేచొచ్చినట్లు పెదవాపుకోలేని వెల్లువలవుతాయి శరద్వలువలు విడిచే వెన్నెలలేమో ఆకాశాన్ని దాటొచ్చి మరీ పున్నమిని అందంగా మార్చేస్తాయి